చీరాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఎప్పటికప్పుడు షాకులు ఇస్తూనే ఉంది. అధికారంలోకి వచ్చిన 2014 ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన టీడీపీ తర్వాత 2019లో విజేతగా నిలిచింది. ఇండిపెండెంట్‌గా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ అభ్యర్థిగా.. టీడీపీ నేత కరణం బలరాం చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరారు. దీంతో టీడీపీకి అక్కడ సరైన నేత లేకుండా పోయారు. ఎమ్మెల్సీగా ఉన్న పోతుల సునీత కూడా వైసీపీ బాట పట్టడంతో టీడీపీ ఊపిరి పీల్చుకుంది. కానీ సరైన నేత మాత్రం ఇంకా దొరకలేదు.
ఇటీవలే కొండయ్య అనే విద్యా సంస్థల అధినేతను ఇంచార్జ్ గా నియమించారు. గతంలో ఆయన ఓ సారి టీడీపీ తరపున ఒంగోలు పార్లమెంట్‌కు పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత యాక్టివ్‌గా లేరు. కానీ ఇటీవల చంద్రబాబు ఆయనకు చీరాల ఇంచార్జ్ పదవి ఇచ్చారు. ఆయన పని చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు చీరాల టిక్కెట్ ఆయనకు కాదని ఎన్నికలకు ముందు ఓ కీలక నేత టీడీపీలోకి వస్తారని ఆయనకు సీటు ఇస్తారన్న ప్రచారం ప్రారంభమయింది. అయితే ఎవరు వచ్చినా కొండయ్యతో కలిసి పని చేయాలని చంద్రబాబు తేల్చేశారు కానీ..టిక్కెట్ కొండయ్యకే అని చెప్పలేదు.
వైసీపీలో ముగ్గురు టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. ఆమంచి కృష్ణమోహన్, కరణం వెంకటేష్, పోతుల సునీత పోటీ పడుతున్నారు. వీరిలో ఒకరికే చాన్స్ వస్తుది. మిగిలిన ఇద్దరికీ నిరాశ తప్పదు. వీరిలో ఒకరు టీడీపీలోకి వస్తారని అనుకుంటున్నారు. కానీ అలాంటి చాన్స్ లేదని చెబుతున్నారు. చీరాల నుంచి బరిలో ఉండబోయేది దగ్గుబాటి కుటుంబ వారసుడు హితేష్ అన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవలి కాలంలో దగ్గుబాటి కుటుంబం… పాత గొడవలు మర్చిపోతోంది. రాజకీయాలపై ఆసక్తితో ఉన్న హితేష్ గతంలోనే వైసీపీ నుంచి పోటీ చేయాల్సి ఉంది. ఆయన అమెరికా సభ్యత్వం రద్దు చేసుకోలేకపోవంతో సమస్య వచ్చింది. ఇప్పుడు ఆ కుటుంబం వైసీపీలో లేదు. పెద్దరిల్దరూ రిటైర్మెంట్ తీసుకున్నా.. హితేష్‌కు టీడీపీలోనే రాజకీయ భవిష్యత్ చూడాలన్న ఆలోచనకు వచ్చారని అంటున్నారు.