గుణశేఖర్ ఓ క్రియేటీవ్ జీనియస్. ఒక్కడు సినిమా చూస్తే చాలు. తన ప్రతిభాపాటవాలేంటో అర్థం అవుతాయి. అందుకే తనకు హిట్లూ, ఫ్లాపులతో పనిలేదు. గుణశేఖర్ తో పనిచేయడానికి అగ్ర కథానాయకులెప్పుడూ రెడీగా ఉంటారు. కాకపోతే.. ఆయనకు ఇప్పుడో బ్రేక్ కావాలి. అది `శాకుంతలమ్`తో దొరుకుతుందన్నది గుణ నమ్మకం. శాకుంతలమ్ హిట్టయితే.. ఏం చేయాలన్న విషయంలో గుణశేఖర్ ఇప్పుడే ఓ నిర్ణయానికి వచ్చేశారు. తన దగ్గర `హిరణ్య కశ్యప` కథ ఆల్రెడీ ఉంది. రానా కథానాయకుడు. అది కాకుండా `ప్రతాప రుద్రుడు` కథ కూడా గుణశేఖర్ సిద్ధం చేసుకున్నారు. ఈ సినిమాని ఓ అగ్ర కథానాయకుడితో తెరకెక్కించాలన్నది ఆయన ఉద్దేశం. అందుకోసం గుణశేఖర్ దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఒకటి.. మహేష్ బాబు.
ఒక్కడు, అర్జున్, సైనికుడు.. ఇలా ఈ కాంబోలో వరుసగా మూడు సినిమాలొచ్చాయి. సైనికుడు డిజాస్టర్ అయ్యింది. అయినా సరే.. గుణ – మహేష్ ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నారు. రుద్రమదేవిలో `గోన గన్నారెడ్డి` పాత్ర కోసం గుణ శేఖర్ అన్వేషణ ప్రారంభించినప్పుడు మహేష్ కూడా ముందుకొచ్చాడు. చివర్లో డేట్లు సర్దుకాకపోవడంతో.. అల్లు అర్జున్ ఈ పాత్ర చేయాల్సివచ్చింది. ఓరకంగా బన్నీ ఆ పాత్ర చేయడమే ప్లస్ అయ్యింది. మహేష్ ని మరో ఛాన్స్ అడిగే.. అవకాశం ఇంకా గుణ శేఖర్ చేతుల్లో ఉండిపోయింది. ఇప్పుడు ఆ ఛాన్స్ ని గుణ ఇలా వాడుకోవాలనుకుంటున్నాడు. `ప్రతాప రుద్రుడు`గా మహేష్ అయితే సరిగ్గా ఉంటుందన్నది తన ఆలోచన. పైగా ఈ తరహా పాత్రలు మహేష్ కీ కొత్తగా ఉంటాయి. ఒకవేళ.. మహేష్ `నో `అంటే అప్పుడు రానాతోనే.. ఈ సినిమా పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు. `హిరణ్య కశ్యప` హిట్టయి, మంచి పేరొస్తే.. అప్పుడు `ప్రతాప రుద్రుడు`గా చేయడానికి రానాకీ పెద్దగా అభ్యంతరాలు లేకపోవొచ్చు. సో.. గుణ శేఖర్ దగ్గర కథతో పాటు రెండు ఆప్షన్లూ రెడీగానే ఉన్నాయి. మరి… `ప్రతాప రుద్రుడు` ఎవరిని వరిస్తుందో?