శ్రీ వెంకటేశ్వరా భక్తి ఛానెల్ (ఎస్వీబీసీ) ఛైర్మన్ పదవి నుంచి సినిమా నటుడు పృథ్వీ తప్పుకున్నప్పటినుంచి తరువాతి ఛైర్మన్ ఎవరు అనేదానిపై వెంటనే ఆలోచనలు, ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ ఛానెల్ టీటీడీకి సంబంధించింది అయినప్పటికీ ఛైర్మన్‌ను నియమించేది ముఖ్యమంత్రి జగనే. అంటే ఆయన ఆమోదంతోనే ఎవరైనా ఆ పదవిని అలంకరించాలి. టీటీడీ పాలకమండలి ఛైర్మన్ పదవిని పాలక పార్టీ నాయకుడికే కట్టబెడుతుంటారు. అదే విధానంలో ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిని కూడా పాలక పార్టీ వారికే కట్టబెడుతున్నారు. అయితే ఇక్కడ ఇంకో విశేషం ఉంది. ఈ పదవిని పాలక పార్టీ వ్యక్తికి ఇవ్వడంతోపాటు సినిమా రంగానికి చెందిన వ్యకికే ఇస్తున్నారు. సరే…నామినేటెడ్ పదవులు పాలక పార్టీవారికే ఇస్తారనుకోండి. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు.
కాని సినిమా రంగానికి చెందినవారినే ఎందుకు ఎంపిక చేస్తున్నారో అర్థంకాని సంగతి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుకు కట్టబెట్టారు చంద్రబాబు నాయుడు. చాలామంది సినిమావారిలాగానే రాఘవేంద్రరావు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఆయన విజయవంతమైన కమర్షియల్ చిత్రాల దర్శకుడే కాకుండా పలు భక్తి చిత్రాలకు దర్శకత్వం వహించిన చరిత్ర ఉంది. వైకాపా అధికారంలోకి వచ్చాక సహజంగానే రాఘవేంద్రరావు తప్పుకున్నారు. అప్పుడు హాస్యనటుడు పృథ్విని ఎస్వీబీసీ ఛైర్మన్‌గా చేశారు ముఖ్యమంత్రి జగన్.
ఇతనికున్న అర్హతల్లా జగన్‌కు వీరవిధేయుడు. పాదయాత్రలో ఆయన వెంట నడిచాడు. ప్రతిపక్షాల మీద తీవ్రమైన విమర్శలు చేసినవాడు. మొత్తంమీద ఎక్కడో అదృష్టం ఉండటంతో ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి వచ్చిపడింది. ఆ పదవి వచ్చిననాటి నుంచి ఛానెల్ కోసం ఆయన ఏం పని చేశాడో తెలియదు. ఛానెల్ అభివృద్ధికి ఏం పనిచేశాడో తెలియదు. దేవుడి సేవలో ఉన్నానని చెప్పుకుంటూనే ఫక్తు రాజకీయ నాయకుడిగా వ్యవహరించాడు. నోటికొచ్చింది మాట్లాడాడు. ఎస్వీబీసీ ఛైర్మన్‌గా చక్కటి పనితీరు కనబరిచి జగన్‌ను సంతోషపెట్టకుండా రాజకీయాలు మాట్లాడి, ప్రతిపక్షాలను ఘోరంగా విమర్శించి జగన్‌ను ఆనందపర్చాలనుకున్నాడు.
చివరకు శృంగారంలోకి దిగి అందులో చిక్కుకొని చేజేతులా పదవి, పరువు పోగొట్టుకున్నాడు. ఇక ఆయన తరువాత ఎవరు? అనే ప్రశ్న ఎదురైంది. ఇప్పటివరకు ఇద్దరి పేర్లు తెర మీదికి వచ్చాయి. మొదటి వ్యక్తి సినిమా దర్శకుడు శ్రీనివాస రెడ్డి, రెండో వ్యక్తి టీవీ యాంకర్ కమ్ న్యూస్ రీడర్ స్వప్న. ఈమె ప్రస్తుతం ఎస్వీబీసీ ఛానెల్లో డైరెక్టర్‌గా ఉంది. ఈమె చాలాకాలం సాక్షి ఛానెల్లో పనిచేసింది. ప్రస్తుతం 10టీవీలో పనిచేస్తోంది. టీవీ ప్రయోక్తగా స్వప్న పాపులర్. ఇక శ్రీనివాస రెడ్డి ఢమరుకం, కుబేరులు, టాటా బిర్లా మధ్యలో లైలా మొదలైన సినిమాలకు దర్శకత్వం వహించాడు.
ఈయనకు ఉన్న ప్రధాన అర్హత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితడు. ఆయనకు క్లోజ్ అయినప్పుడు జగన్‌కు కాకుండా ఉండడు కదా. అందుకని ఆయన పేరు బాగా వినిపిస్తోంది. ఈయన ప్రస్తుతం మరో సినిమా తీస్తున్నాడు. ఈయనకు కూడా హాస్య చిత్రాలు నిర్మించే దర్శకుడిగా పేరుంది. ఇక్కడ అర్థంకాని విషయం ఏమిటంటే ఎస్వీబీసీ అనేది భక్తి ఛానెల్. ఇలాంటి ఛానెల్‌ను సినిమా రంగానికి చెందినవారికి ఎందుకు కట్టబెడుతున్నారు? టీవీ, సినిమా మాధ్యమాలు దాదాపు ఒకే తీరుగా ఉంటాయని, సినిమావారైతే ఛానెల్‌కు సంబంధించి అవగాహన ఉంటుందని అనుకుంటున్నారా?
సినిమావాళ్లలో చాలామంది భక్తులు ఉన్నారు. భక్తులంటే ఏడాది రెండుసార్లో మూడుసార్లో తిరుమల వెళ్లి వెంకన్నను దర్శించుకొని పూజలు చేసిరావడం. కాని వీరికి ఆధ్యాత్మికపరమైన జ్ఞానం ఉండదు. అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించిన సామర్థ్యమూ ఉండదు. పృథ్వివంటివారు ఛానెల్ పరువు తీస్తారు. సినిమా రంగానికి చెందినవారిని కాకుండా పార్టీ వ్యక్తులే వేరే రంగాలకు సంబంధించినవారు ఉంటారు కదా. వారిలోనే మెరుగైనవారిని నియమించవచ్చు కదా. జగన్ ఆ దిశగా ఎందుకు ఆలోచించరు?