వైయస్ వివేకానంద రెడ్డి మృతిపై రాజకీయం మొదలైపోయిందనే అనాలి! మొదలుపెట్టింది కూడా సాక్షాత్తూ వైకాపా వారే! వివేకా మరణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఆదినారాయణ రెడ్డి, పులివెందుల టీడీపీ ఎమ్మెల్యే సతీష్ ల ప్రమేయం ఉందంటూ వైయస్ బావమరిది రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. ఇక, ఎంపీ విజయసాయి రెడ్డి అయితే మరో అడుగు ముందుకు వేసి… వైయస్ రాజారెడ్డి మరణం నుంచి ప్రస్థావించడం మొదలుపెడుతూ, టీడీపీ మీద అనుమానాలు రేకెత్తించే సంచలన ఆరోపణలు చేశారు.
విజయసాయిరెడ్డి మాట్లాడుతూ… 1998 నుంచే వైయస్సార్ కుటుంబాన్ని సమూలంగా లేకుండా చేసేందుకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారంటూ తీవ్రంగా ఆరోపించారు! ఇప్పుడు జరిగిన వివేకా హత్య దాన్లో భాగమే అన్నారు. దీన్లో చాలా స్పష్టంగా సీఎం, లోకేష్, ఆదినారాయణ రెడ్డి పాత్ర ఉందన్నారు. ఆదినారాయణ రెడ్డి రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుందనే ఉద్దేశంతోనే ఇది చేయించారన్నారు. ఈ హత్యపై దర్యాప్తునకు సిట్ వేశారనీ, దానిపై నమ్మకం లేదనీ, సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తామన్నారు విజయసాయి. తెలుగుదేశం పార్టీ హత్యా రాజకీయాలను మాత్రమే నమ్ముకుందనీ, వైకాపా ఎప్పుడూ అలా వ్యవహరించలేదన్నారు. రాజారెడ్డి మరణం ఎన్నికల ముందే జరిగిందనీ, వైయస్సార్ మరణం కూడా ఎన్నికల తరువాత జరిగిందన్నారు. ఆయన అందించే సుపరిపాలన, ప్రజలు చూపుతున్న ఆదరణని చూసి భరించలేక ఎలిమినేట్ చేయడం జరిగిందన్నారు! ఆ తరువాత, జగన్ పొందుతున్న ప్రజాదరణ చూడలేక… విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగిందన్నారు. వివేకానంద రెడ్డి కూడా నిత్యం ప్రజల్లో ఉంటున్నారనీ, ఆయన ఉంటే ఆదినారాయణ రెడ్డి రాజకీయ మనుగడకు ప్రమాదమని ఆయన్నీ ఎలిమినేట్ చేయడం జరిగిందన్నారు!
హత్యా రాజకీయాలు చేయడం తమకు అలవాటు లేదంటూనే ఇవన్నీ మాట్లాడారు విజయసాయిరెడ్డి! నాటి రాజారెడ్డి మరణం నుంచి ఇప్పటివరకూ జరిగిన ఘటనలన్నింటినీ టీడీపీ కుట్రగానే ఆయన ఆరోపించడం విశేషం. వైయస్సార్ ప్రమాదవశాత్తూ మరణిస్తే… దాన్ని కూడా కుట్ర అనేశారు! ఇక, జగన్ కోడి కత్తి కేసు ప్రత్యేకంగా చెప్పాల్సిందే లేదు. దాని మీద ఎంతటి రాజకీయ లబ్ధికి ప్రయత్నించారో ప్రజలకు తెలుసు. ఇప్పుడు… వైయస్ వివేకానంద రెడ్డి మరణాన్ని కూడా అదే డైరెక్షన్ లో చర్చనీయాంశం చేయడానికి ప్రయత్నిస్తున్నారు విజయసాయి. దీన్ని ఏ తరహా రాజకీయం అనాలి…?