నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ కుమార్తె పరకాల వాజ్మయి పెళ్లి ప్రతీకో దోషి అనే యువకుడితో జరిగింది. బెంగళూరులో ఎవర్నీ పిలవకుండా అతి కొద్ది మమంది బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసేసారు. ఈ దోషి అటు నిర్మలా సీతారామన్ స్వరాష్ట్రానికి చెందిన తమిళనాడు వారు కానీ.. తండ్రి పరకాల ప్రభాకర్ కు చెందిన ఏపీ కి కానీ చెందిన వారు కాదు. ఆయన గుజరాత్ కు చెందిన యువకుడు. ప్రధాని మోదీకి నమ్మిన బంటు. ప్రధానమంత్రి కార్యాలయంలో ఇప్పటికే కీలక బాధ్యతల్లో ఉన్న వ్యక్తి.
ప్రతీక్ దోషి .. నరేంద్రమోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రీసెర్చ్ అసిస్టెంట్ గా సీఎంవోలో చేరారు. ప్రధాని మోదీ నమ్మకాన్ని చూరగొన్నారు. 2019లో ప్రధాని మోదీ రెండో సారి గెలిచిన తర్వాత ప్రతీక్ దోషిని ప్రధానమంత్రి కార్యాలయంలో నియమించారు. ఆయనకు పీఎంవోలో మంచి పలుకుబడి ఉంది. హోదాలో శాస్త్ర, సాంకేతిక సలహాదారుగా ఉన్నప్పటికీ చాలా విషయాల్లో ఆయన ప్రధాని మోదీకి సహాయకారిగా ఉంటారని చెబుతున్నారు. పరకాల వాజ్మయికి.. ప్రతీక్ దోషిది ప్రేమ వివాహమా.. లేకపోతే నిర్మలా సీతారామన్ కుదిర్చిన వివాహమా అన్నదానిపై స్పష్టత రాలేదు.
నిర్మలా సీతారామన్ కుమార్తె వివాహం చాలా నిరాడంబరంగా… వీఐపీల్ని ఎవర్నీ పిలవకుండా నిర్వహించారు. దీనికి ప్రతీక్ దోషి ఆదర్శాలుకూడా ఓ కారణం అంటున్నారు. ఎటువంటి ప్రచారానికి ఇష్టపడకుండా లో ప్రోఫైల్ ఉండే దోషి.. తన పెళ్లిని కూడా అలాగే కుటుంబ వ్యవహారంగా జరుపుకోవాలనుకున్నారని.. ఆ మేరకు అలాగే నిర్వహించుకున్నారని అంటున్నారు. మరో వైపు విడుదల అయిన పెళ్లి వీడియోల్లో ఎక్కడా పరకాల ప్రభాకర్ కనిపించకపోవడంతో.. కుమార్తె పెళ్లికి ఆయన వెళ్లలేదా అన్న చర్చ జరుగుతోంది.