కృష్ణా జిల్లాలో అధిక వడ్డీలు, వ్యాపారంలో లాభాల వాటా చూపించి రూ. రెండు వేల కోట్ల వరకూ మోసం చేసిన ఇద్దరు మోసగాళ్ల వ్యవహారం సంచలనం అవుతోంది. వారి వద్ద పెట్టుబడి పెట్టిన వాళ్లు ఎక్కువ మంది వైసీపీ నేతలే. ఓ వైసీపీ ప్రజాప్రతినిధి ఏకంగా రూ. వంద కోట్లు వారికి ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే అది మొత్తం బ్లాక్ మనీ కావడంతో .. ఎలా వసూలు చేసుకోవాలో తెలియక..తంటాలు పడుతున్నారు.
కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం పెట్టి.. అప్పులు చేశారు. నూటికి ఐదు రూపాయలకుపైగా వడ్డీ ఇస్తామని నమ్మించారు. చాలా నమ్మకంగా వడ్డీలు కట్టడంతో అప్పులు కోట్లలో పుట్టాయి. ఇదే సందనుకుని ఓ గోడౌన్ ను కూడా విజయవాడ శివార్లలో అద్దెకు తీసుకుని అందులో కొంత సరుకు నింపారు. ఈ క్రమంలో పరిచయం అయిన ఓ ప్రజాప్రతినిధి వారికి వంద కోట్లకుపైగా నగదు ఇచ్చి నెలకు ఐదు కోట్లకుపైగా వడ్డీ వసూలు చేయడం ప్రారంభించారు. హఠాత్తుగా ఆ ఇద్దరు వ్యాపారులు చెల్లింపులు నిలిపివేశారు. వారికి అప్పుగా ఇచ్చ్చిన మొత్తాల్లో అత్యధికం బ్లాక్ మనీనే కావడంతో పోలీసు కేసుల వరకూ వెళ్లలేదు.
అయితే వైసీపీ ప్రజాప్రతినిధి తన అనుచరులతో కలిసి హైదరాబాద్ లోని వారి ఇళ్లపై దాడులు చేసి ఇంట్లో దొరికిన బంగారం, నగదు పట్టుకు వచ్చారని తెలుస్తోంది. ఈ క్రమంలో .., వారు హైదరాబాద్ వెళ్తున్నప్పుడు ఓ కారు ప్రమాదానికి గురైందని చెబుతున్నారు.ఈ విషయంలో హైదరాబాద్ లో … కేసులు నమోదయ్యాయని..తనపై దాడి చేశారని డబ్బులు అప్పులుగా తీసుకుని మోసం చేసిన వ్యక్తి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారం కృష్ణా జిల్లా వైసీపీ నేతల్లో కలకలం రేపుతోంది.
రూ. వంద కోట్లు పోగొట్టుకున్న నేత ఎవరో అందరికీ తెలుసని.. అక్రమంగా మట్టి తవ్వేసి సంపాదించుకున్న సొమ్ము ఎలా నిలుస్తందని .. సెటైర్లు వేస్తున్నారు.