సినిమా విడుదల అన్నది పెద్ద తలనొప్పి వ్యవహారం అయిపోయింది. చిన్న సినిమాలకు ఎలాగూ థియేటర్లు దొరక్క ఇబ్బంది ఎదురవుతోంది. పెద్ద సినిమాలకేమో డేట్ల సమస్య. ఒకేసారి రెండు పెద్ద సినిమాలు రావడానికి కుదరదు. అందుకే ఇద్దరు నిర్మాతలూ మాట్లాడుకొని..రెండు వారాల వ్యవధిలో సినిమాల్ని విడుదల చేసుకోవాలనుకొంటున్నారు. అయితే… ఇప్పుడు ఆ గ్యాప్ విషయంలోనూ సమస్యలొస్తున్నాయి. త్రివిక్రమ్ సినిమా అఆ… పూర్తయింది. రీ రికార్డింగ్‌తో సహా అన్ని కార్యక్రమాల్నీ ముగించుకొంది. సెన్సార్ ఒక్కటే బాకీ. అయితే బ్రహ్మోత్సవం తరవాత అఆ ని విడుదల చేద్దామనుకొన్నారు. ఇప్పుడు బ్రహ్మోతం విడుదల తేదీ కన్ఫామ్ చేస్తే గానీ.. అ ఆ రిలీజ్ డేట్ ప్రకటించడానికి వీల్లేని పరిస్థితి.
బ్రహ్మోత్సవం సినిమాని మే 20న విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించుకొంది. అయితే.. ఇప్పుడు ఆ డేట్ విషయంలో ముందుకీ వెనక్కీ ఊగిసలాడుతోంది బ్రహ్మోత్సవం టీమ్. 20న వస్తే… అఆ జూన్‌లో రావాలి. అప్పటికే చాలా లేట్ అయినట్టు. ఒకవేళ బ్రహ్మోత్సవం 27కి వాయిదా పడితే.. మే 13న అఆ ని విడుదల చేసుకోవొచ్చు. కానీ బ్రహ్మోత్సవం టీమ్ మాత్రం విడుదల తేదీ కన్ఫామ్ చేయట్లేదు. అలాగని అఆని కన్ఫామ్ చేయనివ్వట్లేదు. ”20న వస్తామో రామో చెప్పేస్తే ఓ పనైపోతుంది కదా? మమ్మల్ని అడ్డుకోవడం ఎందుకు” అని అఆ టీమ్ వర్గాలు కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నట్టు టాలీవుడ్ టాక్. గత రెండు రోజులుగా పివీపీ, హాసిని అండ్ హారిక సంస్థలు రెండూ రిలీజ్ డేట్ విషయంలో తర్జనభర్జనలు పడుతున్నార్ట. మరి ఈ వ్యవహారం ఎప్పటికి తెవులుతుందో ఏమిటో?