కేసీఆర్ ప్రత్యేక హోదాకు మద్దతు పలికారు. అందుకే ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చిస్తున్నామని… దీన్నే చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని.. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్పుకొస్తున్నారు. నిజమే.. కేసీఆర్ ప్రత్యేకహోదాకు ఆయన మద్దతు పలికారు .. ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించొచ్చు… గతంలో… అదీ కూడా… రెండు నెలల కిందట జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అదే ప్రత్యేక హోదా కోసం.. అదే టీఆర్ఎస్, కేసీఆర్ నేతలు ఎన్నికల ప్రచారసభల్లో ఎం చెప్పారన్న విషయం మర్చిపోదాం..!. మరి ప్రత్యేక హోదా కోసం.. కేసీఆర్ ఒక్కరే మద్దతు తెలిపారా…? మద్దతు తెలిపిన కాంగ్రెస్‌ను ఎందుకు మద్దతు ఇవ్వరు..?
కాంగ్రెస్ కన్నా టీఆర్ఎస్ హోదా పెద్దదా..?
రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీ. ఆ సమయంలో ఏపీకి లభించిన హామీ ప్రత్యేకహోదా. బీజేపీ పట్టుబట్టి సాధించింది. కానీ ఇవ్వలేదు. కానీ.. తామిచ్చిన హామీ కాబట్టి.. అలు చేస్తామని.. తప్పు దిద్దుకుంటామంటోంది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ అధ్యక్షుడు.., రాహుల్ గాంధీ… ప్రవాసాంధ్రులు ఎక్కడ కనిపించినా.., ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చి తీరుతామని ప్రకటిస్తున్నారు. తెలంగాణ గడ్డ పై నుంచి సోనియాగాంధీ కూడా ప్రకటించారు. ప్రత్యేకహోదా ఇస్తామని.. ఇంత ఏకపక్షంగా.. గట్టిగా చెబుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కానీ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం… కాంగ్రెస్ పార్టీని ఏ మాత్రం విశ్వసించడం లేదు. కారణం ఏమిటి..?. కానీ… ఏపీ ప్రత్యేకహోదా విషయంలో అనేక పిల్లిమొగ్గలు వేసి.. తెలంగాణ ప్రయోజనాల కోసం మాత్రమే పని చేసే టీఆర్ఎస్… హోదాకు మద్దతు అనగానే పరుగులు పెట్టుకుంటూ పోటీ కూటమిగా మారే ప్రయత్నాలు చేయడం సందేహం..!
హోదాకు టీఆర్ఎస్ మద్దతు ఏ విధంగా ఉపయోగపడుతుంది..?
హోదా సాధనే లక్ష్యం అయితే.. ఎవరు ఇవ్వగలరు..? ఎవరు సాధించగలరన్న విశ్లేషణ చేసుకుంటారు. అలాంటి విశ్లేషణ చేసుకున్నా… ముందుగా కాంగ్రెస్ పార్టీనే రేసులో ఉంటుంది. కేంద్రంలో అధికారంలోకి రావాలంటే… బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీలకే సాధ్యం. ఆ పార్టీలు లేదా.. ఆ పార్టీలు మద్దతిచ్చిన కూటములు రావాలి. లేదా ఆ ఆ పార్టీలకే కూటములు మద్దతివ్వాలి. అంతే కానీ.. 17 పార్లమెంట్ స్థానాలున్న.. తెలంగాణ అధికార పార్టీకి. పోలోమంటూ పరుగెత్తుకు వచ్చి పార్టీలు మద్దతిచ్చే అవకాశం లేదు. ఏ విధంగా చూసినా.. టీఆర్ఎస్ హోదా కన్నా.. కాంగ్రెస్ హోదానే… ప్రత్యేక హోదా ఇచ్చే .. సాధించే విషయంలో చాలా పెద్దది. కానీ.. ఎందుకు… కాంగ్రెస్ కన్నా.. టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు..?
ఎన్నికల తర్వాత కలసి కట్టుగా బీజేపీ గూటికి చేరడానికేనా..?
జగన్‌కు కావాల్సింది ఏపీకి ప్రత్యేకహోదా కాదు.. తనకు ప్రత్యేకహోదా కోసమే ఆయన పోరాడుతున్నారని.. తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది. ఎన్నికల తర్వాత ఎలాగూ.. బీజేపీ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ రాదు. ఏపీలో కేసీఆర్, తెలంగాణలో జగన్ పార్టీలు.. సాధించే సీట్లతో.. బీజేపీకి మద్దతివ్వాలనే వ్యూహంతోనే.. ఈ రాజకీయం నడుస్తోంది. ఇక్కడ ప్రత్యేకహోదా ప్రజల్ని మోసగించడానికేనన్న అభిప్రాయం ఏర్పడుతోంది. ఇందులో వేరే అర్థం కూడా ఏమీ లేదు..!
-సుభాష్