హైదరాబాద్‌లో అతి తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. గత ఎన్నికల్లో పోలిస్తే.. ఇంకా తక్కువ శాతం నమోదయింది. మూడు శాతం తగ్గిపోయింది. 2014లో హైదరాబాద్‌లో 53శాతం పోలవగా, ఈ ఎన్నికల్లో 50.86 శాతం మాత్రమే నమోదైంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో భారీగా తగ్గినా.. కొన్ని నియోజకవర్గాల్లో స్వల్పంగా పెరిగింది. ముఖ్యంగా ముస్లింలు ఎక్కువగా ఉండే.. ముషీరాబాద్, నాంపల్లి,కార్వాన్, గోషామహల్, చార్మినార్, చంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహుదూర్‌పురా నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం బాగా తగ్గిపోయింది. శుక్రవారం ప్రార్థనలకే ముస్లింలు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారని.. ఓటింగ్ పై ఆసక్తి చూపలేదని ప్రచారం జరిగింది. అదే సమయంలో అక్కడ ఇతర పార్టీల నుంచి ఎంఐఎంకు గట్టి పోటీ లేదు. ఓటేసినా లేకపోయినా.. గెలిచేది ఎంఐఎం అన్నట్లుగా ఓటర్లు ఉండిపోయారన్న అంచనాలున్నాయి. అయితే ఖైరతాబాద్, జూబ్లిహిల్స్, సికింద్రాబాద్, కూకట్ పల్లి వంటి నియోజకవర్గాల్లో గత ఎన్నికలతో పోలిస్తే.. పోలింగ్ శాతం స్వల్పగా పెరిగింది. ఎంత పెరిగినా ఇది… యాభై శాతానికి అటూ ఇటుగానే ఉంటోంది.
విద్యావంతులు ఉండే నగరం.. చైతన్యవంతులయిన నగరం.. ఓటు హక్కు తెలిసిన నగరంలో.. ఇలా తక్కువ ఓటింగ్ ఎందుకు నమోదవుతోంది..?., ఒక్క సారి కాదు.. హోరాహోరీగా ఎన్నికలు జరిగి.. దాదాపు ప్రతి ఇంట్లోనూ.. ఎన్నికల గురించి… చర్చ జరిగే రోజులు ఇవి. ఇలాంటి సందర్భాల్లోనూ.. ఓటింగ్ ఎందుకు తక్కువ నమోదవుతోంది. సెలవు ఇచ్చి మరీ ఓటు వేయమంటే.. ప్రజలు వేయడం లేదా..? . తక్కువ ఓటింగ్ నమోదయిందంటే.. ఓటర్లను నిందించడం పరిపాటి అయిది. కానీ.. ఓటర్ల జాబితాలను ఎందుకు చూడరు. నగరంలో ఉన్న వారిలో… ఓటు హక్కు ఉన్న వారిలో దాదాపుగా 70 శాత మందికిపైగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లో… ఓ పది మందిని ఓటు వేశారా అని అడిగితే.. ఐదుగురు వేయలేదని చెబుతారు. ఎందుకు వేయలేదంటే.. తమకు ఓటు లేదని చెబుతారు. అంటే.. ఓటు హక్కు ఉండి వినయోగించుకోని వాళ్లు హైదరాబాద్‌లో తక్కువే.
మరి తక్కువ పోలింగ్ శాతం ఎందుకు నమోదవుతోందంటే… దానికి ఒకే ఒక్క కారణం.. ఓటర్ల జాబితా. లో ఓటరు గుర్తింపు కార్డులున్నా ఓటరు జాబితాలో పేరు లేకపోవటం, దరఖాస్తు చేసుకున్నా.. ఓటు ఇవ్వకపోవడం… అలాగే.. ఊళ్లలో ఓట్లు ఉన్నా.. డూప్లికేటింగ్ ఎక్కువగా ఉండటం వల్ల.. ఈ పరిస్థితి తలెత్తింది. ఊళ్లలో ఓట్లు ఉన్న వారు. .. తమ ఊరి నుంచి వచ్చే ఒత్తిడి.. రానుపోను చార్జీలకు తోడు.. పైన ఎంతో కొంత రాజకీయ పార్టీలు ఇస్తూండటంతో.. ఊళ్లలోనే ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లారు. అంటే.. ఏ విధంగా చూసినా… సరియైన ఓటర్ల జాబితా ఉంటే.. హైదరాబాద్‌లోనూ… 70 శాతం వరకూ పోలింగ్ నమోదవుతుందన్న అంచనాలున్నాయి. అందుకే ఇది.. ఓటర్ల తప్పు కాదు.. వాళ్లకు కావాల్సినంత చైతన్యం ఉంది. అసలు చైతన్యం రావాల్సింది.. ఎన్నికల సంఘం తరపున పని చేసే మేధావుల్లోనే..!