భారత్‌లో కోవిడ్ కారణంగా ఇప్పటివరకు 47లక్షల మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వేసిన అంచనాలు అధికారంలో ఉన్న వారికి మంట పుట్టించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థపై కేంద్రం కూడా మండి పడింది. పలు రాష్ట్రాల ఆరోగ్య శాఖా మంత్రులు ఖండించారు. డబ్ల్యుహెచ్ఓ అంచనాలు, నిర్ధారణలు అన్నీ నిరాధారమని, భారత్‌ను అంతర్జాతీయంగా అప్రతిష్టపాల్జేసే ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని విమర్శించారు.
జనన, మరణాలు నమోదు చేయడానికి భారత్‌లో సమగ్రమైన, సమర్ధవంతమైన వ్యవస్థ వుందని, కోవిడ్ మరణాలు కూడా పారదర్శకంగా నమోదయ్యాయని కేంద్రం , రాష్ట్రాలు చెబుతున్నాయి. భారత్కుఈ అంచనాలు ఆమోదయోగ్యం కాదని, ఈ అంచనాలకు రావడానికి డబ్ల్యుహెచ్ఓ అమలు చేసిన పద్ధతులు, ప్రక్రియ పూర్తిగా దోషభూయిష్టమని చెప్పుకొచ్చారు. డబ్ల్యుహెచ్ఓ అనుసరించిన నమూనానే శాస్త్రీయంగా లేదన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాలను తప్పు పట్టారు కానీ.. కోవిడ్ మరణాలు మాత్రం కేంద్రం చెబుతున్నంత తక్కువగా ఉన్నాయని ఎవరూ నమ్మడం లేదు.
ఆక్సీజన్ కొరతతో ఒక్కరూ చనిపోలేదని కేంద్రం చెప్పింది. అదేమంటే రాష్ట్రాలు చెప్పలేదని చెప్పుకొచ్చింది. ఇలాంటి డేటా సేకరణ చేస్తూ… ప్రపంచ ఆరోగ్య సంస్థని నిందిస్తేఎలా. కరోనా రెండో వేవ్ సమయంలో మృతుల సంఖ్య అసాధారణంగా పెరిగింది. అవన్నీ కోవిడ్ మరణాలు కాదని కేంద్రం.., ప్రభుత్వాలు వాదిస్తున్నాయి. ఆ సమయాల్లో దేశవ్యాప్తంగా స్మశానాల్లో చితి మంటలు ఆరలేదు. సామూహిక ఖననాలు జరిగాయి. ఇవన్నీ కరోనా మరణాలు కాదని కేంద్రం.. రాష్ట్రాలు చెబుతున్నాయి.
కేంద్ర, రాష్ట్రాలు కరోనాపై గొప్పగా పోరాడామని ప్రజల్ని కాపాడామని చెప్పుకుంటున్నాయి. ఎంత కాపాడాయో ప్రజలకు తెలుసు. కానీ ఓ రకమైన ప్రచార ఆర్భాటంలో .. ఉద్వేగంలో ప్రజల్ని ముంచెత్తుతున్నారు. అందుకే ప్రాణాల మీదకు తెచ్చారన్న విషయాన్ని ప్రజలు గమనించలేకపోతున్నారు.. ఎవరైనా చెబితే.. దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారని అంటున్నారు. ఇలాంటి ఎదురుదాడితో సాధించేదేమీ ఉండదు.. కాస్త వాస్తవం గుర్తిస్తే మాత్రం కొంత మంది ప్రజల ప్రాణాలు కాపాడటానికి అవకాశం ఉంటుంది.