ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు .. విజయసాయిరెడ్డిపై కోపం వచ్చింది. ఎందుకంటే ప్రధానమంత్రి విశాఖ పర్యటన ఏర్పాట్లను విజయసాయిరెడ్డి సమీక్షించారట. అసలు ఆయనెవరని..పులివెందులలో సోము వీర్రాజు ప్రశ్నించారు. ఏపీ బీజేపీ వ్యవహారాలను.. పర్యవేక్షించే ప్రక్రియలో భాగంగా పులివెందుల వెళ్లిన సోము వీర్రాజు అక్కడ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి విశాఖలో చేస్తున్న ప్రధాని పర్యటన ఏర్పాట్లపై కస్సుమన్నారు. ఆయనకు ఏం అధికారం ఉందని ప్రశ్నించారు.
నరేంద్రమోదీ పర్యటన విషయంలో ఎంపి విజయ సాయిరెడ్డి ప్రజలను అయోమయానికి గురి చే స్తున్నారని అసహనం వ్యక్తం చేశారు . భారత ప్రధాని అధికారిక పర్యటన ఎపి ప్రభుత్వం ఛీఫ్ సెక్రటరీ ప్రకటించాలని, కలెక్టర్ లు పర్యటన వివరాలు చెప్పాలని అయితే అంతా విజయసాయిరెడ్డి ప్రధానమంత్రి పర్యటన విషయాలు ప్రకటన చేయడాన్ని సోమువీర్రాజు అసంత్రుప్తి వ్యక్తం చేశారు. విశాఖలో విజయసాయిరెడ్డి నిర్వహించిన సమీక్షను సోమువీర్రాజు తప్పుపట్టారు. ఈ విషయంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు.
ప్రధాని వస్తున్నారని ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతాలు..బహిరంగసభ కూడా ఏర్పాటు చేస్తున్నామని.. ఇదంతా పార్టీలకు అతీతమైనదని విజయసాయిరెడ్డి చెబుతున్నారు. ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ పరంగా నిర్వహించినా.. రాజ్యసభ ఎంపీ పదవి తప్ప.. ప్రభుత్వంలో ఎలాంటి బాధ్యతా లేని విజయసాయిరెడ్డి ఎందుకు ఇలా ఓవరాక్షన్ చేస్తున్నారో బీజేపీ నేతలకు అంతుబట్టడం లేదు. ఓ వైపు తమకు సమాచారం లేదనే అవమానం.. ప్రధాని వస్తూంటే వైసీపీ హడావుడి చేయడం.. వారికి నచ్చడం లేదు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి.