పార్టీ ఎమ్మెల్యేలందరూ జనంలోకి వెళ్లాలని సీఎం జగన్ ఆదేశించారు. అయితే గన్నవరం వంటి చోట్ల మాత్రం పార్టీ ఎమ్మెల్యేలు లేరు.. ఫిరాయించిన వాళ్లు ఉన్నారు. అక్కడ వారి నాయకత్వాన్ని పార్టీ నేతలు అంగీకరించడం లేదు. వంశీని కాకుండా ఇంకెవరికైనా ఇంచార్జి పదవి ఇస్తే ఆయన నేతృత్వంలో పని చేసుకుంటామని.. లేకపోతే లేదని విజయసాయిరెడ్డి గన్నవరం వైసీపీ కార్యకర్తల పేరుతో లేఖ వెళ్లింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. దీని వెనుక దుట్టా రామచంద్రరావు ఉన్నారని వంశీవర్గీయులు భావిస్తున్నారు.
వంశీపై మొదటి నుంచి వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు ఒంటికాలిపై లేస్తున్నారు. వంశీపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. దీనికి కారణం ఉంది. దుట్టా రామచంద్రరావు బీసీ వర్గానికి చెందిన వారు. కానీ ఆయన కుమార్తెను శివభరత్ రెడ్డి అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆయన వైఎస్ భారతి బంధువు. హైదరాబాద్లో ఆస్పత్రి నిర్వహిస్తున్న శివభరత్ రెడ్డి రాజకీయ భవిష్యత్ కోసం గన్నవరంలో పని చేసుకుంటున్నారు. హైదరాబాద్ ఆస్పత్రిని వదిలేసి… గన్నవరంలోనే రాజకీయం చేస్తున్నారు.
శివభరత్ రెడ్డి దూకుడుగా ఉంటూండటంతో.. వైసీపీ శ్రేణులకు నచ్చుతోంది. వంశీతో వెళ్లడం ఇష్టం లేని వారంతా ఆయన వైపు చూస్తున్నారు. అధికారులు కూడా.. శివభరత్ రెడ్డి మాటలు వింటున్నారు. కొద్దికొద్దిగా ఆయన పట్టు పెంచుకుంటూ పోతున్నారు. ఇటీవల వంశీ వర్గం చేస్తున్న పనులన్నింటినీ మెల్లగా లాగేసుకుని తమ వారికి ఇప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. విషయం కలెక్టర్ వద్దకూ వెళ్లింది. అయినా దుట్టాకే సపోర్ట్ లభిస్తోంది. తాజాగా ఆయనను కాకుండాఇంచార్జ్గా వేరే వారిని పెట్టాలని లేఖలు వెళ్తున్నాయి. ఎన్టీఆర్ కుమార్తెపై వంశీ చేసిన వ్యాఖ్యలు వైసీపీకి డ్యామేజ్గా మారాయన్న అభిప్రాయంఉంది. దీంతో ఆయనను వైసీపీ దూరం పెట్టాలనుకుంటోందని చెప్పుకుంటున్నారు. ఈ తరుణంలో.. ఆయనను పక్కన పెట్టాలన్న లేఖలు బయటపడటం హైలెట్ అవుతోంది. ఎంత జరుగుతున్నా… జగన్ నుంచి వంశీకి భరోసా మాత్రం లభించడం లేదు.