రాజశేఖర్ రెడ్డి బిడ్డల్లో ఎవరు తెలివైన నేత ? ఈ వ్రశ్న ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ అభిమానుల్లో విస్తృతంగా చర్చనీయాంశమవుతోంది. ఎందుకంటే తమ రాజకీయ భవిష్యత్ కోసం వారిద్దరిలో ఒకరిని ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి త్వరలోనే ఇస్తుందన్న ఓ క్లారిటీ వారిలో కనిపిస్తోంది. అందుకే వారి నాయకత్వ సామర్థ్యంపై చర్చ జరుగుతోంది.
జగన్ రెడ్డిని ఏ కోణంలో చూస్తే సమర్థుడో చెప్పడానికి వైసీపీ నేతలకు, కార్యకర్తలకు ఒక్క ఆధారం కూడా కనిపించడంలేదు. ఆయన నిజంగా సమర్థుడు అయితే కనీసం సొంత కుటుంబాన్ని అయినా చక్కగా చూసుకునేవాడని.. ఏమైనా సమస్యలు ఉంటే అంతర్గతంగా పరిష్కరించుకునేవారని అంటున్నారు. షర్మిల రాజకీయ జీవితాన్ని ఎప్పుడూ కోరుకోలేదు. వైసీపీ కోసం జగన్ కోసం కష్టపడినా ఆమె తనకు పదవులు ఇవ్వలేదని ఎప్పుడూ పంచాయతీ పెట్టలేదు. జగన్ చెప్పినట్లే విన్నారు. తల్లి, చెల్లి ఇద్దరూ 2019 ఎన్నికల్లో ఊరూవాడా తిరిగి చేసిన ప్రచారాన్ని ఎవరూ మర్చిపోలేరు. అంతకు ముందు షర్మిల పాదయాత్ర కూడా.
కానీ అలాంటి షర్మిలకు మరో ఆప్షన్ లేకుండా చేశారు జగన్ రెడ్డి. తన నికృష్టపు పాలనతో ప్రజలకు టీడీపీకి ఓటువేయడం తప్ప మరో దారి లేకుండా చేసిన ఆయన…షర్మిలకూ రాజకీయం తప్ప మరో ఆప్షన్ లేకుండా చేశారు. ఏం చేసుకోవాలో కూడా తెలియనంత భారీగా ఆస్తులు ఉన్న ఆయన తన సోదరికి సగం ఇస్తే ఇప్పటికే తల్లి, చెల్లి ఆయన కోసం గొప్పగా ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు వారిని శత్రువుల్ని చేసుకున్నారు. అదే సమయంలో షర్మిల జగన్ మైండ్ సెట్‌ను.. ఆయన వ్యక్తిత్వాన్ని ప్రజల్లో పెడుతున్నారు. శాడిస్ట్ లాంటి జగన్ ను ఎలా భరిస్తారని వైసీపీ శ్రేణుల్ని ప్రశ్నిస్తున్నారు.
తల్లి, చెల్లికే న్యాయం చేయలేని వాడు కార్యకర్తలకు న్యాయం చేస్తారని ఎవరూ అనుకోరు. పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో కార్యకర్తల్ని జగన్ పట్టించుకోలేదు. తర్వాత అయినా పట్టించుకుంటారన్న నమ్మకం లేదు. అందుకే షర్మిలనే మంచి ఆప్షన్ అని ఎక్కువ మంది వైసీపీ క్యాడర్ అనుకుంటున్నారు. ఈ అభిప్రాయం పెరిగిపోతే.. జగన్ కు మరితం గడ్డు పరిస్థితి వస్తుంది.