తెలంగాణలో ఓ అమ్రిష్ పురి లాంటి విలన్ ఉన్నారా..? ఆయన టీవీ చానళ్లన్నింటినీ కబ్జా చేస్తున్నారా..? పోలీసులను, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుని.. మీడియా చానళ్లన్నింటినీ స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా..?. అవుననే అంటున్నారు… టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్. ఫోర్జరీ కేసులో రెండో రోజు.. సైబరాబాద్ పోలీసుల ఎదుట విచారణకు హాజరైన… రవిప్రకాష్… తాను మాఫియాతో పోరాడుతున్నానని ప్రకటించారు. తెలంగాణలో మీడియాను కబ్జా చేసేందుకు మాఫియా ప్రయత్నిస్తోందని… ఆ మాఫియాకు అమ్రిష్‌పురిలాంటి ఒక విలన్.. నేతృత్వం వహిస్తున్నాడన్నారు. ప్రస్తుతం మీడియా, మాఫియా మధ్య యుద్ధం జరుగుతోందని రవిప్రకాష్ విశ్లేషించారు. ఈ మాఫియాకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు. దొంగ పత్రాలతో భూములు లాక్కొన్నట్లు మీడియాను ఆక్రమిస్తున్నారని మండిపడ్డారు.
పోలీసుల సహకారంతో మోజోటీవీ యాజమాన్యాన్ని బెదిరించి లాక్కున్నారు ఆరోపించారు. మీడియా కబ్జాపై జర్నలిస్ట్‌లంతా పోరాడాలన్నారు. రవిప్రకాష్ చెప్పిన దాని ప్రకారం.. ఆ అమ్రిష్ పురి లాంటి విలన్…మైహోం గ్రూప్ అధినేత రామేశ్వరరావే అయి ఉంటారు. ఎందుకంటే..టీవీ9 అమ్మకపు వివాదంలో ప్రస్తుతం… రవిప్రకాష్ ఆయనపైనే విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే రామేశ్వరరావు ఆధ్వర్యంలోని సంస్థలు.. కమ్యూనిస్టు చానల్ అయిన టెన్ టీవీని కొనుగోలు చేశారు. మేఘా కృష్ణారెడ్డితో కలిసి టీవీ9ని కూడా.. కొనుగోలు చేశారు. రవిప్రకాష్ చెప్పిన దాని ప్రకారం చూస్తే.. ఇప్పటికే మోజో టీవీ కూడా .. రామేశ్వరరావు అధీనంలోని సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయినట్లు తేటతెల్లమవుతోంది. కొద్ది రోజుల క్రితం… ఎన్నికౌంటింగ్ ముందు రోజు… మోజో టీవీలో చాలా గందరగోళం నెలకొంది.
రామేశ్వరరావు..తమ టీవీ చానల్‌ను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ.. సీఈవో రేవతి.. అర్థరాత్రి వరకూ.. బ్రేకింగ్ న్యూస్ నడిపారు.తమ చానల్ చైర్మన్ ను పోలీసులు బెదిరించి.. ఉచితంగా..మోజో టీవీ వాటాలను రాయించుకున్నట్లు ఆరోపించారు. అయితే.. ఆ తర్వాత నుంచి హఠాత్తుగా.. ఈ ఆందోళన ఆగిపోయింది. అంతకు ముందు చెప్పినట్లుగా.. రామేశ్వరరావు గురించి ఎలాంటి నెగెటివ్ వార్తలు రాలేదు. అదే సమయంలో.. ఆ చానల్ న్యూస్ స్ట్రాటజీ కూడా మారిపోయింది. రవిప్రకాష్ చెప్పిన దాని ప్రకారం చూస్తే.. మరికొన్ని టీవీ చానళ్లు కూడా ప్రమాదంలోఉన్నట్లు అంచనా వేసుకోవచ్చు. అవేమిటన్నది త్వరలో బయటకు వస్తుంది. మొత్తానికి రవిప్రకాష్ విచారణకు హాజరవుతూనే… తాను పోరాడబోతున్నట్లుగా.. ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదని..తమ మాటలతోనే చెబుతున్నారు.