పార్టీపై పట్టు బిగించే ప్రయత్నంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్‌కు .. కర్నూలు జిల్లాలో షాక్ తగిలినంత పనైంది. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్.. టిక్కెట్లు ప్రకటించడానికి.. నారా లోకేష్ ఎవరని కాస్త సౌమ్యంగానే మీడియాను ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్ రెడ్డిని ప్రకటించడంపై టీజీ వెంకటేష్ ఆలస్యంగా ఆశ్చర్యం వ్యకం చేశారు. చంద్రబాబు టికెట్‌పై తుది నిర్ణయం తీసుకున్నాకే తాను స్పందిస్తాన్నారు.
లోకేష్ మంత్రి మాత్రమేనని.. పార్టీ అధ్యక్షుడు కాదని.. ముఖ్యమంత్రి కాదని టీజీ వెంకటేష్ గుర్తు చేశారు. బీఫామ్ ఖరారయ్యాకే అభ్యర్థులను ప్రకటించే సంప్రదాయం టీడీపీలో ఉందని ఎస్వీమోహన్‌రెడ్డి లోకేశ్‌ను హిప్నటైజ్ చేసి ఉంటారని టీజీ చెప్పుకొచ్చారు. మరోవైపు టీజీ వెంకటేష్ వ్యాఖ్యలను ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి లైట్ తీసుకున్నారు. లోకేష్ తనను కర్నూలు అసెంబ్లీ అభ్యర్దిగా ప్రకటించడం సంతోషకరమన్నారు. పరిస్థితులను బట్టి నారా లోకేష్ ముందుగానే అభ్యర్దులను అనౌన్స్ చేశారని ఎస్వీ తెలిపారు. టీజీకి రాజ్యసభ సీటు ఇచ్చారు కాబట్టి తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారని…అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నారని ఎస్వీ మోహన్‌రెడ్డి చెప్పారు.
కానీ టీజీ వెంకటేష్ మాత్రం తన కుమారుడికి టిక్కెట్ ఇప్పించాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ విషయం ఇంతటితో ఆగే అవకాశం కనిపించడం లేదు. మెల్లగా చంద్రబాబు వద్దకు చేరే అవకాశం కనిపిస్తోంది. దీన్ని చంద్రబాబు ఎలా డీల్ చేస్తారోనని కర్నూలు టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.