వైఎస్ఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మహి. వి.రాఘవ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ చిత్రానికి ‘యాత్ర’ అనే పేరు ఖరారు చేసే అవకాశం ఉంది. వైఎస్ఆర్ పాత్రతో మమ్మట్టి కనిపించబోతున్నాడు. అంత వరకూ బాగానే ఉంది. మరి జగన్ పాత్ర చేసేది ఎవరు? వై.ఎస్.ఆర్ కథ.. ఆయన మరణంతోనే అంతం అయిపోదు. వారసుడిగా జగన్నీ చూపించే ఆ కథని పుల్ స్టాప్ పెట్టాలి. మరి ఆ పాత్రలో ఎవరు కనిపిస్తారన్న ఆసక్తి నెలకొంది. నిజానికి మమ్ముట్టి పాత్రలోనూ ఓ తెలుగు హీరోనే కనిపించాలి. కానీ… వాళ్లెవ్వరూ ముందుకు రాలేదు. దాంతో మలయాళ సూపర్ స్టార్ దగ్గరకు ఈ స్క్రిప్టు వెళ్లింది. ఇప్పుడు జగన్ పాత్రకూ అలాంటి పరిస్థితే ఎదురయ్యే అవకాశం ఉంది. జగన్ పాత్రలో శర్వా, నాని లాంటి యంగ్ హీరోలు బాగుంటారు. కానీ.. వాళ్లు జగన్ పాత్ర చేస్తారా? అనేది అనుమానమే. ఈపాటికే దర్శకుడు మహి.. కొంతమంది యంగ్ హీరోల్ని సంప్రదించారని తెలుస్తోంది. అయితే వాళ్లెవ్వరూ ఈ పాత్ర చేయడానికి సాహసం చేయట్లేదు. ఒకవేళ జగన్గా కనిపిస్తే.. తమపై ఓ ముద్ర పడిపోతుందన్నది వాళ్ల భయం. అందుకే… వైఎస్ ఆర్ పాత్ర కోసం మలయాళం నుంచి నటుడ్ని తెచ్చుకున్నట్టు జగన్ పాత్రకూ పక్క రాష్ట్రం నుంచి తీసుకురావాలి. ఇలా.. కీలకమైన పాత్రలన్నీ పక్క రాష్ట్రాల వాళ్లు చేస్తే.. తెలుగు సినిమా ఫ్లేవర్ పోతోందేమో. ఈ విషయంలో మహి కాస్త ఆలోచించుకోవాల్సిందే.