ఒడిషాకు చెందిన ప్రతాప్ చంద్ర సారంగి అనే.. 64 ఏళ్ల పెద్దాయని గుబురుగడ్డంతో… నలిగిపోయిన బట్టలతో కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దాంతో.. ఆయన నేపధ్యం గురించి.. రెండు ఫోటోలు బయట పెట్టి.. సోషల్ మీడియాలో అదే పనిగా.. పొగడ్తలు ప్రారంభించారు. ఒకటి… పైకప్పు లేని ఇంటి ముందు ఉన్న ఫోటో.. రెండోది సైకిల్ తొక్కుతున్న ఫోటో. అంత నిరాడంబరుడు.. ఎలా గెలిచాడా.. అని అందరూ ఆశ్చర్యపోయారు. చివరికి .. ఆయన నేపధ్యం గురించి బయటకు వచ్చిన తర్వాత అందరూ నోరెళ్లబెట్టాల్సి వస్తోంది.
సారంగిపై ఏడు క్రిమినల్ కేసులు..!
తెలుగు సినిమాల్లో విలన్లకు ఓ ప్రత్యేకత ఉంటుంది. బయట ఎంత సాధుస్వభావంగా ఉంటారో.. అంతర్ముఖంగా మాత్రం క్రూరమైన నేపధ్యంతో ఉంటారు. ఇప్పుడీ కేంద్రమంత్రి ప్రతాప్ చంద్ర సారంగి బ్యాక్ గ్రౌండ్ పరిశీలిస్తే కూడా అదే అర్థం అవుతుంది. ఆయనపై ఏడు క్రిమినల్ కేసులు ఉన్నాయి. మత కలహాలు రెచ్చగొట్టడం, రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం లాంటి తీవ్రమైన నేరాలు ఆయనపై ఉన్నాయి. మొత్తంగా ఏడు కేసులు. నలిగిపోయిన తెల్లబట్టలేసుకునే ఈ సాధుజీవిపై ఇన్ని కేసులేమిటని చాలా మందికి ఆశ్చర్యం వేయడం సహజమే. కానీ ఈ కేసుల ద్వారానే ఆయన బీజేపీ హైకమండ్ దృష్టిలో పడ్డారనే అనుమానాలు కూడా ఉన్నాయి.
మత ప్రబోధకుడ్ని సజీవదహనం చేసిన కేసులో నిందితుడు..!
20 ఏళ్ల క్రితం మతబోధకుడు.. గ్రాహం స్టెయిన్స్ అతని ఇద్దరు కుమారుల్ని.. ఇంట్లో ఉంచి…బయట నిప్పు పెట్టి.. సజీవదహనం చేసిన ఘటన… ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సమయంలో ఒడిషా భజరంగ్ దళ్కు… ఈ సారంగినే అధ్యక్షుడు. ఈయనపైనే ప్రధానంగా ఆరోపణలు వచ్చాయి. కేసు నమోదు చేశారు. కానీ విచారణ మాత్రం తూ..తూ మంత్రంగా సాగుతూనే ఉంది. ఆ కేసులో ఏముందో.. ఇప్పటికీ తేలలేదు. కానీ ఆరోపణలు మాత్రం అలాగే ఉండిపోయారు. ఆ ఘటన తర్వాతే… సారంగి రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
అఫిడవిట్ ప్రకారమే సారంగికి రూ. 15 లక్షల ఆస్తులు ఉన్నాయి., ఆయన తన సంపాదన అంతా.. స్కూళ్లు, పిల్లల కోసం వెచ్చిస్తారని… సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే ఆయన విద్యాసేవ చేయడం నిజమే కానీ.. సోషల్ మీడియాలో జరుగుతున్నంతగా కాదని… అక్కడి మీడియా కూడా చెబుతోంది. ఆహార్యం… చూసి.. రెండు, మూడు ఫోటోలతో.. ప్రతాప్ చంద్ర సారంగికి.. సోషల్ మీడియా వీరతాళ్లు వేస్తోంది. కానీ.. లోతులకు వెళ్తేనే అసలు నిజాలు బయటకు వస్తాయేమో..?