ఏపీ భాజపా నేతలో వచ్చిన చిక్కంతా ఇదే..! ఓపక్క రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం నిలువునా నేలరాస్తుంటే.. వీళ్లు మాత్రం కేంద్రానికి మద్దతు పలుకుతూనే ఉంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఈగ వాలినా సహించబోమనే స్థాయిలో స్పందిస్తున్నారు. భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీరు ఇలానే ఉంది. అమరావతిలో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ టీడీపీ నేతల నిరసనల్ని తీవ్రంగా తప్పుబట్టారు. విశాఖపట్నంలో కొంతమంది టీడీపీ నేతలు నిన్న నిరసనలు జరిపిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు చేస్తూ… కొన్ని ప్రదర్శనల్ని నిర్వహించారు. వీటిపై విష్ణుకుమార్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లో తాము అసెంబ్లీకి వస్తున్నామని విష్ణుకుమార్ రాజు అన్నారు. ప్రధాని తీరుకు నిరసనగా టీడీపీ నేతలు చేస్తున్న ప్రదర్శనలు అవమానకరంగా ఉన్నాయనీ, దేశప్రజలు సిగ్గుతో తలదించుకునే విధంగా ఉన్నాయని అన్నారు. ఈ రాష్ట్రానికి చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితి పట్టిందన్నారు. ఇలాంటి పిచ్చిపిచ్చి వేషాలు వేస్తూ పోతే, చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదని హెచ్చరించారు. తాను పూర్తిగా నోరు విప్పితే ప్రజలే సమాధానం చెబుతారన్నారు. మిత్రధర్మాన్ని పాటిస్తున్నామనీ, అందుకే సంశయనం (సంయమనం అనలేక) పాటిస్తున్నామన్నారు. ప్రధానిని అవమాన పరచినవాళ్లపై సుమోటోగా కేసు నమోదు చేయాలనీ, వాసుపల్లి గణేష్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకోవాలన్నారు.
కేంద్రంపై నిరసన వ్యక్తం అయ్యేసరికి విష్ణుకుమార్ రాజుకి బుస్సున కోపం వచ్చేసింది..! మరి, సొంత రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రమే తుంగలోకి తొక్కుతుంటే ఆయనకి ఎందుకు కోపం రావడం లేదు..? మిత్రపక్షంగా ఉంటూ వస్తున్న టీడీపీ కూడా ఇవాళ్ల ఆగ్రహించాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది..? తాము నోరు విప్పితే మామూలుగా ఉండదని అంటున్నారాయన. విప్పొద్దని ఎవరంటారు..? ప్రత్యేక హోదా గురించి నోరు విప్పిండీ, రైల్వేజోన్ గురించి నోరు విప్పండీ, రెవెన్యూ లోటు భర్తీ గురించీ నోరు విప్పండీ..! ఆంధ్రా తమకు ప్రత్యేక రాష్ట్రమని చెప్పి తప్పించుకున్న భాజపా తీరుపై నోరు విప్పండి. అన్నిటికీమించి ఒక సగటు ఆంధ్రుడిగా, రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం అనుభవిస్తున్న నిరాదరణ తరఫున నోరు విప్పిండి..! ప్రధానమంత్రి తీరుపై కేవలం ఒక నిరసన ప్రదర్శన చేస్తేనే అంతగా నొచ్చుకుంటున్నారే… ఏకంగా రాష్ట్ర ప్రయోజనాలనూ భవిష్యత్తునూ సందిగ్ధంలో పడేసినందుకు ఒక సగటు తెలుగువాడిగా ఆయనకి నొప్పి కలగడం కదా! ఇవాళ్ల ఆంధ్రాకు చెందిన అధికార ప్రతిపక్ష పార్టీలు, పక్క రాష్ట్రాలకు చెందిన పార్టీలు కూడా ఎందుకు గొంతెత్తుతున్నాయి..? ఢిల్లీలో ఇంత జరుగుతుంటే… ఏపీ భాజపా నేతలకు మాత్రం ఇంకా పార్టీ అధిష్టానానికే కొమ్ము కాస్తుంటే ఏమనుకోవాలి..?