హు ఈజ్ శిఖా చౌదరి..?
ప్రముఖ వ్యాపారవేత్త.. చిగురుపాటి జయరాం.. హత్య కేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు శిఖా చౌదరి. ఈమె ఎవరు..? జయరాంతో.. ఆమెకు ఉన్న సంబంధం ఏమిటి..? చంపడానికి స్కెచ్ వేసింది ఆమేనా..? ఎందుకిలా చేసింది..? ఇవన్నీ ఈ కేసుపై ఆసక్తి పెంచుకున్న ప్రతి ఒక్కర్నీ వేధిస్తున్న ప్రశ్నలు.
పులివర్తి మాధురి అలియాస్ శిఖా చౌదరి..!
ఎక్స్‌ప్రెస్ టీవీ వైస్ ప్రెసిడెంట్ శిఖా చౌదరి. ఈ పేరు ఆ చానల్లో పని చేసిన వారికి చాలా మందికి తెలుసు. పర్వాలేదనుకున్న చానల్ క్షీణించిపోవడానికి.. చివరికి.. మూతపడటానికి ఈమేనని.. నెలల తరబడి జీతాలు అందుకోనివారు చెప్పే మాట. ఈ శిఖా చౌదరి చిగురుపాటి జయరాం మేనకోడలు. ఆమె అసలు పేరు పులివర్తి మాధురి. చిన్న చెల్లెలు సుశీల కుమార్తె. భర్త చనిపోవడంతో.. సుశీల… తల్లిదండ్రుల వద్దే ఉండేది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఒకరు మాధురి.. రెండో వారు మనీషా.
జయరాం పెద్ద చెల్లి శశికళ గుడ్లవల్లేరుకు చెందిన వెంకటాద్రితో వివాహం అయ్యింది. ఆమె ముగ్గురు పిల్లలు. వారు జయరాం వ్యాపార సంస్థల్లో ఉద్యోగులగా ఉన్నారు. రెండేళ్ల వ్యవధిలోనే జయరాం తల్లిదండ్రులు చనిపోవడంతోనే సమస్యలు ప్రారంభమయ్యాయి.
శిఖా ఎంట్రీతోనే సమస్యలు మొదలు..!
భారత్‌లో మీడియా, బ్యాంకింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టిన తర్వాత మేనకోడలు మాధురికి.. జయరాం ప్రాధాన్యత ఇచ్చారు. ఎక్స్‌ప్రెస్ టీవీలో ఉపాధ్యక్ష హోదా ఇచ్చారు. మరో మేన కోడలు మనీషాకు ఫార్మా కంపెనీలలో డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు. వారి ప్రమేయం.. పెరిగిన తర్వాతే.. జయరాంకు అసలు సమస్యలు ప్రారంభమయ్యాయి. ఎక్స్‌ప్రెస్ టీవీ జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్నప్పుడే..
చిన్న మేనకోడలికి రూ. 2 కోట్ల డొనేషన్ చెల్లించి ఏలూరు మెడికల్ కాలేజీలో సీటును కొనుగోలు చేశారు. అదే సమయంలో ఖరీదైన బీఎండబ్ల్యూ కారును.. శిఖా చౌదరికి కొనిచ్చారు. ఆ కారుతో సహా ఆమెను పోలీసులు .. నందిగామ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు.
శిఖా పేరుపై జయరాం ఆస్తులెందుకు పెట్టారు..?
పులివర్తి మాధురి విజయవాడలో ఇంజనీరింగ్ చదివారు. కానీ ఆమెకు సినిమాలపై ఆసక్తి. అందుకే.. అందుకే ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం తిరిగారు. కానీ సక్సెస్ కాలేకపోయారు. అయితే అక్కడ అయిన స్నేహాలతో మాత్రం.. ఆమె జీవితం మారిపోయింది. మీడియా రంగంలోకి చిగురుపాటి జయరాం రావడంతో.. టీవీ చానల్లో చోటు సంపాదించారు. ఆ తర్వాత కీలకమయ్యారు. చాలా ఆస్తులు.. జయరాం.. మాధురి అలియాస్ శిఖా పేరుపైనే పెట్టారని.. ఆయనను హత్య చేస్తే.. ఆ ఆస్తులన్నీ.. తనకు దక్కుతాయని.. శిఖా చౌదని ప్లాన్ చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే.. జయరాంను హత్య చేసిన తర్వాత ఆయన ఇంటికి వచ్చి డాక్యుమెంట్ల కోసం… వెదికారని చెబుతున్నారు.
శిఖా వల్లే కుటుంబంలో కలతలు..!
చెల్లెలి కుటుంబానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం.. వారి పిల్లలకు. వ్యాపార సంస్థల్లో కీలక స్థానాలు ఇవ్వడం.. చిగురుపాటి కుటుంబంలో కలతలకు కారణం అయిందని చెబుతారు. జయరాంకు చాలా కాల పాటు పిల్లలు లేకపోవడంతో భార్య పద్మశ్రీ చెల్లెలి కుమార్తె ను దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్న రెండేళ్ల తర్వాత జయరాం కు మరో కుమారుడు పుట్టాడు. 2013వరకు ఈ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవు. శిఖా అలియాస్ మాధురీ ఎంట్రీతోనే… జయరాం పతనం ప్రారంభమయింది.