గ్రేటర్ ఎన్నికలు ముగిశాయి. విజేతలెవరో తెలిశారు. ఇక మేయర్ పీఠం కోసం కసరత్తులు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడందరికీ ఒక్కటే సందేహం.. వరద సాయాన్ని ఇస్తారా లేదా..? అనేదే. గ్రేటర్ ఎన్నికల్లో వరద సాయం అనేది.. కీలకమైన అంశంగా మారింది. కొన్ని వేల మందికి రూ. పదివేల సాయం చేసిన టీఆర్ఎస్ హఠాత్తుగా నిలిపివేసి.. గ్రేటర్ ఎన్నికలు నిర్వహించింది. ఎన్నికల కోడ్ వల్ల సాధ్యం కావడం లేదు కాబట్టి.. ఎన్నికలు పూర్తవగానే.. పంపిణీ చేస్తామని ప్రకటించింది. ఇంకా రెండు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని అందరికీ ఇస్తామని కేసీఆర్, కేటీఆర్ కూడా ప్రకటించారు. ఇక భారతీయ జనతా పార్టీ అయితే.. పాతిక వేలు ఇస్తామని ప్రకటించింది. బండి సంజయ్ అయితే.. కార్లు పోతే కార్లు..బైకులు పోతే బైకులు ఇస్తామని ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ వేలం పాట మాదిరిగా.. తమ పాట యాభై వేలు అని ప్రకటించేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటనను ఎవరూ సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే.. ఆ పార్టీ ఎక్కడా అధికారంలో లేదు. టీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. దీంతో.. ఎవరు గెలిచినా.. తమ ప్రభఉత్వాల నుంచి నిధులు తీసుకొచ్చి చెప్పినట్లుగా వరద సాయం అందిస్తారని ఆశ పడ్డారు. అయితే ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తర్వాత ఎవరూ పట్టించుకునే పరిస్థితులు కనిపించడం లేదు. గ్రేటర్ ఎవరికీ మెజార్టీ రాలేదు. అసలు వచ్చినా రాకపోయినా… వరద సాయంతో గ్రేటర్ కార్పొరే్షన్కు సంబంధం లేదు. వరద సాయం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది.
అందుకే.. టీఆర్ఎస్ వైపు అందరూ ఆశగా చూస్తున్నారు. అయితే వరద బాధిత ప్రాంతాల్లో టీఆర్ఎస్ కు సరైన ఫలితాలు రాలేదు. బీజేపీ ఏకపక్ష విజయం సాధించింది. గ్రేటర్లో పూర్తి స్థాయిలో గెలవలేదు కాబట్టి.. పరిహారం గురించి తామేం చేయలేమని ఇప్పటికే బీజేపీ నేతలు చేతులెత్తేయడం ప్రారంభించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతు బంధు సాయం పంపిణీపై సమీక్ష తేదీని ప్రకటించారు కానీ.. ఈసేవల్లో దరఖాస్తు చేసుకున్న వరద బాధితుల గురించి మాత్రం..స్పందించలేదు. దీంతో.. వరద బాధితులకు ఇక నిరాశే ఎదురవుతోంది.