పింక్ డైమండ్‌పై విచారణ అవసరం లేదని ఇప్పటికే.. విచారణ జరిపిన కమిటీలు అసలు అలాంటి డైమండే లేదని తేల్చాయని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. పింక్ డైమండ్ అంశం పదే పదే రాజకీయం అవుతూండటంతో అందులో నిజానిజాలు తేల్చాలని..వేణుగోపాల్ అనేవ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశాడు. శ్రీవారి అభరణాలలో పింక్ డైమెండ్ ఉందా..? మైసూరు మహారాజ శ్రీవారికి సమర్పించిన పింక్ డైమెండ్…జెనీవాలో వేలం వేసిన పింక్ డైమెండ్ ఒక్కటేనా..? విచారణ జరపాలని కోరారు. శ్రీవారి ఆభరణాలను పరిశీలించిన జస్టిస్ వాధ్వా, జగన్నాథరావు కమిటీలు పింక్ డైమెండ్ ఉందనే ఆధారాలు లేవని తేల్చాయి. దీంతో దీని పై విచారణ జరపాల్సిన అవసరం లేదని హైకోర్టు తీర్పు చెప్పి పిటిషన్‌ను కొట్టి వేసింది.
పింక్ డైమండ్ అనేదాన్ని … టీడీపీ హయాంలో పెద్ద చర్చనీయాంశం చేశారు. శ్రీవారి ఆలయానికి అప్రతిష్ట తెస్తున్నామన్న ఆలోచన కూడా చేయకుండా రాజకీయం చేసేశారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా 24ఏళ్ళ పాటు విధులు నిర్వర్తించిన రమణదీక్షితులు ముందుగా ఈ అంశాన్ని హైలెట్ చేయడం ప్రారంభించారు. పింక్ డైమెండ్ మాయమైపోయిందని ….ఆలయంలోని వకుళమాత పోటులో తవ్వకాలు జరిపి నేలమాళిగలను తరలించారని ఆయన ఆరోపించారు. ఆలయ ప్రధాన అర్చకుడిగా 24ఏళ్ళు విధులు నిర్వర్తించిన వ్యక్తే ఈ ఆరోపణ చెయ్యడంతో దేశ వ్యాప్తంగా ఈ అంశం పెను సంచలనంగా మారింది. రమణదీక్షితులు అలా అనడం ఆలస్యం విజయసాయిరెడ్డి వెంటనే రాజకీయం చేశారు. పింక్ డైమండ్ శ్రీవారి ఆలయం నుంచి అప్పటి సీఎం చంద్రబాబు ఇంట్లోనే ఉందని.. ఆయన ఇంట్లో తవ్వకాలు జరపాలని డిమాండ్ చేశారు.
స్వార్థ ప్రయోజనాల కోసం.. రాజకీయంగా టీడీపీపై బురద చల్లేందుకు రమణదీక్షితుల్ని కొన్ని పార్టీలు వాడుకున్నట్లుగా స్పష్టమయింది. అప్పట్లో టీటీడీ … రమణదీక్షితులతో పాటు విజయసాయిరెడ్డిపై కూడా చెరో వంద కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక నిజాలు నిగ్గు తేల్చాల్సింది పోయి.. అసలు పింక్ డైమండ్ లేదని చెప్పడం ప్రారంభించారు. కోర్టులో వేసిన కేసును వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు. అది కూడా వివాదాస్పదం అవుతోంది. మొత్తానికి పింక్ డైమండ్ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. అలాంటిదేమీ లేదని.. ఆరోపణలు చేసిన వైసీపీ ప్రభుత్వం తేల్చేసింది. చివరికి హైకోర్టు కూడా నిర్ధారించింది.
అయితే ఇప్పుడే అసలు విషయం ఉంది. పింక్ డైమండ్ పేరుతో… శ్రీవారిని సైతం రాజకీయాల్లోకి తీసుకొచ్చిన వారిని ఎలా శిక్షించాలన్నది ఇప్పుడు కీలకం. వారిని చట్టమే శిక్షించాలా..? దేవుడు శిక్షిస్తాడు అని సరి పెట్టుకోవాలా అన్నది ప్రశ్న. ఇప్పటికే వారిపై పరువు నష్టం కేసులు ఉన్నాయి. కానీ ఎంత కాలం సాగుతాయో తెలియదు. పైగా ఇప్పుడు వారి చేతిలోనే చట్టం ఉంది. టీటీడీ ఉంది. అందుకే శ్రీవారికి జరిగిన నష్టానికి ఆయనే శిక్ష వేయాల్సి ఉంది.