చిత్రసీమలో నిర్మాతల ఆలోచనలు బంద్ దిశగా సాగుతున్నాయి. ఆగస్టు 1 నుంచి షూటింగులు నిలుపు దల చేయడానికి కొంతమంది నిర్మాతలు రెడీ అయిపోయారు. అయితే.. బుధవారం ఫిల్మ్ ఛాంబర్లో మరో కీలకమైన సమావేశం జరగబోతోంది. ఈ మీటింగ్లో 5 అంశాలపై విపులంగా చర్చించబోతున్నారు. టికెట్ ధరలు, ఓటీటీ, నిర్మాణవ్యయం అదుపు, పర్సంటేజీ విధానం. వీపీఎఫ్ ఛార్జీలు… వీటిపై నిర్మాతలు లోతుగా విశ్లేషించి ఓ నిర్ణయానికి వస్తారు. ఏ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకొన్నా దాదాపుగా బంద్ ఖాయంగానే కనిపిస్తోంది. షూటింగులు ఆపేస్తే తప్ప, తమ బాధ 24 విభాగాలకూ అర్థం కాదని, సమస్య తీవ్రత తెలీదని నిర్మాతలు నమ్ముతున్నారు.
అయితే షూటింగులు ఆపేయడం వల్ల.. ముఖ్యంగా నష్టపోయేది నిర్మాతలే. ఎందుకంటే.. ఓరోజు షూటింగ్ ఆగిందంటే లక్షల్లో నష్టపోవాల్సి ఉంటుంది. హీరోలకు ఆల్రెడీ అడ్వాన్సులు ఇచ్చేసి ఉంటారు. లొకేషన్లు ముందే బుక్ అయి ఉంటాయి. సెట్స్ వేసుకుంటే.. అదో సమస్య. సినిమా ఆలస్యమయ్యే కొద్దీ.. వడ్డీల భారం పెరుగుతుంటుంది. పారితోషికం ముందే తీసేసుకొన్న హీరోలకు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకూ.. ఏ బాధా ఉండదు. షూటింగ్ ఎప్పుడంటే అప్పుడు వస్తారు. లేదంటే ఇంట్లోనే ఉంటారు. అంతే కదా? మధ్యలో నలిగిపోయేది.. కార్మికులు మాత్రమే. రోజువారీ వేతనం తీసుకొనే సినీ కార్మికులు ఈ బంద్ తో తీవ్రంగా నష్టపోతారు. అంటే.. పై స్థాయిలో నిర్మాత, కింది స్థాయిలో కార్మికుడు తప్ప.. మిగిలిన వాళ్లకు ఏ నొప్పీ తెలీదు. అలాంటప్పుడు బంద్ నిర్వహించడం వల్ల లాభం ఏమిటి?
ఇదే లా పాయింట్ కొంతమంది నిర్మాతలు లాగుతున్నారు. అందుకే ఈ బంద్ విషయంపై నిర్మాతలు స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఇండస్ట్రీకి ఇప్పుడు పెద్ద దిక్కంటూ లేకపోయింది. నిర్మాతల్నీ, 24 విభాగాల ప్రతినిధులనూ కూర్చోబెట్టి, మధ్యవర్తిత్వం వహించి, సమస్యని సానుకూలంగా పరిష్కరించే నాధుడు లేని లోటు ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఆదాయ మార్గాలు తగ్గినప్పుడు నిర్మాణ వ్యయం తగ్గించుకోవడం తప్ప మరో మార్గం లేదు. రోజువారి వేతనం కోసం ఆరాట పడే సినీ కార్మికుల వేతనంపై కత్తెర వేసే బదులు.. కోట్లకు కోట్లు తీసుకొనే హీరోలు, దర్శకుల పారితోషికాలకు అడ్డు కట్ట వేయాల్సిన అవసరం ఉంది. మేం అగ్ర హీరోల జోలికిపోం… అని నిర్మాతలు గిరి గీసుకొని కూర్చుంటే మాత్రం ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. ఎన్ని రోజులు సినిమా షూటింగులు బంద్ చేసినా… ఫలితం దక్కదు.