ఆంధ్రుల ఆత్మగౌరవ సమస్యగా మారుతోంది… ప్రత్యేక హోదా! కేంద్రం ఇవ్వదు. రాష్ట్రం అడగదు..! ప్రజలను అడగనివ్వదు..! ఈ అసహనమే ఆర్కే బీచ్ ఉద్యమానికి దారి తీసింది. ప్రత్యేక హోదా పట్ల ఆంధ్రుల మనోభావాలు ఎలాగున్నాయో అద్దం పట్టేందుకు వేదిక అయింది. ఎక్కడికక్కడ విద్యార్థుల అణచివేతలు… నాయకుల అరెస్టులు… పోలీసుల తోపులాటలు… దిగ్బంధనాలు, ఆంక్షలు. ఇన్ని ప్రతిబంధకాల మధ్య చివరికి గెలిచింది ఎవరు..? ఈ ప్రశ్నకు ఒకేఒక్క సూటి సమాధానం… అధికార పక్ష మీడియా!
మీడియా ప్రజల పక్షం ఉండాలి. ఆంధ్రాలో మాత్రం అధికార పక్షం కొమ్ముకాసే వారే ఎక్కువ! అక్కడ మీడియాకు ఉన్న స్వేచ్ఛ అలాంటిది. అధికారంలో ఉన్నవారి అడుగులకు మడుగులొత్తితేనే మనుగడ. తేడా వస్తే ఏం జరుగుతుందో కూడా చూస్తున్నాం! ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రులు స్వచ్ఛందంగా శాంతియుతంగా ఉద్యమించేందుకు వేదికను ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేక హోదాపై తమ ఆవేదనను మౌన ప్రదర్శన ద్వారా వ్యక్తపరచాలనుకున్నారు. ఓపక్క జనసేన అధినేత ట్వీట్లరతో సపోర్ట్ ఇచ్చారు. ఇంకోపక్క ప్రతిపక్ష నేత వైజాగ్ వచ్చేసి నైతిక మద్దతు ప్రకటించారు. ఈ స్థాయిలో సపోర్ట్ ఉన్నా సరే… అధికార పార్టీ అణచివేత ఎక్కడిక్కడ స్పష్టంగా కనిపించింది.
ఉదయం నుంచే అరెస్టుల పర్వం మొదలైంది. బీచ్ రోడ్డును పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. చివరికి విద్యాసంస్థలు కూడా స్టూడెంట్స్పై ఆంక్షలు పెట్టేలా చేశారు! ఉదయం నుంచి సాయంత్రం ఏడు గంటల వరకూ ఇంత జరుగుతున్నా సరే.. కొన్ని మీడియా సంస్థలకు చీమకుట్టినట్టైనా అనిపించలేదు! ఇన్ని పరిణామాలు చోటుచేసుకుంటూ ఉంటే ఒక్క లైన్ వార్తను కూడా ప్రసారం చేయలేదు..! పైపెచ్చు, కొంతమంది అత్యుత్సాహవంతులైతే… సాయంత్రం ఐదు గంటల నుంచే ‘విశాఖలో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయీ… రోడ్లన్నీ ఖాళీ అయిపోయాయీ.. అనుకున్న స్థాయిలో విద్యార్థులు బీచ్‌కి రాలేదూ’ అంటూ కన్‌క్లూజన్ ఇచ్చేశారు!
ఉదయం నుంచే ఎక్కడిక్కడ కుర్రాళ్లను అరెస్టు చేస్తుంటే… అవెందుకు వీళ్లకి కనిపించలేదు! దేశంలో ఏదో అత్యవసర పరిస్థితి ఉన్నట్టుగా ఆర్కే బీచ్‌ను అష్టదిగ్బంధనం చేసేస్తే అదెందుకు వీళ్లకి అర్థం కాలేదు..? అధికార పార్టీ చర్యలన్నీ అణచివేతగా ఎందుకు అనిపించడం లేదు…? రాజ్యాంగబద్ధంగా వచ్చిన భావ ప్రకటనా స్వేచ్ఛ ఉల్లంఘనకు గురౌతున్నట్టు ఎందుకు అనిపించలేదు..? ఆర్కే బీచ్ ఉద్యమానికి యువత నుంచి ఆశించిన స్పందన లేదని విశ్లేషిస్తున్నవారికి… వేల మంది పోలీసు బలగాల్ని విశాఖలో మోహరించాల్సిన అవసరమేమొచ్చిందో కనిపించలేదా..? నియంతృత్వ పోకడలవైపు అడుగులేస్తున్న రాజ్యాధికారం ఎందుకు అర్థం కావడం లేదు..? పొలిటికల్ ఇంట్రెస్టులకు అతీతంగా ప్రజలు ముందుకు సాగుతున్నప్పుడు వారి వెంట నిలవాల్సింది ఎవరు..? వారికో మార్గనిర్దేశం చేయాల్సింది ఎవరు..?
కొన్ని ఛానెల్స్… లేదా కొన్ని పత్రికల్లో యువత ఆవేదన ప్రతిబింబించనంత మాత్రాన.. ప్రత్యేక హోదాకు మద్దతు లేదనుకోవడం అవివేకం. ఆర్కే బీచ్‌లో జరిగింది కేవలం ప్రారంభం మాత్రమే. కానీ… దీన్ని కాసేపు కప్పిపుచ్చడంలో కొంతమంది తాత్కిలిక విజయం సాధించారని చెప్పుకోవాలి!