డిమాండ్ – సప్లై… వ్యాపారం ఏదైనా సరే, కీలకమైన సూత్రమిదే. సినిమాలకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. కాకపోతే.. డిమాండ్‌కి తగిన సప్లై ఇప్పుడు టాలీవుడ్లో కనిపించడం లేదు. దాంతో థియేటర్లు మూతపడే పరిస్థితి ఏర్పడింది. యేడాదికి సగటున తెలుగు రాష్ట్రాలలో 25 థియేటర్ల చొప్పున మూతబడుతూ వస్తున్నాయి. అందులో కొన్ని కల్యాణ మండపాలుగా, ఇంకొన్ని గిడ్డంగులుగా మారిపోతున్నాయి. ఇంకొన్ని షాపింగ్ కాంప్లెక్సుల అవతారాలు ఎత్తుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే… ఇంకొన్నాళ్లకు సింగిల్ స్క్రీన్ వ్యవస్థ పూర్తిగా నాశనమయ్యే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితికి హీరోల ‘బద్దకం’ కూడా ఓ కారణంగా నిలుస్తోంది.
చిత్రసీమ టాప్ స్టార్ల కెరీర్‌పైనా, వాళ్లు చేసే సినిమాలపైనా ఆధారపడి ఉంటుందన్నది అక్షరసత్యం. చిన్న సినిమాలు చిత్రసీమకు బలం. కాదనలేం. కాకపోతే.. రికార్డు వసూళ్ల గురించి వినే అవకాశం, అదృష్టం.. పెద్ద సినిమాలు వచ్చినప్పుడే దక్కుతుంది. పైగా ఓ టాప్ స్టార్ సినిమా హిట్టయి, రికార్డులు బద్దలు కొడితే – ఆ స్ఫూర్తితో మరిన్ని కొత్త సినిమాలు ప్రాణం పోసుకుంటాయి. కొత్త దర్శకులు వస్తారు. నిర్మాతలు తయారవుతారు. డబ్బు రొటేట్ అవుతుంటుంది. మొత్తానికి పరిశ్రమకి కావల్సిన పని దొరుకుతుంది.
ఈ థియరీ హీరోలంతా ఒప్పుకుంటారు కూడా. కానీ కావల్సిన స్థాయిలో, సంఖ్యలో సినిమాలు చేస్తున్నారా? లేదా? అనేదే అతి కీలకమైన ప్రశ్న. మహేష్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ, ప్రభాస్… ఇలా ఏ టాప్ స్టార్ తీసుకున్నా – యేడాదికి ఒక్క సినిమాతో సరిపెట్టేస్తున్నారు. స్పీడు పెంచరా? అని అడిగితే `కథలెక్కడ?` అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. 12 నెలల పాటు ఓ సినిమా సెట్స్‌పై ఉండడం మామూలు విషయం కాదు. అది నిర్మాతలకు భారమే. ఈలోగా వడ్డీలను భరించాల్సివస్తుంది. బడ్జెట్ పెరుగుతూ ఉంటుంది. చివరికి సినిమా విడుదలై హిట్టయినా, తగినన్ని లాభాలు మాత్రం రావు. సినిమా పోతే.. ఇక చెప్పాల్సిన పని లేదు. చాలా జీవితాలు రోడ్డున పడతాయి.
సినిమా మేకింగ్ అనేది ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఎడిటింగ్, డబ్బింగ్ ప్రక్రియలు సులభమైపోయాయి. సీన్ తీస్తున్నప్పుడే ఎడిటింగ్ చేసుకునే సౌలభ్యం ఉంది. ఇది వరకు ప్రింట్లో సినిమా తీస్తున్నప్పుడు ఇన్ని సౌకర్యాలు లేవు. అలాంటప్పుడు సినిమా ఇంకెంత వేగంగా పూర్తవ్వాలి? యేడాదికి ఎన్ని సినిమాలు బయటకు రావాలి? కానీ అవేం జరగడం లేదు. దానికి కారణం.. హీరోలు, దర్శకుల అతి జాగ్రత్తే. స్క్రిప్టు పక్కా అయిన తరవాత సెట్స్‌పైకి వెళ్లడం అనేది ఇప్పటి హీరోలకు తెలియడం లేదు. షూటింగ్ దశలో కథ అనేక మార్పులకు లోనవుతుంది. కొత్త పాత్రలు వచ్చిపడిపోతుంటాయి. దాంతో షెడ్యూల్ అనుకున్న సమయానికి పూర్తవ్వదు. రీషూట్ల గురించి ఇక చెప్పాల్సిన పనిలేదు. ఓ సీన్ చూసుకుని, నగిషీలు దిద్దుకుంటూ వెళ్లడం నయా దర్శకులకు ఓ అలవాటుగా మారిపోయింది. ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఇంకెన్ని మార్పులో..?
పూరి జగన్నాథ్‌ల వేగంగా సినిమాలు తీసేవాళ్లు కరవైపోయారు. రాజమౌళి సినిమా అంటే రెండేళ్లు పడుతుంది. వంశీ పైడిపల్లి అయితే.. మహర్షి కోసం రెండేళ్లు సమయం తీసుకున్నాడు. కొరటాల శివ, త్రివిక్రమ్, సుకుమార్లదీ అదే పరిస్థితి. ఈ విషయంలో హీరోల తప్పు ఎంత ఉందో? దర్శకులదీ అంతే ఉంది. అతి జాగ్రత్తలతో సినిమాలు తీస్తూ… కాలయాపన చేస్తున్నారు. అందుకే సినిమాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. థియేటర్లకు ఫీడింగ్ దొరక్కపోవడంతో… మూసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. రాష్ట్రంలో మల్టీప్లెక్స్‌ల సంఖ్య పెరుగుతూ పోతూ.. సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడుతూ వస్తున్నాయి. ఇది మంచి పరిణామం కాదు. నాని, విజయ్‌దేవరకొండ, శర్వానంద్‌లాంటి యువ హీరోలు ఫాస్ట్ ఫాస్ట్‌గా సినిమాలు తీయకపోతే… ఈ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ఇప్పటికైనా హీరోలు కళ్లు తెరవాలి.. సినిమాల స్పీడు పెంచాలి. మీనమేశాలు లెక్కపెడుతూ, యేడాదికొకటి, రెండేళ్లకొకటి అంటూ సినిమాలు చేసుకుంటూ వెళ్తే… ఆఖరికి తమ సినిమాని తెరపై చూసుకోవడానికి థియేటర్లే లేకుండా పోతాయి.