హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అధికార పార్టీ తెరాసకి సీపీఐ మద్దతు ఇవ్వాలని ముందుకొచ్చి, ఇప్పుడు ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. కమ్యూనిష్టులను విమర్శించిన కేసీఆర్ కి మద్దతు ఇస్తే సీపీఐ ఉనికి కోల్పోతుందనే విమర్శలు, ఒత్తిళ్లూ ఎక్కువ కావడంతో ఈ దిశగా నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. గతవారంలోనే మద్దతు ఉపసంహరించుకోబోతున్నామని సీపీఐ రాష్ట్రా కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రకటించారు. అదే అంశాన్ని పార్టీ కార్యాలయంలో కార్యవర్గ సమావేశం నిర్వహించి, అనంతరం అధికారికంగా ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో ప్రభుత్వం వైఖరి దుర్మార్గంగా ఉందన్నారు. 48 వేల మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్టు ముఖ్యమంత్రి రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేశారన్నారు. ప్రభుత్వం దిగొచ్చే వరకూ కార్మికుల తరఫున పోరాడతామన్నారు.
తెరాసకు మద్దతు ఉపసంహరించుకున్నారు… కానీ, ఇప్పుడు సీపీఐ మద్దతు ఎవరికి ఇస్తుందనేది ఇంకా తేలాల్సి ఉంది. ఎందుకంటే, ఆ పార్టీ దగ్గర దాదాపు 7 వేల ఓటు బ్యాంకు ఉంది. అందుకే కదా తెరాస దగ్గరకి చేర్చుకుంది..! కాబట్టి, సీపీఐ మద్దతు ఎవరికి అనేది కీలకాంశమే. దీనిపై స్పష్టత ఇచ్చేందుకు హుజూర్ నగర్లో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తామనీ, అధికారికంగా ప్రకటన విడుదల చేస్తామని చాడ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీపీఐ మద్దతును కాంగ్రెస్ పార్టీ కోరే అవకాశాలున్నాయి. అయితే, కాంగ్రెస్ తో వద్దనుకునే కదా ఇప్పుడు తెరాస వైపు కమ్యూనిష్టులు మొగ్గు చూపించింది. కాబట్టి, నిన్నటి వరకూ విమర్శించిన కాంగ్రెస్ కు ఇప్పుడు మద్దతు ఇవ్వాలంటే సీపీఐ ఎలా ఆలోచిస్తుందో చూడాలి. వాస్తవానికి అధికార పార్టీ వైఖరితో విభేదిస్తూ మద్దతు ఉపసంహరించుకున్నారు కాబట్టి, అదే అధికార పార్టీతో పోరాటం చేస్తున్న ప్రధాన పక్షంగా ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. హుజూర్ నగర్ బరిలో ఇతర పార్టీలున్నా… తెరాసతో వాళ్లిచ్చేది నామ్ కే వాస్తే పోటీ మాత్రమే.
హజూర్ నగర్ నియోజక వర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వస్థానం కాబట్టి, ఆయనకి ఉండాల్సిన సాలిడ్ ఓటు బ్యాంకు ఎలాగూ ఉంటుంది. తెరాసకు కొత్తగా అక్కడ ఓటింగ్ పెరిగే అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి. పైగా, టీడీపీ కూడా ఇప్పుడు పోటీలో ఉంది కాబట్టి… గతంలో టీడీపీ నుంచి తెరాసకు వలస వెళ్లిన ఓటు బ్యాంకులో కొంత చీలిక రావొచ్చు. ఈ రకంగా చూసుకుంటే గెలుపు అవకాశాలు కాంగ్రెస్ పార్టీకి కాస్త మెరుగ్గా ప్రస్తుతానికి కనిపిస్తున్న పరిస్థితి. కాబట్టి… ఇప్పుడు కాంగ్రెస్ కి మద్దతుగా నిలిస్తేనే అధికార పార్టీపై సీపీఐ పోరాడినట్టు అవుతుంది. చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.