ఆస్కార్ అవార్డుల వేడుకలు విశ్వ వ్యాపితంగా ప్రసారమై కోట్లమందిని అలరిస్తాయి.ఆ తరుణంలో బహుమతి గ్రహీతల హావభావ విన్యాసాలు వినోద విభావరుల వివరాలు మీడియాలో నిండి పోతాయి. కాని దానికి ముందు చాలా తతంగమే నడుస్తుంది. దశల వారీ తతంగాలు సాగుతాయి. హాలివుడ్ మాతృభూమి అమెరికా అంతర్జాతీయ ప్రయోజనాలూ ప్రతిబింబిస్తాయి. ఇది తరతరాలుగా సాగుతున్న కథ. ఈ సారి ఎంపికలోనూ అవన్నీ చూడొచ్చు. ఏవో చెదురు మదురు సందర్భాలలో బలమైన కారణాలు తోసుకువస్తే తప్ప ఆస్కార్ ఆస్కారం ఏమిటో తిరాస్కారాలెందుకో పరిశీలకులు చెప్పేస్తుంటారు. ప్రపంచ వినోద పరిశ్రమకు కేంద్ర స్థానమైన హాలివుడ్ సూత్రాలు అంత బలమైనవన్న మాట.
ఈ అవార్డు ఎంపిక కళాత్మక విలువలను బట్టి జరుగుతుందనుకుంటారు గాని ఓటింగును బట్టి తుది నిర్ణయం జరుగుతుందని చాలా మందికి తెలియదు. అధికారికంగా ఈ అవార్డు పేరు అకాడమీ అవార్డులు.అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్జ్ అండ్ సైన్సెస్ సభ్యులైన 5783 మంది ఓట్లు వేస్తారు. దానికి ముందు నామినేషన్ల పేరిట తొమ్మిది ఉత్తమ చిత్రాల జాబితా రూపొందిస్తారు. ప్రైజ్ వాటర్ కూపర్స్ అనే ఆడిటింగ్ సంస్థ(కుంభకోణాల్లో ఈ పేరు విన్నాం) ఓట్లను లెక్కించి ప్రకటిస్తుంది. అయితే ఈ వివరాలు గోప్యంగా వుంటాయి గాని ఒకసారి లాస్ ఏంజెల్స్ టైమ్స్ ప్రస్తుత వివరాలను సంపాదించి ప్రచురించింది.ఈ ఎంపిక చేసే ఓటర్లలో 94 శాతం మంది శ్వేతజాతీయులుంటారనీ,77 శాతం పురుషులేనని పత్రిక వెల్లడించింది.గతంలో చాలా సార్లు జాతి వివక్షకు సంబందించిన ఆరోపణలను ఎదుర్కొన్న ఆస్కార్ నేపథ్యం ఈ విధంగా బహిర్గతమైంది.రెండు శాతం మంది మాత్రమే నల్లజాతి వారు కాగా మరో రెండు శాతం మంది లాటిన్ అమెరికన్లట.15 విభాగాల్లోనైతే అచ్చంగా శ్వేతజాతి పురుషులే వున్నారట.నల్లజాతి కళాకారుల పట్ల వివక్షకు నిరసనగా గతంలో కొంతమంది ప్రముఖులే ఈ కమిటీ నుంచి నిష్క్రమించారు కూడా.
ఆ సంగతి అలా వుంచితే అవార్డుల ఎంపికలోనూ కొన్ని రివాజులు ఏర్పడ్డాయి.ఇవి మిగిలిన చిత్రోత్సవాలకు భిన్నంగా వుంటాయి. ఉదాహరణకు కేన్స్‌ను తీసుకుంటే అక్కడ ప్రయోగవాదానికి పెద్ద పీట లభిస్తుంది.వెనిన్లో నవ్య వాస్తవిక వాదం ఆదరణ పొందుతుంది.బెర్లిన్‌లో వాస్తవిక చిత్రణకు పట్టం కడతారు. వీటన్నిటినీ హాలివుడ్ గమనిస్తూనే వుంటుంది. కాని వారి కొలబద్దలు వేరు.పురోగామి శీలత కన్నా యథాతథ స్తితిని గతావలోకనాన్ని ప్రతిబింబించే చిత్రాలకు అక్కడ పురస్కారాలు ఎక్కువగా దక్కుతాయి. ఉదాహరణకు ఈ జాబితాలో చోటు సంపాదించిన ఎక్స్ట్రీమ్లీ లౌ డ్ అండ్ ఇన్ క్రెడ ిబుల్లీ క్లోజ్”,వార్ హార్స్, ద హెల్ప్ వంటి చిత్రాలను తీసుకుంటే వాటి బాక్సాఫీసు విజయాలకు తోడు పాత చూపు కూడా కీలక పాత్ర వహించింది. గతంలో కూడా షేక్స్పియఱ్ ఇన్ లవ్,గ్లాడియేటర్,లార్డ్ ఆఫ్ రింగ్స్,రిటర్న్ ఆఫ్ ద కింగ్, స్లమ్ డాగ్ మిలియనిర్, ,వంటి చిత్రాలన్ని పురస్కారాలు పొందాయి.ఇవన్నీ అర్హమైనవా కాదా అనే ప్రశ్న పక్కన పెడితే వీటిలో ఏదీ భవిష్యత్తుకు సంబంధించిన చైతన్యం ఇచ్చేది కాదు.అవార్డుతో వాటిని ఆకాశానికెత్తడమే జరిగింది.మిలియన్ డాలర్ బేబీ, హర్ట్ లాకర్ వంటి చిత్రాలు ఎప్పుడైనా మన్నన పొందాయంటే తమకూ కొన్ని విభిన్న విలువలున్నాయని చెప్పుకోవడానికి మాత్రమేనన్నది విమర్శకుల విశ్లేషణ. ఈ సారి బయోపిక్స్ అనబడే జీవిత కథా చిత్రాలు అధికంగా తీసుకుంటున్నారు. వారి వారి జీవితాల పరిధిలో పెద్దగా రాజకీయ సందేశాలు సంఘర్షణలు చెప్పే అవకాశం అవసరం కూడా వుండదు. వారి జయాపజయాలు ఎలాగూ హృద్యంగా వుండి ప్రేక్షకులను అలరిస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో వాణిజ్య చిత్రాలకు మాతృసంస్థ వంటి హాలివుడ్ మూల సూత్రాలే వేరు. అవి సినిమా వయస్సు ఎంతో అంత పెద్దవి. వీక్షకులను మంత్ర ముగ్ధులను చేసి ఏవేవో కాల్పనిక లోకాల లోకి తీసుకుపోవడమే లాస్ ఏంజెల్స్ రహస్యం. వారి ఎంపికలు ఆ ప్రకారమే వుంటాయి. ఆ ప్రకారమే 2014లో తెరమరుగైన ఒక నటుడికి సంబంధించిన బర్డ్‌మ్యాన్ అవార్డులు పండించుకుంది. ఈసారి ఈ సారి ద బిగ్ షార్ట్, మ్యాడ్ మ్యాక్స్, రెవనెంట్, రూమ్, స్పాట్లైట్, బ్రిడ్స్ ఆప్ స్పైస్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అండ్ ద ఆస్కార్ మే గో టు.. ?