ప్రాంతీయ పార్టీ స్ధిరపడిపోయిన రాష్ట్రంలో ఆపార్టీని ఓడించడం మరో ప్రాంతీయ పార్టీ వల్ల మాత్రమే అవుతుంది. ఈ విషయాన్ని వరంగల్ ఉప ఎన్నిక ఫలితం కూడా చెబుతోంది.
ఎన్ టి ఆర్ స్ధాపించిన తెలుగుదేశం పార్టీ మాత్రమే తెలుగునేల మీద ప్రాంతీయ పార్టీగా నిలదొక్కుకుని స్ధిరపడింది. జాతీయపార్టీ అయిన కాంగ్రెస్ ను వై ఎస్ రాజశేఖరరెడ్డి ప్రాంతీయ పార్టీ స్ధాయికి రీ సైజ్ చేసి తెలుగుదేశాన్ని ఢీకొట్టి రెండు సార్లు ఓడించారు.
జాతీయపార్టీలైన కాంగ్రెస్ కాని, బిజెపి కాని లోక్ సభలో సాధించినన్ని హెచ్చు స్ధానాలను రాష్ట్రాల్లో సాధించలేకపోవడానికి స్ధూలంగా ఒక కారణం అవి పూర్తిగా ప్రాంతీయ అవతారాలను ధరించలేకపోవడమే. అయితే స్ధానిక అవసరాలకు అనుగుణంగా రూపాన్ని, గుణాన్ని, లక్షణాన్ని మార్చుకోవడం జాతీయ పార్టీలకు సాధ్యపడదు. ఒక ప్రాంతీయ పార్టీ ఏలుబడిలో వున్న రాష్ట్రంలో శత్రుపక్షంగానో, తటస్ధ పక్షంగానో, వున్న జాతీయ పార్టీ అధికారంలోకి రావడం చాలా కష్టం, మిత్రపక్షంగా వుంటే దాదాపు అసాధ్యం. ఈ “రూల్” తమిళనాడులో స్పష్టంగా కనిపిస్తోంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వరూప స్వభావాల వల్ల అది ఒక ప్రాంతీయ పార్టీగా స్ధిరపడినట్టు కనిపించడంలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయవారసత్వం కోసం పట్టుబట్టిన ఆయన కుమారుడు జగన్ పార్టీ పెట్టినా దాని ఎజెండాలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు సంబందించిన ఉనికి లేదు. పవన్ కల్యాణ్ ప్రకటించిన ‘జనసేన’ కు కూడా ప్రాంతీయ లక్షణం లేదు. అయినా కూడా ఒక ఫ్రెష్ నెస్ వుంది. జగన్ పార్టీ కి అలాంటి ఫ్రెష్ నెస్ లేదు. పైగా పాతబడిపోతోంది. అన్నిటికీ మించి కోర్టు కేసుల నుంచి పూర్తిగా బయటపడే వరకూ జగన్ ఒక రాజకీయ ప్రత్యామ్నాయం కాగలరన్న నమ్మకం కుదరదు.
తెలంగాణాకి, ఆంధ్రప్రదేశ్ కీ ఆస్ధుల పంపకాల పంచాయితీలు వున్నాయి…దాయాది తగాదాలు వున్నాయి. ఉద్వేగపూరితమైన స్పర్ధలు వున్నాయి. అసలు ఒకరి నొకరు ద్వేషించుకోవడంలోనే రెండు రాష్ట్రాల పాలకపక్షాలకూ ”క్లాష్ ఆఫ్ ఇంట్రెస్టు” లాభాలు వున్నాయి. ఇందువల్లే వరంగల్ ఎన్నికకు తెలుగుదేశం దూరంగా వుండి పరాజయ అవమానాన్ని తప్పించుకుంది. పోటీనుంచి బిజెపి తప్పుకోలేక పోయింది.
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం బిజెపి పార్టీల మధ్య నిర్మొహమాటమైన హద్దు చూపించే ప్రయత్నం సోము వీర్రాజు చేశారు. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం గా నిలబడాలంటే అది మాత్రమే చాలదు. బిజెపి కాని, కాంగ్రెస్ కాని, ప్రాంతీయ పార్టీ స్ట్రక్చర్ లోకి మారిపోవలసిందే! మహా అయితే తీవ్ర విమర్శలే తప్ప అంతవరకూ తెలుగుదేశానికి అడ్డూ అదుపూ వుండదు.
పార్టీ నిర్మాణం జరగనందున, సొంత అభ్యర్ధులు లేనందున ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, వచ్చే ఎన్నికలకు సిద్ధంకాగలమనీ 2014 లో ”జనసేన” వ్యవస్ధాపకుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆయన (రూపుదిద్దుకోవలసిన ఆయన పార్టీ మినహా) తెలుగుదేశం పార్టీకి రాజకీయ ప్రత్యామ్నాయం. కనుచూపు దూరం లో లేదు.