కడప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య ప్రచారాస్త్రంగా మారింది. ఈ హత్య అధికారంలో ఉన్నవారే చేయించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమయంలో ఎన్నికల ప్రచారం ప్రారంభసభలో వివేకా హత్య గురించి జగన్ కూడా స్పందించారు. నిందను తన చెల్లెళ్లపైనే వేసే ప్రయత్నం చేశారు. కడప పార్లమెంట్ కు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. ఈ మేరకు ఆమె శుక్రవారం సంకేతాలు ఇచ్చారు. పులివెందుల నుంచి బరిలోకి దిగేందుకు సునీత సన్నాహాలు చేసుకుంటున్నారు. తులసీరెడ్డితో శనివారం సమావేశం అయ్యారు.
సునీత, షర్మిల రంగంలోకి దిగితే వివేకా హత్య కేసే హైలెట్ అవుతుంది. షర్మిల చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయంలో ప్రభుత్వం ఎన్నో తప్పులు చేసిందే వాదనను ఆమె వినిపిస్తున్నారు. కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి తెలిసే హత్య జరిగిందని, ఇందులో అవినాష్ ప్రధాన పాత్రధారి అని ఆమె పలు మార్లు చెప్పారు. సీబీఐ వారు కేసు నమోదు చేసి విచారణకు పిలిపించినా అరెస్ట్ కాకుండా వున్నాడంటే దాని వెనుక ప్రభుత్వ హస్తం ఉందని షర్మిల చెబుతున్నారు. తన తండ్రి చావుకు అవినాష్ రుడ్డి ప్రధాన కారణమని, ఎందుకు ఆయనను అరెస్ట్ చేయడం లేదని వివేకా కుమార్తె సునీత పలు మార్లు నిలదీశారు. ముఖ్యమంత్రిగా ఉన్న మా అన్నకు కూడా విషయం తెలుసునని, అయినా ఆయన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బంధువులే హత్యకు కారకులైతే ఎవరికి చెప్పుకోవాలని ఆమె వాపోయారు.
కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్ మాధవి రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆమె కూడా వివేకా హత్యను ఇంట్లో వారే చేయించారని, అందుకు ఆధారాలు ఉన్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ కేసులో అప్రువర్స్ గా మారిన వారు కూడా ఇదే చెబుతున్నారు. గవర్నమెంట్ వచ్చి ఐదు సంవత్సరాలు. వాళ్ల బాబాయి కాకుండా వేరేవాళ్లు అయితే సీఎం జగన్ సెట్ వేసి హంతకుల అంతు చూసే వారని దస్తగిరి నేరుగా కోర్టుకే చెప్పారు.
ఐదేళ్లుగా వివేకా హత్య కేసు సాగుతూ ఉండటం, అదే ఎన్నకల్లో విమర్శనాస్త్రంగా మారటం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నది. వైఎస్ షర్మిల , సునీత ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధం కావడం వల్ల జరగబోయే ప్రచారం తప్పకుండా వివేకా హత్య చుట్టే ఉంటుందనడంలో సందేహం లేదు.