ఒక్కొక్కసారి అనూహ్యమైన రీతిలో వివాదాస్పద వ్యాఖ్యలు వినిపిస్తుంటాయి. అలాంటిదే ఇప్పుడు షిర్డీసాయిబాబా విషయంలోనూ తటస్థించింది. దీంతో సాయిబాబా ఎవరన్న విషయం చర్చనీయాంశమైంది. సాయిబాబా మందిరాలు ఊరూరా ఎందుకు వెలుస్తున్నాయో కూడా అర్థంచేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
సాయిబాబా దేశమంతటా దేవునిగా పూజలందుకుంటున్నారు. అయితే 50 సంవత్సరాల క్రిందటి వరకు సాయిబాబా మందిరాలు దేశంలో చాలా తక్కువగానే ఉండేవి. ఊరికో రామాలయమన్న హిందూమతపరమైన సిద్ధాంతాన్ని భక్తిభావంతో అంతాపాటించారు. అలాంటిది ఇప్పుడు సాయిబాబా విషయంలోనూ అదేజరుగుతోంది. దాదాపుగా ప్రతిఊర్లో సాయిబాబా మందిరం వెలిసింది. రాముడి తర్వాత సాయిబాబా హిందువులకు నిత్యారాధకుడయ్యాడంటే అతిశయోక్తికాదు. నిత్యపూజాదికాలు, ఆరతులతో ఊర్లకుఊర్లు భక్తిభావంతో కొలుస్తుంటే కొంతమంది పనిగట్టుకుని బాబాకు వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో వివాదం రాజుకుంది.
శంకరాచార్య స్వామి స్వరూపానంద్ మహరాజ్ ఈమధ్యనే భోపాల్ లో విడుదలచేసిన కలర్ పోస్టర్ మరోసారి సంచలనాలకు తెరదీసింది. ఆ పోస్టర్ లో హనుమంతులవారు ఒక చెట్టుని పెకిలించి మహోగ్రరూపంతో బాబావారని తరుముతున్నట్లుంది. ఆ పోస్టర్ చూడగానే ఎవరికైనా బాబా అన్యమతస్థుడు కావడంతోనే ఆయన్ని హిందూదేవుడైన హనుమంతులవారు దేశపొలిమేరలు దాటేలా తరిమికొడుతున్నారన్న కవిహృదయం అర్థమవుతుంది. ఆంగ్లేయులను క్విట్ ఇండియా అంటూ ఉద్యమించినట్లుగా హిందూ దేవతలు ముస్లీం మతస్థుడైన బాబాను క్విట్ ఇండియాఅంటూ తరిమికొడుతున్నామనే సదరు స్వామిజీ అంతర్లీనంగా చెప్పదల్చుకున్న విషయం. ఆయన ఏం చెప్పదలుచుకున్నారో, ఎలాంటి సందేశం హిందూమతస్థులకు ఇవ్వాలనుకుంటున్నారో అది ఎలాంటి సందేహాలకు తావులేకుండా నేఇచ్చేశారు. ఇందులో స్వామీజి నూటికినూరుశాతం సఫలీకృతులయ్యారనే చెప్పాలి. అయితే, ఈ మఠాధిపతి నిర్ణయం తీసుకునేముందు అతిముఖ్యమైన విషయాన్ని మరచిపోయినట్లున్నారు.
ఎవరు దేవుడు ?
అసలు దేవుడంటే ఎవరు? ఆయన ఎలా ఉంటాడన్నది యుగాలతరబడి మానవుడ్ని వేధిస్తున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు ఇంతవరకు సరైన సమాధానం రాలేదు. యుగాల క్రిందట నాటి భారత ఉపఖండంలో ఈశ్వరుడొక్కడే దేవుడు. అందుకే ఆయన ఆదిదేవుడయ్యాడు. అంతేకాదు, ఆ తర్వాత వచ్చిన దేవుళ్ల కంటే మహా శక్తివంతుడైనవాడు కావడంతో మహాదేవుడిగా పిలవబడ్డాడు. అయితే మహాశివుడు కూడా దేవుడా? లేక అప్పటి సమాజంలో మనలాగానే సంచరించిన మానవుడా ? అన్నది నేటికీ స్పష్టంగా తేలని దేవ రహస్యం. ఆ తర్వాత బ్రహ్మ, విష్ణువులు పూజలందుకున్నారు. అక్కడితో ఆగలేదు, విష్ణవు అవతారాలంటూ రాముడినీ, కృష్ణుడినీ పూజించారు. అటుపై కూడా అనేకమంది దేవతలు పుట్టుకొస్తూనే ఉన్నారు. వారందరినీ హిందువులు ఆహ్వానించారు, తోచిన రీతిలో పూజాదికాలు నిర్వహిస్తూనే ఉన్నారు. అలాఅలా ముక్కోటి దేవతలు తయారయ్యారు. ఆ సంఖ్య పెరుగుతుందేతప్ప తరగడంలేదు. అయినప్పటికీ మనకొచ్చిన ఇబ్బందిలేదు. ఎంతమంది దేవతలు ఏర్పడినా అందరీ ఆశయం శాంతిస్థాపనే. లోకాలన్నీ సుఖశాంతులతో ఉండాలన్నదే వారి ప్రగాఢ వాంఛ. అంటే మనకు అర్థమవుతున్నదేమిటంటే, దేవతలుగా, ఎక్కువమందిచేత పూజింపబడుతున్నారో వారిలో సంపూర్ణమైన నాయకత్వ (మానవత్వ)లక్షణాలను ప్రజలు గుర్తించారు. శివుడు, రాముడు, కృష్ణుడు…ఇలా ఎవరినైనా తీసుకోండి, వారిలో ఓ మంచి నాయకుడు మనకు కనబడతాడు. ఎవరైతే తనను నమ్ముకున్నారో, ఏ సమాజమైతే తనను పూర్తిగా విశ్వసిస్తుందో ఆ సమాజానికి చేతనైనంత మంచిచేసి వీరంతా మహానుభావులుగానూ, మహాపురుషులగానూ ఎదిగారు. ఆ ఎదుగుదలే వారికి క్రమక్రమంగా దేవతల స్థానం కల్పించింది. కాలం ఏదైనా జరిగింది ఇదే.
కాలచక్రం తిరుగుతుంటే ఒక శివుడు (నాయకుడు) తర్వాత మరోశివుడు తయారుకావచ్చు. అలాగే మరో రాముడి తర్వాత ఇంకో రాముడు పుట్టుకురావచ్చు. ఆరకంగా చూస్తే, రాముడైనా, హునుమంతుడైనా చెడుపై (అసురులపై) పోరాడినవారే. విజయం సాధించినవారే. మానవ కల్యాణానికి దోహదకారులయైనవారే. వారినే దేవుళ్లుగా కొలిచారు. కానీ నిజానికి దేవుడెవరో ఎలా ఉంటాడో తెలియదు. దేవుడెవరు? అన్న ప్రశ్నకు సరైన సమాధానం రాకముందే, ఇలా మూడు కోట్లమంది (ఇంకా ఎక్కువగానే) దేవతలు (నాయక గణం)పుట్టుకొచ్చారు. సమాధానంలేని ప్రశ్న (దేవుడెవరు?)ను పట్టించుకోకుండా మెరుగైన జీవనశైలికి సహకరించే వారే మన గుండెల్లో దేవతులుగా నిలిచారు, నిలుస్తున్నారన్నది వాస్తవం.
విచిత్ర వాదన
మళ్లీ మనం షిర్డీ సాయిబాబా వారిపై వస్తున్న విచిత్ర వాదనల దగ్గరకు వెళదాం. శంకరాచార్య స్వామి స్వరూపానంద్ ఇటీవల సాయిబాబా దేవుడే కాదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన వాదనను బలోపేతం చేయడానికీ, అది నిజమని నమ్మించడానికి పోస్టర్లు రిలీజ్ చేస్తుశారు. ఆయనగారు అలా భావప్రకటనస్వేచ్ఛను యధేచ్ఛగా ఉపయోగించుకుంటున్నారు. స్వేచ్ఛను ఉపయోగించుకోవడంలో తలపండిన స్వామీజీ ఎలాంటి పొరపాటు చేయలేదు. మనదేశ సంస్కతిలో ఇమిడిఉన్న గొప్ప విషయం ఏమంటే, మతపరమైన భావప్రకటన స్వేచ్ఛ ఉండటమే. స్వాతంత్ర్యం తరువాత ప్రజాస్వామిక లౌకిక దేశంగా ఎదిగిందని కాదు. వేదకాలం నాటి నుంచే మత స్వేచ్ఛ ఉండేది. స్వేచ్ఛ ఉన్నచోటనే విభేదాలూ,వైషమ్యాలు కూడా ఉండేవి. రాతియుగం నుంచి ఇప్పటివరకూ మతం అన్నది యుద్దాలను ప్రోత్సహించే కారణాల్లో ప్రధానంగానే నిలిచింది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. స్వేచ్ఛను ఉపయోగించుకోవడం తప్పుకాకపోయినా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంలో పొరపాట్లు చేశారు. నిజానికి వాటిని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మతపరంగా రెచ్చగొట్టే ధోరణి మఠాధిపతులంతటివారు చేయడం శోచనీయం. హిందూ ఆలయాల ప్రాంగణలోనే సాయిబాబా మందిరాలు నెలకొల్పుతుండటం ఈ స్వామీజికి నచ్చలేదు. ఈ పోకడను తీవ్రంగా విమర్శించారు. సాయిబాబా దగ్గరకు (షిర్డీకి) వెళుతున్నవారంతా ఆయన భక్తులుకారనీ, స్వార్థచింతనతో మాత్రమే వెళుతున్నారన్నది ఈయనగారి భావన. హిందూ సనాతన శాస్త్రాల్లోనూ, వేదాల్లోనూ సాయిబాబా ప్రస్తావన లేదనీ, బాబాను హిందూదేవతల సరసన కూర్చోబెట్టి పూజలు చేయడం సరైనది కాదని వీరి వాదన. సాయిబాబా దేవుడు కాదనీ, ఆయన కేవలం ముస్లీం ఫకీర్ అని తేల్చిపారేశారు. దీంతో పలుచోట్ల ఈ వ్యాఖ్యలకు నిరసనగా న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు, ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి. స్వామి సరూపానంద్ గతంలో ఆర్టికల్ 370 మీద, అలాగే పికె సినిమా మీద కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అద్వైతాన్ని మరిచారా ?
జగద్దురు శంకరాచార్యులు చెప్పిన అద్వైత సిద్ధాంతానికి ఈ స్వామీజితిలోదకాలు ఇచ్చారా? జగద్గురువులు ఏం చెప్పారు? ఈయనేం చేశారు? శంకరాచార్యులవారు కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకు సంచరించి శివకేశవులమధ్య భేదం లేదని (అభేదమని) చెబితే, ఆయన పేరిట ఏర్పాటైన మతపీఠాల్లోని స్వామీజీలు ఇప్పుడు దేవుళ్లను వర్గీకరించడం , కక్షలు పెంచడం
అతిపెద్ద విడ్డూరం. నిజంగా అద్వైత వాదులైతే, సాయిబాబాకీ, హనుమంతులవారికీ మధ్య బేధం ఉండకూడదు. అలాంటప్పుడు స్వామీ స్వరూపానంద్ చేసిన వ్యాఖ్యలను వయసుమళ్ళిన వ్యక్తిచేసిన పిచ్చివాగుడు క్రిందనే జమకట్టాలి. దీన్ని కేవలం మతపరమైన పిచ్చిగానే భావించాలి. ఇలాంటి వారి దృష్టిలో షిర్డీ సాయిబాబా అన్యమతస్థుడు. కనుక ఆయనపట్ల హిందువుల్లో ఉన్న భక్తిభావాన్ని, ఆలోచనలను తరిమికొట్టాలి. హిందువుల మనసుల్లో ఉన్న బాబా ఆలోచనల రూపాన్ని తరిమికొట్టించాలన్న టార్గెట్ తోనే పోస్టర్స్ తయారుచేయించారు. ఈ రకంగా సదరు స్వామీజి తమ గురుదేవులైన ఆదిశంకరాచార్యుల అభేద సిద్ధాంతానికి గండికొట్టారు. అలాంటప్పుడు ఆయన అసలు ఆ పీఠానికే అనర్హులుకారు. ఆత్మ సిద్ధాంతాన్ని నమ్మినవారు (ఈ సిద్ధాంతాన్ని ఆదిశంకరాచార్యులు వారు కూడా నమ్మారు) పైకి కనిపించే శరీరం, కులం, మతం వారికిపట్టవు. శంకరులవారు ఛండాల వ్యక్తిలో కూడా పరమశివుడ్ని చూడగలిగారు. కానీ స్వరూపానంద్ మహరాజ్ మాత్రం సాయిబాబాలో దేవుడ్ని, లేదా సద్గురువుని చూడలేకపోతున్నారు.
గురువు – దేవుడు
హిందూ సనాతన ధర్మంలో దేవుడికి ఎంతటి విశిష్ట స్థానం ఉన్నదో అంతే స్థానం గురువుకీ ఉంది. చాలా సందర్భాల్లో గురువు మాటే దేవతల మాటగా చలామణి అయ్యేది. నిజానికి దేవుడుకంటే గురువే ఎక్కువ. సమాజ పాలనలో తప్పులను దేవుడు (నాయకుడు) గుర్తించకపోయినా, వాటిని తన నిశిత పరిశీలనాదృష్టితో గుర్తించి దేవుడి లేదా నాయకునికి ఆవిషయం చెప్పి సరైన దారికి తీసుకురావడమే గురువు చేసేపని. దేవతలకు, ప్రజలకు కలిగే అనేక ధర్మసందేహాలను తీర్చేవాడే గురువు. ఇటు ప్రజలకూ, అటు దేవతలకూ సంధానకర్తగా ఉండేవాడే గురువు. అందుకే గురుదేవుడయ్యాడు. ఆ రకంగా గురువును పూజించేవారు కాలక్రమేణా ఆ గురువునే దేవునిగా పూజించడం సనాతన ఆచారంగా వచ్చింది. దీనికి ఎవ్వరూ ఏ యుగంలోనూ తప్పుపట్టలేదు. గురువుకు భక్తితో ఆశ్రమాలు కట్టించినా, మందిరాలు కట్టించినా అదేదో పాపపు కార్యంగా ఎవ్వరూ భావించలేదు.
సాయిబాబా విషయానికి వద్దాం. షిర్డీలో చాలాకాలం నివశించి తనదగ్గరకు వచ్చేవారికి సద్భోదనలు చేసిన సాయిబాబా తనను నమ్మినవారికి సద్గురువుగా ఎదిగారు. ఆయన ఏనాడూ తాను దేవుడనని చెప్పలేదు. పైగా తమరి మతం ఏమిటని చాలామంది ప్రశ్నించినా, అన్ని మతాలు తనవేనని చెప్పేవారు. మంచి మాటలు చెప్పిన మనిషిని, సద్గురువుగా భావించే వ్యక్తిని కూడా ఎవరోఒకరు విమర్శిస్తూనేఉంటారు. బాబావారు జీవించేకాలంలోనే ఇలా జరిగింది. ఇప్పుడు జరుగుతున్నదీ ఇదే.
స్వామీ స్వరూపానంద్ చేసిన వ్యాఖ్యలను ఆర్ఎస్ఎస్ తీవ్రంగా ఖండించింది. అసలు బాబా ఏనాడూ తాను దేవుడని చెప్పలేదనీ, కనుక వివాదానికి ఇక తెరదింపాల్సిందేనని తేల్చి చెప్పింది. ఆర్ఎస్ఎస్ లోనే చాలామంది బాబా భక్తులున్నారు. అన్ని వర్గాల్లోనూ బాబాని సద్గురువుగా భావిస్తున్నారనీ, హిందువుల మనసుల్లో మమేకమైన మహానుభావుడ్ని దూరం చేయాలనుకోవడం సరైన పోకడ కాదని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది.
అపరిపక్వంగా ఉన్న మనసుకు గురువు వేరు, దేవుడు వేరనిఅనిపించవచ్చేమోగానీ, పరిపక్వ మనసు మాత్రం ఈ రెంటికీ మధ్య తేడాలేదన్న సత్యాన్ని గుర్తిస్తుంది. సాయిబాబాని గురువు అని అనుకున్నా, లేక దేవుడని భావించినా ఒకటే. కనుక, సాయిబాబా దేవుడు కాదూ, గురువు మాత్రమే అని ఎవరైనా అన్నా అదీ తప్పే. అరెంటికీ తేడాలేదన్నదే నిజం. ఈ అభేద తత్వాన్ని జీర్ణించుకుంటే స్వామీజీలు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిఉండేవారుకారు. అసలు దేవుడి ఉనికే ప్రశ్నార్థకమైనప్పుడు సద్గురువులు, మంచిని పెంచే మహాపురుషులే మనకు నిజమైన దేవుళ్లు. వారిపైకూడా బురదజల్లే ప్రయత్నాలు మానుకోండి. వీలైతే గౌరవించండి, లేదంటే మౌనంగా పక్కకి తప్పుకోండి.
– కణ్వస