దుబ్బాక విజయంతో జోరు మీద ఉన్న బీజేపీ.. తన నెక్ట్స్ టార్గెట్‌ను తిరుపతిగా పెట్టుకుంది. తిరుపతి వైసీపీ ఎంపీ కరోనా మృతి చెందడంతో త్వరలో ఉపఎన్నికలు జరగనున్నాయి. దుబ్బాకలో ఎమ్మెల్యే మృతితో వచ్చిన ఉపఎన్నికలో బీజేపీ సంచలన విజయం నమోదు చేసింది. అదేతరహాలో ఏపీలోనూ తన ప్రభావం చూపాలని ఉవ్విళ్లూరుతోంది. తాము ఏపీలో బలపడ్డామని నిరూపించుకోవాలని భారతీయ జనతా పార్టీ ఉబలాట పడుతోంది. ముఖ్యంగా ఏపీ వ్యవహారాల ఇన్చార్జ్గా ఉన్న సునీల్ ధియోధర్ ఈ మిషన్ తీసుకున్నారు. ఆయన ఎక్కువగా తిరుపతిలోనే ఉంటున్నారు. తాజాగా తిరుపతిలో కార్యకర్తల సమావేశం పెట్టి.. అందర్నీ.. కార్యోన్ముఖుల్ని చేశారు.
గత ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. రహస్య స్నేహితుడు వైసీపీకి ఆ పార్టీ కార్యకర్తలు మద్దతిచ్చారు. ఫలితంగా డిపాజిట్ కూడా రాకుండా పోయింది.ఇప్పుడు పరిస్థితి మారింది. జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. పవన్ కల్యాణ్.. తన పార్టీ కన్నా.. బీజేపీ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. జనసేన మద్దతు ఉంటుందని… తిరుపతి పార్లమెంట్ పరిధిలో పవన్ ఫ్యాన్స్ ఎక్కువే ఉంటారని బీజేపీ అంచనాకు వచ్చింది. దీంతో గెలుపు దిశగా పయనిస్తామని.. గట్టిగా ప్రయత్నిస్తే చాలన్న అభిప్రాయానికి వచ్చారు. గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా తిరుపతి సీటును బీఎస్పీకి జనసేన ఇచ్చింది. బీఎస్పీ అభ్యర్థి ఇరవై వేల ఓట్లు మాత్రమే తెచ్చుకున్నారు.
ఈ సారి జనసేన పార్టీ అక్కడినుంచి పోటీ చేస్తుందా లేదా అన్నదానిపై ఆ పార్టీ నేతలు ఒక్కరంటే ఒక్కరూ స్పందించడం లేదు. బీజేపీ నేతలే.. జనసేన కూడా పోటీ చేస్తామని ముందుకు వస్తే.. హైకమాండ్‌తో చర్చించి.. ఇరు పార్టీలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని చెబుతూ వస్తోంది. అయితే జనసేన మాత్రం..తాము తిరుపతిలో పోటీకి ఆసక్తిగా ఉన్నామని మాత్రం చెప్పడం లేదు. వివిధ సమీకరణాలను బట్టి చూస్తే తిరుపతిలో జనసేన బలంగా ఉంటుంది. తిరుపతిలో నియోజకవర్గంలో చిరంజీవి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అక్కడ లక్షా 71వేల ఓట్లు తెచ్చుకుంది. బీజేపీ ఓటు బ్యాంక్ ఎప్పుడూ అక్కడ ఇరవై వేల ఓట్లు దాటలేదు.
అయితే తెలుగుదేశం పార్టీ తో పొత్తు ఉన్న సమయంలో 1999లో ఓ సారి గెలిచింది. టీడీపీతో పొత్తు ఉన్నప్పుడు..ఇతర ప్రధాన అభ్యర్థులతో బీజేపీ పోటీ పడింది. ఎవరి మద్దతు లేనప్పుడు బీజేపీకి ఇరవై వేల ఓట్లు కూడా రాలేదు. ఆపార్టీ ఓటు బ్యాంక్.. పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం మీద.. ఏడుఅసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి ఇరవై వేలఓట్లు మాత్రమే. అయితే బీజేపీ పోటీ చేయాలనుకుంటే.. జనసేన తాము పోటీ చేస్తామని అడిగినా ప్రయోజనం ఉండదు. అడగకుండా చేయగలరు కూడా. జనసేన అడిగేలా కూడా లేదని తాజా పరిణామాలు చూస్తేనే తెలుస్తోంది.