ఆంధ్రాలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సీట్లలో మూడు తెదేపాకి, ఒకటి వైకాపాకి దక్కుతుంది. వైకాపా తరపున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ్ సాయి రెడ్డికి ఆ అవకాశం దక్కబోతోందని ఇప్పటికే స్పష్టం అయ్యింది. కానీ తెదేపాలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. భాజపా కోరితే మళ్ళీ నిర్మలా సీతారామన్ కే ఆ సీటు కేటాయిస్తామన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడటంతో ఆ సస్పెన్స్ ఇంకా పెరిగింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సుజనా చౌదరికి మళ్ళీ రాజ్యసభ సీటు ఇస్తారా లేదా? ఒకవేళ ఇచ్చినా ప్రధాని నరేంద్ర మోడీ అందుకు అంగీకరిస్తారా లేదా? అనేది ఇంకా తేలవలసి ఉంది. ఒకవేళ మళ్ళీ ఆయనకి, నిర్మలా సీతారామన్ లకే ఆ రెండు సీట్లు కేటాయిస్తే ఇక మిగిలేది ఒకే ఒక్క సీటు. ఒకవేళ వాళ్ళిద్దరికీ ఆ సీట్లు కేటాయించకపోతే వాటి కోసం ఆశ పడుతున్న తెదేపా నేతలకు అది చాలా సంతోషం కలిగిస్తుంది.
కర్నూలు నుంచి టి.జి. వెంకటేష్, ఎన్.డి.ఫరూక్, గుంటూరు నుంచి డొక్కా మాణిక్య వరప్రసాద్, పుష్పరాజ్, చిత్తూరు నుంచి మాజీ ఎమ్మెల్యే హేమలత తదితరులు రాజ్యసభ సీట్లు ఆశిస్తున్నవారిలో ఉన్నారు. గత రెండేళ్లుగా గవర్నర్ పదవి కోసం చాలా ఆశగా ఎదురుచూస్తున్న తెలంగాణా తెదేపా సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు ఇంక దానిపై ఆశలు వదులుకొని, కనీసం తనకు రాజ్యసభ సీటైనా ఇవ్వాలని కోరుతున్నారు. వీరే కాక ఇంకా మరో అరడజను మంది తెదేపా సీనియర్ నేతలు రాజ్యసభ సీటు కోసం ఆశపడుతున్నారు. కనుక ముందుగా నిర్మలా సీతారామన్, సుజనా చౌదరిల సీట్ల సంగతి తేలితే గానీ సీట్ల విషయంలో స్పష్టత రాదు. దీనిపై ఇంకా నాన్చినకొద్దీ ఆ సీట్లు ఆశిస్తున్న వారి సంఖ్య, దానితో బాటే అధిష్టానంపై ఒత్తిడి పెరిగిపోవచ్చు కనుక త్వరలోనే చంద్రబాబు నాయుడు దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చు.