మాజీ సీఎం కేసీఆర్ కొన్ని విషయాల్లో ఎవ్వరు చెప్పినా వినరు. కేటీఆర్, హరీష్ సహా ఇంకెవరైనా సరే… కేసీఆర్ చాలా నిర్ణయాల్లో స్ట్రిక్ట్ గా ఉంటారు. చాలా సార్లు అది మైనస్ అయినా, కేసీఆర్ రూటు మారలేదు. ఇప్పుడు బీజేపీ విషయంలో కేసీఆర్ కు అదే మైనస్ అయినట్లు కనపడుతోంది.
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బీజేపీ టాప్ లీడర్ షిప్ విషయంలో చాలా ముందుకు వెళ్లిపోయారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో… బీజేపీలో కీ లీడర్ గా ఉన్న బీఎల్ సంతోష్ ను టచ్ చేశారు. ఆయనను అరెస్ట్ చేసే వరకు వెళ్లారు. కోర్టు నుండి రిలీఫ్ తెచ్చుకోవటంతో ఆ అరెస్ట్ ఆగింది. కానీ ఇటు బీజేపీలో, అటు ఆర్ఎస్ఎస్ లో బీఎల్ సంతోష్ కీలకమైన వ్యక్తి. పైగా, మా ఎమ్మెల్యేలను కొంటున్నారు…ఈయనే కీలక వ్యక్తి అంటూ సుప్రీంకోర్టు జడ్జిల నుండి హైకోర్టు జడ్జిల వరకు కేసీఆర్ సీడీలు పంపించారు. ఆ విషయంలో బీజేపీ టాప్ లీడర్ షిప్ చాలా ఇబ్బందిపడిందన్న వార్తలొచ్చాయి.
నిజానికి కేసీఆర్ ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఉన్న కవితను బయటపడేసేందుకు బీఎల్ సంతోష్ పై కేసు పెట్టాలనుకున్నారు అన్న చర్చ కూడా సాగింది. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కేసీఆర్ కు ఇబ్బందికర పరిస్థితి తీసుకొచ్చింది. ఓవైపు కవిత అరెస్ట్ అయ్యారు. కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ ను కాపాడుకునేందుకు కేటీఆర్-హరీష్ రావులు బీజేపీతో టచ్ లోకి వెళ్లినా… వారు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 8సీట్లు రాగా, బీఆర్ఎస్ కు 0 రావటం కూడా ఇప్పుడు బీజేపీ లెక్కించుకుంటున్న అంశం.
అయితే, పొత్తుల విషయంలో బీఎల్ సంతోష్ నో చెప్పారని… అందుకే పార్టీ నుండి బీఆర్ఎస్ కు ఆశించిన ఫలితాలు రాలేదన్న చర్చ సాగుతోంది. సంస్థాగతంగా బీఎల్ సంతోష్ కు పార్టీపై పట్టుందని, ఆయన్ను కాదని… అందులోనూ దక్షిణాదిలో ఎలాంటి చర్యలు తీసుకోరని, ఆనాడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు వారికి శాపంగా మారిందన్న చర్చ బీజేపీలో సాగుతోంది.