నంద్యాల రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కాదు కాదు.. తెలుగుదేశమే అలా మార్చేసిందని చెప్పాలి! భూమా నాగిరెడ్డి మరణం తరువాత ఉప ఎన్నిక గురించి చర్చ మొదలెట్టిందీ ఆ పార్టీ. నిజానికి, ఎమ్మెల్యేగా భూమా గెలిచింది వైకాపా టిక్కెట్ మీద. కానీ, మరణించే సమాయానికి ఆయన తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి… అది తమ స్థానమే అన్నట్టుగా తెలుగుదేశం ఓన్ చేసేసుకుంది. నంద్యాల నియోజక వర్గం సాంకేతికంగా వైకాపాదే అయినా.. టీడీపీ మాత్రం అది తమ హక్కు అన్నట్టుగా మాట్లాడుతోంది. అంతేకాదు.. ఆ మాటల్ని భూమా కుమార్తె అఖిల ప్రియతో కూడా మాట్లాడిస్తోందన్న అభిప్రాయం కలుగుతోంది.
భూమా మరణించిన తరువాత… వెంటనే అఖిల ప్రియను అసెంబ్లీకి రమ్మని కబురంపిన సంగతి తెలిసిందే. సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ తీర్మానంపై రకరకాల విమర్శలు కూడా గుప్పుమన్న విషయమూ విదితమే. అయితే, ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక గురించి తెలుగుదేశం తెగ ఆరాట పడిపోతూ ఉండటం గమనార్హం! అంతేకాదు… ఈ ఉప ఎన్నిక విషయమై ఏవీ కామెంట్స్ చెయ్యొద్దని అఖిల ప్రియకు సూచించినట్టుగా అనిపిస్తోంది. ఆమె మాటల్లో అదే ధ్వనిస్తోంది. ఉప ఎన్నిక విషయమై మాట్లాడేందుకు ఆమె నిరాకరిస్తున్నారు. అంతా పార్టీ అభీష్టం మేరకే జరుగుతుందని ఆమె చెబుతున్నారు.
తమ కుటుంబం ఏనాడూ ఎలాంటి పదవులూ ఆశించి రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. తనకు మంత్రి పదవి ఇస్తుందా రాదా అనే చర్చపై కూడా ఆమె స్పందించడానికి నిరాకరిస్తున్నారు. భూమా మరణం తరువాత అఖిల ప్రియ మీడియాతో ఎలా మాట్లాడాలో కూడా తెలుగుదేశం పార్టీయే నిర్దేశించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందుకే, ఆమెను భూమా మరణించిన వెంటనే రప్పించుకున్నారనీ, ఇకపై అంతా తాము చెప్పినట్టు మాత్రమే మాట్లాడాలని పార్టీ పెద్దలు ఆమెకు హితబోధ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అయితే, అండర్ కరెంట్‌గా భూమా వర్గాన్ని మరింత బలహీనం చేయడమే తెలుగుదేశం వ్యూహంగా కనిపిస్తోందన్న అభిప్రాయమూ వ్యక్తమౌతోంది. భూమా పార్టీ మారక ముందు నుంచీ ఆ వర్గంపై టీడీపీ ఒత్తిడి ఉందనీ… ఆయన పార్టీ మారడానికి కారణాలు కూడా అధికార పార్టీ ఒత్తిళ్లే కారణం అనే ఆరోపణ ఎటూ ఉంది. ఇప్పుడు భూమా మరణంలో ఆ వర్గం దిక్కులేనిదైపోయింది. వారంతా తెలుగుదేశంపై ఆధారపడేలా చేయాలంటే… ముందుగా భూమా వారసులు పార్టీపై డిపెండెన్సీ పెంచుకోవాలి. సో… అఖిల ప్రియ విషయంలో టీడీపీ అమలు చేస్తున్న వ్యూహం ఇదే అంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.