సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు.. కటింగ్ మాస్టర్ అని కేటీఆర్ సోషల్ మీడియాలో విమర్శించారు. ఎందుకంటే ఆయన పథకాల లబ్దిదారుల సంఖ్యను కోత వేస్తున్నారట. తెలంగాణలో ఎంత మంది ఉంటే అందరికీ పథకాలు ఇవ్వాల్సిందేనని కేటీఆర్ లాజిక్. అదే లెక్కలేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా ఇవ్వాల్సిందేనని అంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి అయినా మరొకరు అయినా ఇచ్చేది ఆయన సొమ్ము కాదు ప్రజాధనం. అది అర్హులకే దక్కేలా చూసుకోవాలా వద్దా ?
రుణమాఫీకి అర్హతలు ఉండొద్దా ?
రుణమాఫీ రైతులు అందరికీ చేయాలని బీఆర్ఎస్ వాదిస్తోంది. కానీ ఇన్ కంట్యాక్స్ కట్టే వారికి .. బాగా డబ్బు చేసిన వారికి రుణమాఫీ ఎందుకని కాంగ్రెస్ ప్రశ్న. నిజానికి ఏ ప్రభుత్వ పథకం అయినా దానికి కొన్ని ప్రమాణాలు, అర్హతలు ఉంటాయి. ఖచ్చితంగా ఆపదలో ఉన్న వారికి.. అవసరమైన వారికి మాత్రమే ప్రజాధనం వెచ్చించాలి. అందుకే ప్రభుత్వ ధనాన్ని ఇవ్వాలంటే అనేక దశలు దాటాల్సి ఉంటుంది. కానీ రాజకీయ లాభం కోసం అందరికీ డబ్బులు పంచేసే రాజకీయం వచ్చాక… ప్రజాధనం పట్ల చులనక ప్రారంభమయింది.
వ్యవసాయం చేయని వాళ్లకు రైతు బంధు ఎందుకు ?
రైతు బంధు పథకానికీ కొర్రీలుపెడుతున్నారని భూమి ఉన్న ప్రతి ఒక్కరికీ ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. తాము అలా ఇచ్చాం కాబట్టి మీరు కూడా ఇవ్వాల్సిందేనంటోంది. కానీ .. రైతులకు పెట్టుబడి సాయం అందించడమే రైతు బంధు పథకం ఉద్దేశం. వ్యవసాయం చేసే వాళ్లకు ఇది ఇస్తారు. మరి వ్యవసాయం చేయని వాళ్లకు ఈ నగదు ఎందుకు ఇవ్వాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు.. వందలు, వేల కోట్లు పోగేసుకున్న పెద్దలకూ రైతు బంధు ఇస్తున్నారు. దాని వల్ల ప్రజాధనం పక్కదారి పట్టినట్లు అవడం లేదా ?
ప్రజాధనం అర్హులకే చేరాలి !
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా… పథకాలు ప్రజాధనంతో చేపడతారు. అవి అర్హులకే చేరాలి. ఆర్థికంగా కుంగిపోయిన స్థితిలో ఉన్న వారికి సాయంచేయాలి. అంతే కానీ ఓట్ల కొనుగోలుకు టూల్ గా వాడుకోకూడదు. దురదృష్టవశాత్తూ..గత పదేళ్లుగా అదే రాజకీయం నడుస్తోంది. మధ్యతరగతిని పన్నుల రూపంలో వేధించి… ఆ సొమ్మును ఓటు బ్యాంకులకు చెల్లించే ఓ దుస్సంప్రదాయాన్ని పాటించారు. అది రాను రాను పెరిగిపోతోంది. అర్హతల్లేకుండానే అందరికీ డబ్బులు పంచాలనే పరిస్థితికి వచ్చేసింది. ఇది చాలా ప్రమాదకర పరిణామం.