ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో కవిత కీలక పాత్ర పోషించారని మొదట్లో ఢిల్లీ నుంచి ఆరోపణలు వచ్చినప్పుడు చాలా మంది నమ్మలేదు. అసలు కవిత ఏంటి..? ఢిల్లీ లిక్కర్ పాలసీలో వేలు పెట్టడం ఏమిటి ? అని అనుకున్నారు. ఎందుకంటే కవితకు ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయో బయటకు తెలియదు. కానీ ఖచ్చితంగా లిక్కర్ బిజినెస్ ఉందని మాత్రం ఎవరికీ తెలియదు. ఆమె అలాంటి వ్యాపారాలు చేస్తారని కూడా అనుకోలేదు. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరే ప్రధానంగా వినిపిస్తోంది.
తనకు తెలియని వ్యాపారంలో.. అదీ ఇతర రాష్ట్రాల్లో కవిత ప్రమేయం ఎందుకు వచ్చింది ? దీని వెనుక ఎవరు ఉన్నారన్నది ఇప్పుడు టీఆర్ఎస్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ మొత్తం వ్యవహారంలో ఏపీకి చెందిన ఓ రాజ్యసభ ఎంపీదే కీలక పాత్ర అని చెబుతున్నారు. అరబిందో ఫార్మా వారసుడు, బడా లిక్కర్ ఉత్పత్తి దారు అయిన మాగుంట శ్రీనివాసులరెడ్డితో పాటు పెద్ద ఎత్తున లాభాలు వస్తాయని కవితనూ మభ్య పెట్టి ఇందులోకి దింపినట్లుగా అనుమానిస్తున్నారు. ఇటీవల ఆ ఎంపీ తన ఫోన్ పోయిందని ప్రచారం చేసుకుంటున్నారు. మిగతా అందరూ ఇరుక్కున్నారు కానీ.. ఇప్పటి వరకూ ఆయన పేరు మాత్రం బయటకు రాలేదు.
శరత్ రెడ్డి పెట్టబుడులు పెట్టారు. క్లియర్గా ఉన్నాయి. మాగుంట కూడా పెట్టుబడులు పెట్టారు. మరి కవిత పెట్టుబడుల సంగతేమిటి అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. కవిత ప్రమేయం లేకుండా ఇంత బలంగా ఆమె పై ఆరోపణలు చేయలేరు. ఢిల్లీలో ఉన్న జోన్లలో ఉన్న మద్యం వ్యాపారంలో సగం ఆమెవేనని బీజేపీ ప్రచారం చేస్తోంది. దీంట్లో నిజానిజాలు త్వరలోనే వెల్లడవుతాయి. అదే నిజం అయితే.. కవితను పూర్తిగా చిక్కుల్లో నెట్టిందే ఆ ఎపీ ఎంపీనే. ఇప్పటికే జైలుకెళ్లిన ఆ ఎంపీ మాటలు విని … కవిత కూడా చిక్కుల్లో పడినట్లవుతుంది. అందుకే ఇప్పుడు ఈ వ్యవహారం టీఆర్ఎస్లోనూ చర్చనీయాంశమవుతోంది