దేశంలో ప్రతి ఒక్కరి రక్తం మరిగిపోతోంది. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన.. జవాన్లను.. వారి కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుని.. దేశంలోని ప్రజల రక్తం మరిగిపోతోంది. కన్నుకు..కన్ను పద్దతిలో మరో సర్జికల్ స్ట్రైక్ చేయాలన్న డిమాండ్‌లో.. ఏకాభిప్రాయం కనిపిస్తోంది. అందులో ఎలాంటి సందేహం లేదు. సరిహద్దులు దాటి అయినా సరే ముష్కరుల అంతు చూడాలి. ఈ విషయంలో ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించాలి. కానీ.. ఉగ్రదాడి ఘటనలో భద్రతా వైఫల్యం లేదా..? ముందే సమాచారం ఉందని చెప్పుకుంటున్నా.. ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదు..? అడుగడుగునా నిఘా ఉన్నా… అంత పెద్ద కుట్ర ఎలా చేయగలిగారు..? ఈ విషయంలో ఎవరిది తప్పు..?
కశ్మీర్ ఉగ్రవాద దాడిలో నిఘా వైఫల్యం లేదా..?
కొన్నాళ్ల కిందట వరకు కశ్మీర్లో బీజేపీ – పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఉండేది. ఉగ్రవాదులకు మద్దతుగా మాట్లాడే స్వభావం ఉన్న పార్టీ పీడీపీ. ఆ పార్టీతో బీజేపీ పొత్తులు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొన్నాళ్ల కిందట.. కశ్మీర్లో హింస పెరిగిపోతోందని చెబుతూ… బీజేపీ మద్దతు ఉపసంహరించుకుంది. ఫలితంగా.. అక్కడ రాష్ట్రపతి పాలన ఏర్పడింది. కొన్ని పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నా… కేంద్రం .. రాత్రికి రాత్రే రాష్ట్రపతి పాలన విధించింది. ఆ తర్వాత కశ్మీర్లో.. పాలన ఎలా ఉంటుందో.. ఎవరికీ అర్థం కాలేదు. గవర్నర్ సత్యపాల్ సింగ్ వివాదాస్పద స్టేట్మెంట్లతో కాలం గడపుతూ వచ్చారు. కానీ ఆ పరిస్థితి.. కశ్మీర్లో భద్రతా వైఫల్యానికి కారణం అయిందని మాత్రం… తాజా దాడితో వెలుగు చూసింది. దాడి చేయబోతున్నారని.. కొద్ది రోజులుగా.. అనేక రూపాల్లో ప్రభుత్వానికి సమాచారం అందిందని.. కేంద్ర వర్గాలే ధృవీకరిస్తున్నాయి. మరి అలాంటప్పుడు… ఎందుకు నిర్లక్ష్యం ప్రదర్శించారు..?
కేంద్ర నిఘా, దర్యాప్తు సంస్థలేం చేస్తున్నాయి..?
ఉగ్రవాద దాడి ఘటనపై.. విచారణకు.. కశ్మీర్‌కు హుటాహుటిన.. ఎన్ఐఏ వెళ్తోందనే బ్రేకింగ్స్ టీవీలో రాగానే… తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే.. ఎన్ఐఏ..దేశంలో కంటే.. ఇప్పుడు.. తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ పాపులర్. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కోడి కత్తి కేసును.. ఎన్ఐఏకు.. కేంద్రం అప్పగించింది. హైకోర్టు నుంచి ఆదేశాలు వస్తే ఇచ్చారని అనుకోవడానికి కూడా లేదు. నేరుగా కేంద్రమే.. తన రహస్య మిత్రుని రాజకీయ కోరికను మన్నించి ఎన్ఐఏకి ఇచ్చింది. పోనీ కేసును తేల్చిందా అంటే..అదీ లేదు. అన్నీ తెలిసినా.. ఏమీ తెలియనట్లు.. కొన్ని అనుమానాలు మిగిల్చి.. ఎవరికో రాజకీయ ప్రయోజనం కల్పించడానికన్నట్లుగా చార్జిషీటు దాఖలు చేశారు. ఓ కోడికత్తి కేసును.. తేల్చడానికి నానా తంటాలు పడిన ఎన్ఐఏను ఇప్పుడు..కశ్మీర్‌కు హుటాహుటిన పంపారనే బ్రేకింగ్‌లు వచ్చే సరికి.. ప్రజలు ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. కేవలం ఉగ్రవాద కార్యకలాపాల విచారణకు ఉపయోగించాల్సిన ఎన్ఐఏన.. రాజకీయ కారణంతో సిల్లీ కేసులను అప్పగించాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారు.
రాజకీయ ప్రత్యర్థుల వేటకు జాతీయ నిఘా, దర్యాప్తు సంస్థలు..?
కేంద్ర ప్రభుత్వానికి… అజిత్ ధోవల్ అనే.. సలహాదారు ఉన్నారు. ఆయన సూపర్ ప్రైమ్ మినిస్టర్ గా వ్యవహరిస్తున్నారన్న విషయం ఢిల్లీలో అందరికీ తెలుసు. అలా మోడీ అభిమానాన్ని ఎలా పొందగలిగారంటే… జాతీయ భద్రతా సలహాదారుగా.. తన చేతిలో ఉన్న… ఎన్ఐఏ, రా, ఇతర దర్యాప్తు సంస్థలను.. వాటి పని వాటిని చేసుకోనీయకుండా.. బీజేపీ రాజకీయ ప్రత్యర్థులపైకి పురమాయించి… మోడీకి రాజకీయంగా లబ్ది చేకూర్చే ప్రయత్నం చేయడం వల్లనే అలాంటి అభిమానం సంపాదిచుకోగలిగారు. ఆ నిఘా, దర్యాప్తు సంస్థలన్నింటినీ… రాజకీయంగా ఉపయోగించుకోవడం ప్రారంభమైన తర్వాతే.. దేశ భద్రత ప్రమాదంలో పడింది. అడుగడుగునా.. నిఘా ఉండి.. బయటకు రావాలంటే.. గుర్తింపు కార్డులు చూపించాల్సినంత కట్టుదిట్టం ఉన్న ప్రాంతంలో… ఓ ట్రక్కులో వందల కిలోల.. మందుగుండు వేసుకుని.. సైనికులు.. నిత్యం ప్రయాణిస్తున్న మార్గంలో ఉంచగలిగాలంటే.. ఎంత నిఘా వైఫల్యం ఉండాలి…? ఎంత భద్రతా వైఫల్యం ఉండాలి..? ఈ తప్పు ఎవరిది..? ఎవరు తేల్చాలి..? ఎవరు శిక్షించాలి..?. పోయిన సైనికల ప్రాణాలకు బాధ్యులెవరు..?