ఏపీ విషయంలో కేంద్రానికి ఎందుకింత మొండిపట్టు..? హోదా ఎందుకివ్వనంటున్నారు..? ఇచ్చింది తీసుకోవాలిగానీ, అడిగింది ఇవ్వకూడదన్న ఇగో ఉందా..? అసలు, కేంద్రం ప్రాబ్లమ్ ఏంటీ..? ఇస్తే పొలిటికల్‌గా భాజపాకే ప్లస్ అవుతుంది కదా..? ఏపీలో సోలో ఎదగాలన్న లక్ష్యమూ నెరవేతుంది కదా..? ఇంతకీ, కేంద్రం మనసులో ఉన్నది ఏంటీ..? ముగిసిన అధ్యాయం అని ప్రకటనలు చేస్తున్నా… ఎలా ముగుస్తుందో చెప్పాలి కదా! దీనికి ముక్తాయింపు ఉండాలి కదా! ఇవాళ్ల విశాఖ బీచ్.. రేపు మరో ప్లేసు… ఎల్లుండి ఇంకో ఊరు… ఇలా ఎన్నాళ్లని ప్రత్యేక హోదా ఉద్యమ సభలను ఏర్పాటు చేసుకోవాలి..? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ జవాబులు కేంద్రం దగ్గర ఉన్నాయేలో లేదో డౌటు..!
14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వలేం అని అప్పట్లో భాజపా చెప్పింది. అయితే, సుప్రీం కోర్టు నిషేధించిన జల్లికట్టుకే ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు… కేంద్రం తల్చుకోవాలేగానీ హోదా ఎందుకు ఇవ్వలేదూ..? ఏపీకి హోదా ఇస్తామంటే అడ్డుకునే రాజకీయ పార్టీలు కేంద్రంలో ఏవీ లేవు కదా! భాజపా సంపూర్ణ మెజారిటీతో అధికారంలో కూడా ఉంది. వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా పాలన సాగుతోంది. అలాంటప్పుడు ఏపీ హోదాకి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే తప్పేముంటుంది..?
ఏపీకి హోదా ఇస్తే మరికొన్ని రాష్ట్రాల నుంచి కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందనీ అప్పట్లో భాజపా చెప్పింది! ఇది కూడా తప్పించుకునే సాకు మాత్రమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఎంత అడ్డగోలుగా విభజించారో దేశం అంతా కళ్లారా చూసింది. ఆంధ్రాకి అన్యాయం జరిగిందన్న అభిప్రాయం అన్ని రాష్ట్రాలకూ ఉంది. తెలంగాణ ఏర్పాటుకు ఎంత మద్దతు లభించిందో… ఆంధ్రాను విడదీసిన క్రమంపై కూడా అంతే సింపథీ ఇతర రాష్ట్రాల్లో ఉంది. ఇవే విషయాలను ఇతర రాష్ట్రాలకు కేంద్రం మెల్లగా చెబితే అర్థం చేసుకోవా..? ఇంతకీ ఆ ప్రయత్నం కేంద్రం ఎప్పుడైనా చేసిందా..? పోనీ, పక్క రాష్ట్రాలతో మీరు మాట్లాడి ఒప్పించుకోండీ… అంటూ చంద్రబాబుకు బాధ్యతలు అప్పగించిందా..?
ఏపీకి హోదాకు మించిన ప్రయోజనాలను ప్యాకేజీలో ఇస్తున్నామని ఇప్పుడు భాజపా చెబుతోంది..! హోదా ఇస్తే ఇతర రాష్ట్రాలు ప్రశ్నిస్తాయని కేంద్రమే చెప్పింది కదా! మరి, హోదాకు మించిన ప్రయోజనాలను ఏపీకి కల్పిస్తుంటే ఇతర రాష్ట్రాలు ఎందుకు ఒప్పుకుంటున్నాయి…? హోదాకు మించిన ప్రయోజనాలు ఇస్తుంటే 14వ ఆర్థిక సంఘం ఎందుకు ప్రశ్నించడం లేదు…? హోదాకు మించినదే అయితే… దానికి ప్యాకేజీ అని ఎందుకు పేరుపెట్టాలి..? ప్రత్యేక హోదా అంటే ఇదే.. అని చెప్పేసి ఉంటే ఏ గొడవా ఉండదుగా!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అడగడం లేదు… మీరు అడిగితే ఎందుకు స్పందంచాలా అనే గర్వంతో కేంద్రం ఉందా..? లేదా, పవన్ చెప్పినట్టు ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తోందా..? ఆంధ్రాలో ప్రత్యేక హోదా ఉద్యమం స్థాయి పెరుగుతూ పోతే… భాజపాకి కూడా ఇబ్బందే! ఏపీలో అణచివేత ధోరణి వల్ల ఇతర రాష్ట్రాల్లో కూడా భాజపా పరువు పోయే ప్రమాదం ఉంటుంది. మరి, కేంద్రమేంటో… వాళ్ల విధానాలేంటో… వారికే తెలియాలి!