తెలంగాణ లో వరుస ఎన్నికల కోలాహలం దాదాపుగా ముగిసింది. ఇక పాలనపై దృష్టి సారించేందుకు సీఎం కేసీఆర్ సిద్దమవుతున్నారు. మంత్రి వర్గాన్ని ప్రక్షాళన చేయటంతో పాటు శాఖల మార్పు, పూర్తి స్థాయి క్యాబినెట్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. జూన్ రెండో వారంలో.. ఈ ప్రక్రియ పూర్తి చేయాలనుకుంటున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఫలితం చూపించలేకపోయినవారికి ఉద్వాసన..!
ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో రెండో సారి సీఎంగా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కేసీఆర్ మహమూద్ అలీని మాత్రమే మంత్రిగా చేర్చుకున్నారు. రెండు నెలల తర్వాత మరో పది మంది మంత్రులకు క్యాబినెట్ లో చోటు కల్పించారు. మంత్రులకు లోక్‌సభ బాధ్యతలు ఇచ్చి టెస్ట్ పెట్టారు. లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోవటంతో… కొందరు మంత్రులకు ఉద్వాసన తప్పదనే ప్రచారం ఊపందుకుంది. ఆదిలాబాద్, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ, భువనగిరి నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎఫెక్ట్.. ఇంఛార్జిలుగా పని చేసిన మంత్రులపై పడే అవకాశం ఉంది. ఒకరిద్దరిని తప్పించి..కొంత మందికి శాఖలు కూడా మార్చే అవకాశం కనిపిస్తోంది.
కవిత, కేటీఆర్‌లకు కేబినెట్లో చోటు ఉందా..?
నిజమాబాద్ లో ఓటమి పాలైన మాజీ ఎంపీ కవితకు మంత్రిగా అవకాశం దక్కొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే పదవిని కవిత కోసం త్యాగం చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రకటించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలవటంతో ఖాళీ అవుతున్న హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో కవితను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఆ నిర్ణయం తీసుకుంటే… మంత్రివర్గంలోకి కవిత ఖాయమని చెబుతున్నారు. మాజీ మంత్రులు కొందరు మళ్ళీ మంత్రి పదవి తమకు దక్కొచ్చని భావిస్తున్నారు. ఇందు కోసం తమ ప్రయత్నాలు తాము చేసుకుటున్నారు.
హరీష్ రావు సంగతేమిటి..?
హరీష్ రావుకు మంత్రి వర్గంలో చోటు దక్కుతుందా లేదా అన్న ఆసక్తికర చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. హారీష్ ను అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో పక్కన పెట్టారన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో హరీశ్ ను సరిగా వాడుకుంటే ఆ ఏడు సీట్లు ఓడేవి కావన్న చర్చ జరుగుతోంది. ఈ సారి జరిపే విస్తరణలో హరీశ్ కు చోటు ఉంటుందా లేక పక్కన పెడుతారా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. కేంద్రంలో బిజేపికి స్పష్టమైన మెజార్టీ రావడంతో కేంద్రంలో చక్రం తిప్పుదామనుకున్న కేసీఆర్ ఇక తెలంగాణకే పరిమితం కానున్నారు. కాబట్టి కేటీఆర్‌కు కూడా చాన్స్ ఉంటుందంటున్నారు.