ప్రతిభావంతుడైన క్రికెటర్.. తన ప్రతిభకు తగ్గ స్థాయికి చేరుకోలేక.. రిటైర్మెంట్ ప్రకటించారు. దానికి అందరూ.. చీఫ్ సెలక్టర్‌గా ఉన్న వ్యక్తినే నిందించడం ప్రారంభించారు. క్రికెట్ గురించి తెలిసిన వారి దగ్గర్నుంచి అసలు … సెలక్షన్ ఎలా జరుగుతుందో తెలియని వారు కూడా.. చీఫ్ సెలక్టర్‌నే నిందిస్తున్నారు. ఆయన ఇంటర్నేషనల్ రికార్డులతో.. రాయుడు రికార్డులను పోల్చి.. ఎగతాళి చేస్తున్నారు. ఆ క్రికెటర్ అంబటి రాయుడని… ఆ నిందలు పడుతోంది.. ఎమ్మెస్కే ప్రసాద్ అని సులువుగానే అర్థమైపోతుంది.
అంబటిని తొక్కేసింది ఎమ్మెస్కేనేనా..?
ప్రపంచకప్ జట్టులో అంబటి రాయుడుకు చోటు దక్కకపోవడానికి.. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాదే కారణమని చాలా మంది ఆరోపిస్తున్నారు. దానికి కులం కోణం ఆపాదిస్తున్నారు. ఎమ్మెస్కే కులం ఏమిటో సాధారణ క్రికెట్ అభిమానులకు తెలియదు. బహుశా.. ఆయన బంధుమిత్రులకు… ఇంకా చెప్పాలంటే.. క్రికెట్ వర్గాలకు తెలుస్తుందేమో…? . ఆయన కులం కాదు కాబట్టే.. అంబటి రాయుడిని సెలక్ట్ చేయలేదని.. గగ్గోలు పెడుతున్నారు. అంబటికి అవకాశాలు రాకపోవడానికి ఆయనే కారణమని చెబుతున్నారు. ఓ వ్యక్తి.. ఓ ఆటగాడ్ని తొక్కేయడం… అదీ కులం కోణంలో… అనేది ఎంత అసహజమో.. విమర్శించేవారికి అర్థం కాదు. కానీ..ఎమ్మెస్కే.. నిందించడానికి … పడటానికి అర్హమైన కులానికి చెందిన వ్యక్తి అన్నట్లుగా చెలరేగిపోతున్నారు.
అసలు సెలక్షన్లో ఎమ్మెస్కే మాటకు ఎంత విలువ ఉంటుంది..?
భారతజట్టు సెలక్షన్ కమిటీ ఐదుగురితో ఉంటుంది. బీసీసీఐ ఐదు జోన్లుగా ఉంటుంది. ఐదు జోన్ల నుంచి ఒక్కో సెలక్టర్ ఉంటారు. వారిలో ఒకరిని చీఫ్ సెలక్టర్‌గా ఎంపిక చేస్తారు. ప్రస్తుతం లోథా కమిటీ సిఫార్సుల మేరకు.. జోన్ల ప్రస్తావన లేకపోయినప్పటికీ.. ఆయా ప్రాంతాలకు చెందిన మాజీ క్రికెటర్లే సెలక్టర్లుగా ఉన్నారు. ప్రస్తుతం సౌత్ జోన్ నుంచి.. ఎమ్మెస్కే ప్రసాద్ చీఫ్ సెలక్టర్‌గా ఉండగా.. దేవాంగ్ గాంధీ, జతిన్ పరాంజపే, గగన్ ఖోడా, శరణ్‌దీప్ సింగ్… ఇతర సెలక్టర్లుగా ఉన్నారు. టీం ఎంపికలో.. ఐదుగురికి ఓటింగ్ రైట్స్ ఉంటాయి. చర్చలు తక్కువగా జరుగుతాయి. ఓటింగ్ కు ప్రాధాన్యం ఇస్తారు. అలాగే.. కోచ్, కెప్టెన్ మాటలకూ ఎక్కువ విలువ ఉంటుంది. సహజంగా.. సెలక్షన్ కమిటీలో జోన్ల ప్రాతిపదికన చూసుకున్నా… ఉత్తరాది ప్రాబల్యం ఉంది. వారికే.. మిగతా సెలక్టర్లు ఓటు వేస్తారు. అవకాశాలు వారికే దక్కుతాయి. ఎమ్మెస్కే ఓటు వేసినా.. ఏం ప్రయోజనం ఉండదు. కెప్టెన్, కోచ్ ఎవరికి ప్రిఫర్ చేస్తే.. వారికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ప్రాసెస్ ఇలా ఉండగా.. ఎమ్మెస్కేనే పట్టుబట్టి అంబటిరాయుడును తొక్కేయడం ఎలా సాధ్యమో.. మేధావులు కూడా ఆలోచించలేకపోతున్నారు.
తెలుగు మేధావుల్లోనే ఈ కుల జాడ్యం..!
నిజానికి సచిన్ టెండూల్కర్ కన్నా ప్రతిభావంతులే అనేక మంది ఉన్నారు. అంబటి రాయుడు కన్నా.. తక్కువ ప్రతిభావంతులు జట్టులో చోటు సంపాదించుకున్నారు. అంతెందుకు.. ట్రిపుల్ సెంచరీ కొట్టిన కురణ్ నాయర్ ఎంత మందికి గుర్తున్నాడు. చివరి మ్యాచ్‌లో సెంచరీ చేసి.. తర్వాత జట్టులో కోల్పోయిన ఆటగాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. జట్టులోకి రావడానికి .. పోవడానికి ఎన్నో కారణాలుంటాయి. అది కచ్చితంగా.. చీఫ్ సెలక్టర్ కులం.. ఆటగాడి కులం మాత్రం కాదు. మోకాలికి.. బోడిగుండుకు లింక్ పెట్టేసి.. ఏదో ఎమ్మెస్కే ఫలానా కులం వాడు అని తిట్టేసి.. మానసిక సంతృప్తి పొందడానికి తప్ప.. ఈ విమర్శలు దేనికీ పనికి రావు. కానీ దురదృష్టవశాత్తూ.. ఆ మానసిక సంతృప్తి కోసమే… ప్రస్తుత విమర్శలు .. ప్రతివిమర్శలు నడుస్తున్నాయి.