తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్పై ఇంటి ఎదుటే దండగులు దాడికి పాల్పడ్డారు. ఆయన టీడీపీ కార్యాలయానికి బయలుదేరేందుకు కారెక్కే సమయంలో ఒక్క సారిగా నాలుగు వైపుల నుంచి రాడ్లు, రాళ్లు, కర్రలతో విరుచుకుపడ్డారు. కారులో కూర్చున్న పట్టాభిపై దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరాదృశ్యాలు బయటకు వచ్చాయి. ఓ ప్రణాళిక ప్రకారం ఈ హత్యాయత్నం జరిగినట్లుగా తెలుస్తోంది. నాలుగు వైపు కాపు కాసి రెక్కీ నిర్వహించి మరీ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. దాడిలో పట్టాభి చేతికి తీవ్ర గాయమైంది. కాలుకు కూడా గాయాలయ్యాయి. రాడ్డుతో కొట్టిన దెబ్బ నేరుగా జేబులో ఉన్న ఫోన్కు తగలడంతో అది పూర్తిగా ధ్వంసం అయింది.
విజయవాడలో ఈ ఘటన కలకలం రేపింది. పట్టాభిరామ్ తనకు పది రోజులుగా బెదిరింపులు వస్తున్నాయని… వల్లభనేని వంశీ, కొడాలి నానిలే కుట్ర చేసి.. మనుషుల్ని దాడికి పంపించారని ఆయన చెబుతున్నారు. ఈ మేరకు దుండగులు పరారైనతర్వాత వచ్చిన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టాభిరాంపై దాడి ఇదే మొదటి సారి కాదు. కొన్నాళ్ల కిందట… ఇప్పుడు దాడి జరిగిన చోటనే.. ఆయన కారును ధ్వంసం చేసి దాడికి ప్రయత్నించారు. అప్పట్లో పోలీసులు ఎవర్నీ నిందితులుగా పట్టుకోలేదు. దాంతో వారే ఇప్పుడు మరింత దూకుడుగా దాడికి పాల్పడినట్లుగాఅనుమానిస్తున్నారు.
టీడీపీ అధికార ప్రతినిధిగా కొమ్మారెడ్డి పట్టాభిరాం కీలకంగా ఉంటున్నారు. దాదాపుగా ప్రతీ రోజు ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూంటారు. పత్రాలు బయట పెడుతూంటారు. ఈ క్రమంలో ఆయనకు అనేక రకాలుగా బెదిరింపులు వస్తున్నాయి. వైసీపీ బెదిరింపులకు భయపడి పెద్ద పెద్ద నేతలందరూ నోరు తెరవడానికి భయపడుతున్న సమయంలో పట్టాభిరాం ధైర్యంగా వచ్చిమాట్లాడుతూండటంతో ఆయనపై దాడికి కుట్ర జరిగినట్లుగా భావిస్తున్నారు. ఈ కారణంగా ఆయన మళ్లీమాట్లాడకుండా చేయాలన్న వ్యూహాన్ని అమలు చేస్తున్నారని అంటున్నారు.
పట్టాభిపైదాడి జరిగిన విషయం తెలిసిన వెంటనే… టీడీపీ నేతలు పెద్ద ఎత్తున పట్టాభిరాం ఇంటికి చేరుకున్నారు. చంద్రబాబు కూడా ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఏపీలో రూల్ ఆఫ్ లా లేదని ప్రభుత్వం .. పోలీసు యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసిందని అంటున్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారికి గ్యారంటీ ఉండదన్నసంకేతాల్ని పంపుతున్నట్లుగా ఉందని అంటున్నారు.