రేవంత్ రెడ్డి ఆరోపణలపై ఇప్పటి వరకూ ఎపిటిడిపి నాయకులే తీవ్రంగా స్పందించారు, ఖండించారు కూడా. టిటిడిపి నేతలు స్పష్టత ఇవ్వాలన్న వత్తిడికి పరిమితమైనారు. లేదంటే ఆయనపై చర్య తీసుకోవాలని కూడా పట్టుపట్టారు. అయితే ఈ పరిస్థితి ఇప్పుడు మారుతున్నది. రాష్ట్ర అద్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ రేవంత్ ఏర్పాటు చేసే శాసనసభా పక్ష సమావేశానికి వెళ్లడమా లేదా అని ఆలోచిస్తున్నట్టు ప్రకటించారు. మొదట వెళ్దామనుకున్నా తాజా పరిణామాల తర్వాత ఆలోచనలో పడ్డారు.సండ్ర వెంకట వీరయ్య కూడా తాను పార్టీ మారాలనుకోవడం లేదన్నారు. ఆర్.కృష్ణయ్య ఎప్పటికీ తన దారిలో తానున్నారు. అంటే వున్న ముగ్గురు సభ్యులలోనూ ఇద్దరు ఆయన వెంట లేరన్నమాట. అలాటప్పుడు ఆయనకే అనర్హత కలిగించాలని కోరతారా లేక ఎవరికివారై పార్టీ అస్తిత్వాన్ని సభలో రద్దు చేసుకుంటారా చూడాల్సిందే. ఇప్పటికి పొత్తులపై నిర్ణయానికి రాలేదని రమణ అంటున్నారు. సీట్ల బేరం జరుగుతున్నట్టు కొందరు చెబుతున్నారు.చంద్రబాబు గాని లోకేశ్ గాని దీన్ని తేల్చడం లేదంటే ఇంకా వారే తేల్చుకోలేదన్నమాట. రేవంత్‌కు టిడిపిలో పాత స్థానం వుండబోదని మాత్రం చెప్పొచ్చు. ఇక్కడి దాకా వచ్చాక ఆయన వుండటం కూడా కుదిరేపని కాదు. శాసనసభలో ఆయన మాటలు టిడిపి వాణిగా తీసుకోవడం కూడా జరగదు. ప్రభుత్వ పక్షం ఎలాగూ ఎద్దేవా చేస్తుంది. బిజెపి నేతలు, సిపిఎం నాయకులు కూడా విమర్శలు చేశారు.కాంగ్రెస్ నాయకులు కూడా ఇప్పటికైతే గుంభనగా వున్నారు గాని ఆ పార్టీలో అంత:కలహాలు ఎప్పుడూ వుంటాయి. అందుకే అరుణను కలిశారు రేవంత్ అక్కడే ఒక మెట్టు దిగారన్నమాట.. ఇంకా చూడాలి.