భారీ అంచనాలు మోసుకొచ్చిన సర్దార్ గబ్బర్‌సింగ్ బాక్సాఫీసు దగ్గర భీకరంగా పల్టీకొట్టింది. ఆ సినిమాని కొని సగానికి సగం నష్టపోయినవాళ్లు, రోడ్డుమీదకొచ్చినవాళ్లు, దివాళా తీసిన వాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లని ఆదుకోవడానికే… కాటమరాయుడు సినిమా తీస్తున్నారన్న ప్రచారం జరిగింది. అయితే.. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. సర్దార్ గబ్బర్ సింగ్ కొన్నవాళ్లు ఇప్పుడు రోడ్డుమీద కొచ్చి.. పవన్ కల్యాణే న్యాయం చేయాలి అంటూ నినదిస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లా డిస్టిబ్యూటర్ సంపత్ కుమార్ మీడియా ముందుకొచ్చారు. సర్దార్ సినిమా కొని దాదాపు రెండు కోట్లు నష్టపోయానని, పవన్ కల్యాణే ఆదుకోవాలని మీడియా ముందు మొరపెట్టుకొన్నారు. ఈరోజు సంపత్ కుమార్.. రేపు ఇంకెవరు వస్తారో?? మొత్తానికి సర్దార్ సినిమాని కొన్న డిస్టిబ్యూటర్లకు అన్యాయం జరుగుతోందన్న మాట వాస్తవం. కాటమరాయుడు సినిమాని కొత్త వాళ్లకు అమ్మాలన్న ప్లాన్ జరుగుతోందన్నది నిజం. దీనిపై పవన్ స్పందిస్తాడా… లేడా అన్నదే క్వశ్చన్ మార్క్.
ఈ టోటల్ ఎపిసోడ్లో విలన్లుగా కనిపిస్తోంది పవన్ ఆప్త మిత్రుడు, సర్దార్ నిర్మాత శరత్ మరార్, పవన్ మేనేజర్ శ్రీనివాస్. సర్దార్ గబ్బర్‌సింగ్ క్రేజ్‌ని క్యాష్ చేసుకొంటూ ఏకంగా ఈరోస్ సంస్థకు రూ.75 కోట్లపై చిలుకు రేటుకు అమ్మేసింది నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్. వాళ్ల దగ్గర నుంచి.. పంపిణీదారులు సర్దార్ సినిమాని కొన్నారు. అయితే… అప్పుడు మీడియేటర్లుగా వ్యవహరించింది మాత్రం శరత్, శ్రీనివాస్‌లే. ‘మీరు కొనండి..మీ వెనుక మేం ఉంటాం..’ అని భరోసా ఇచ్చింది వాళ్లే. అందుకే పవన్ సినిమా ఏనాడూ కృష్ణా జిల్లాలో రూ.3.5 కోట్లు దాటకపోతే.. రూ.4.5 కోట్లకు ఎగబడి కొనేశారు. తీరా చూస్తే.. రెండు కోట్ల నష్టం వచ్చింది. మిగిలిన అన్ని ఏరియాల్లోనూ ఇదే పరిస్థితి. దాంతో.. పంపిణీదారులు శరత్ మరార్ చుట్టూ తిరగడం మొదలెట్టారు. వాళ్ల తాకిడికి తట్టుకోవడానికి ‘ఇదిగో.. మీ కోసమే సినిమా తీస్తున్నాం..’ అంటూ కాటమరాయుడుని చూపించి తప్పించుకొన్నారు. సరే.. కాటమరాయుడు ఉంది కదా అని అప్పటికి పంపిణీదారులంతా రిలాక్స్ అయిపోయారు. పవన్ ఉద్దేశం కూడా సర్దార్ తో నష్టపోయిన వాళ్లని ఆదుకోవాలనే. అందుకే ప్రొడక్షన్ విషయంలోనూ పవన్ కాంప్రమైజ్ అవుతూ వస్తున్నాడు. తీరా చూస్తే ఇప్పుడు సీన్ మారింది.
సర్దార్ పంపిణీదారుల్ని తప్పించడానికి శరత్ మరార్ తనదైన స్టైల్లో స్కెచ్ తయారు చేశాడు. తన స్నేహితులు, నమ్మిన బంట్లు, ఎంత అడిగితే అంత ఇచ్చేవాళ్లూ సీన్లోకి ఎంటర్ అవుతున్నారు. నిర్మాతగా నాలుగు డబ్బులు వెనకేసుకోవడం మళ్లీ మొదలైంది. మరి ఇచ్చిన మాట ఏమైంది?? సర్దార్ వల్ల నష్టపోయిన వాళ్ల బతుకులు ఇంతేనా?? దీనికి మాత్రం సమాధానం లేదు. ఇదే విషయమై కొంతమంది పంపిణీదారులు శరత్ మరార్‌ని నిలదిస్తే.. ‘మీరు సినిమాని మా దగ్గర కొనలేదు.. ఈరోస్ దగ్గర కొన్నారు. వాళ్లనే అడగండి’ అన్నట్టు మాట్లాడుతున్నార్ట. ఈ విషయాలేవీ పవన్‌కి తెలీదు. తెలిస్తే స్పందిస్తాడా? తన స్నేహితుడు శరత్ మరార్‌కి వకాల్తా ఇచ్చుకొంటాడా, లేదంటే పంపిణీదారుల వైపు మాట్లాడతాడా?? అనేది ఆసక్తి కరంగా మారింది. మొత్తానికి కాటమరాయుడు సినిమా వివాదాల్లో ఇరుక్కొన్నట్టే కనిపిస్తోంది. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.