నవ్యాంధ్రను ఆదుకుంటామని నమ్మబలికిన కేంద్ర ప్రభుత్వమే నిర్లక్ష్యం చేసింది. అదనపు ప్రయోజనాల సంగతి దేవుడికెరుక… కనీసం విభజన చట్టంలోని హామీలనైనా నెరవేర్చే ఉద్దేశం కేంద్రంలోని భాజపా సర్కారుకు ఏ కోశానా లేదనేది సుస్పష్టమౌతోంది. దీంతో కేంద్రంపై, భాగస్వామ్య పక్షమైన భాజపాపై చంద్రబాబు సర్కారు ఉద్యమించాల్సిన పరిస్థితి వచ్చింది. ఓపక్క ఢిల్లీలో ఆంధ్రా ఎంపీలూ పార్లమెంటు ఉభయసభల్లో తమ వాణిని గట్టిగా వినిపిస్తున్నారు. రాష్ట్రంలో వామపక్షాలు, ప్రధాన ప్రతిపక్షం వైకాపా బంద్ కి పిలుపు నిచ్చింది. ఈ నిరసనకు జనసేన కూడా మద్దతు పలికింది. కేంద్రం నుంచి హక్కుల సాధన అనేది ఆంధ్రాకు ఆత్మగౌరవ సమస్యగా మారుతోంది. అయితే, ప్రజల ప్రయోజనాల కోసం మొదలైన ఈ ఉద్యమంలో కొన్ని రాజకీయ పార్టీలు మాత్రమే పాల్గొంటే సరిపోదు. సమాజంలోని మేధావి వర్గం, కవులూ కళాకారులు, సినీ పరిశ్రమకు చెందినవారు కూడా చేతులు కలపాల్సిన సమయం వచ్చింది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఇప్పుడు ఏపీలో కనిపించాలి. తమిళనాడులో జల్లికట్టు కోసం పోరాడిన కలిసికట్టుతనం ఇప్పుడు అన్ని వర్గాల్లో రావాలి.
తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులు, ప్రజా సంఘాలు పోషించిన పాత్ర చాలా కీలకమైంది. ఓపక్క తెరాస ద్వారా రాజకీయ పోరాటం కేసీఆర్ చేస్తూ ఉంటే, మరోపక్క ఇతర మార్గాల ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే పాత్రను వీరంతా తీసుకున్నారు. ఉద్యమం ఊపును ప్రజల్లో సజీవంగా ఉంచేలా చేయడంలో కవులూ కళాకారులూ ప్రజా సంఘాలూ క్రియాశీల పాత్ర పోషించాయి. ఇప్పుడు ఆంధ్రాలో కావాల్సింది కూడా ఇదే! ఇక, తమిళనాడులో జరిగిన జల్లికట్టు ఉద్యమాన్ని తీసుకున్నా అదే స్ఫూర్తి కనిపిస్తుంది. సంప్రదాయ క్రీడను కాపాడుకునేందుకు తమిళనాడులోని అన్ని వర్గాలకూ స్పందించాయి. ఆ రాష్ట్రంలో మెచ్చుకోవాల్సిన మరో అంశం… సినీతారల కదలిక! జల్లికట్టు ఉద్యమం అనగానే ప్రముఖ తారాగణం చెన్నైలోని మెరీనా బీచ్ కు తరలి వచ్చింది. ఇప్పుడు తెలుగు ప్రజల ప్రయోజనాల విషయంలో కావాల్సిందీ ఇదే. నిజానికి, గత ఏడాది ప్రథమార్ధంలోనే ప్రత్యేక హోదాపై ఉద్యమ స్ఫూర్తి రగిలింది. విశాఖపట్నంలో యువత స్వచ్ఛందంగా భారీ నిరసన చేపట్టారు. ఆ సందర్భంలోనే జల్లికట్టు స్ఫూర్తితో యువత కదలాలి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. అయితే, ఆ సమయంలో అందరూ పిలుపులు ఇచ్చినవారే తప్ప… జనంతో కదిలినవారు కనిపించలేదు! దాంతో నాటి స్ఫూర్తికి తాత్కాలికంగా బ్రేక్ పడిపోయింది.
కానీ, ఇప్పుడిది సరైన సమయం. ప్రత్యేక హోదా గురించి, ఆంధ్రాకు కేంద్రం ఇవ్వాల్సిన నిధుల గురించీ మేథావులు, కళారంగ ప్రముఖుల నుంచి కూడా స్పందన రావాలి. కేంద్రాన్ని నిలదీయడం కేవలం రాజకీయ పార్టీల పనే కదా అని భావించకుండా వారూ చేతులు కలపాలి. ఎందుకంటే, ఏపీ ప్రయోజనాలను ఇంకా రాజకీయాంశంగానే భాజపా చూస్తున్నా… ఆ చట్రం దాటి టీడీపీ బయటకి వచ్చేసిందిప్పుడు. భాజపాతో పొత్తును కూడా కాదనుకునే స్థాయికి ఏపీ సర్కారు వెళ్తోంది. ఇంకోపక్క, నిన్నమొన్నటి వరకూ ఇది టీడీపీ-భాజపాల మధ్య అంశంగానే ఉంటూ వచ్చినా, ఇప్పుడు ఆ పరిధి నెమ్మదిగా చెరిగిపోతోంది. ఇతర పార్టీలు కూడా కేంద్రం తీరుకు నిరసనగా బంద్ కి పిలుపునివ్వడమే అందుకు నిదర్శనం. ఆంధ్రా ప్రయోజనాలను కాపాడుకోవాలనే అంశం రాజకీయ పరిధి దాటింది.
కాబట్టి, ఇలాంటి సమయంలో మేధావులు, కళాకారులు, సినీ ప్రముఖులు కూడా కేంద్రాన్ని నిలదీయాలి. అలాంటి అవసరం, నిలదీయడానికి అనువైన పరిస్థితులు కూడా గతంతో పోల్చితే ఇప్పుడు అత్యంత అనుకూలంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అప్పట్లో, అంటే ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రెండు ప్రాంతాల మధ్య.. ఎటువైపు మొగ్గు చూపితే ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో అనే కొంత సందిగ్ధత నెలకొన్న మాట వాస్తవమే. అందుకే, ఆ సమయంలో కొంతమంది ఆచితూచి స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ, ఇప్పుడు అలాంటి సమస్యలు కూడా లేవు కదా. కాబట్టి, ఆంధ్రుల ప్రయోజనాలను కాపాడుకునేందుకు మొదలైన తాజా ప్రయత్నానికీ సినీ రంగం, కళారంగం, మేధావి వర్గం నుంచి కూడా బేషరతు మద్దతు రావాలి.