మోత్కుపల్లి నర్సింహులు… తెలంగాణలో టీడీపీ నేత. రాష్ట్రంలో ఉన్న కొద్దిమంది పార్టీ నేతల్లో ఈయనే సీనియర్. కానీ, ఆయన మాట చెల్లడం లేదన్నది మోత్కుపల్లి ఆవేదనగా తెలుస్తోంది. ఎన్నాళ్లుగానో పార్టీలో ఉంటున్నా ఇంకా గుర్తింపు కోసం వెయిట్ చేస్తున్న నేతగానే మిగిలిపోతూ వస్తున్నారు. తాజాగా తెలంగాణలో తొలి మహానాడు జరిగింది. దీంతో ఇన్నాళ్లూ వార్తల్లో లేని మోత్కుపల్లి మళ్లీ తెరమీదికి వచ్చారు. ఈ కార్యక్రమం అంతా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సెంట్రిక్ గా జరగడం సహజం. కానీ, ఇదే కార్యక్రమంలో రేవంత్ రెడ్డికి అధిక ప్రాధాన్యత దక్కిందనే అభిప్రాయం కొంతమందిలో నెలకొంది. మరి, మనసులో ఇదే అభిప్రాయంతో ఉన్నారేమో తెలీదుగానీ… మోత్కుపల్లి కొన్ని ప్రశ్నలు వేశారేమో తెలీదుగానీ, వాటికి జవాబు రాకపోవడంతో ఆయన ఆవేదన చెందుతున్నట్టు సమాచారం!
ఇంతకీ తెలంగాణలో పార్టీ అధ్యక్షుడు ఎవరు అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారట! అంతేకాదు, తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకుంటుందనే క్లారిటీ కావాలని అంటున్నారట! ఒక పక్క రేవంత్ రెడ్డి పొత్తుల విషయంలో తన సొంత అజెండా అమలుకు సిద్ధమైపోతున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీతో అయినా పొత్తుకు సిద్ధమని చెప్తున్నారు. ఇదే విషయమై చంద్రబాబు దగ్గర ప్రస్థావిస్తే.. నిర్ద్వంద్వంగా కొట్టిపారేయకుండా… వేచి చూడమంటూ చెప్పారు. ఈ పరిణామాలపై మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. టీ టీడీపీ ఎటువైపు వెళ్తోందో అనీ, కాంగ్రెస్ తో పొత్తు ఎలా సాధ్యమనీ, ఇంత కీలకమైన విషయమై చంద్రబాబు ఎటూ తేల్చకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారనీ, మహానాడులో తాను అడిగిన ప్రశ్నలకు జవాబు ఎందుకివ్వడం లేదంటూ సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు చెప్పుకుంటున్నారు.
అయితే, మోత్కుపల్లి ఆవేదనను మరోలా కూడా అర్థం చేసుకోవచ్చు! ఆయన 1983లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఎన్టీఆర్ క్యాబినెట్ లో పనిచేశారు. 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ట్రాక్ రికార్డ్ ఆయనది. ఇక, రేవంత్ విషయానికొస్తే 2009లో ఎమ్మెల్యే అయ్యారు. ఆయన కంటే చాలా జూనియర్. కానీ, ఈ మధ్య రేవంత్ ప్రదర్శిస్తున్న దూకుడుతో ఇతర టీడీపీ నేతలు వెనకబడిపోతున్నారు అనడంలో సందేహం లేదు. టీ టీడీపీ అంటే రేవంత్ రెడ్డి అన్నట్టుగా పరిస్థితిని మార్చుకున్నారు. దీంతో ఇతర నేతలకు గుర్తింపు ఉండటం లేదు! సో.. ఇప్పుడు మోత్కుపల్లి కూడా ప్రత్యేకంగా చేసేదంటూ ఏమీ లేదు కదా! ఆయన పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నప్పటికీ, పార్టీలో మోత్కుపల్లి ప్రాధాన్యత ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. కాబట్టి, ఆయన అడుగుతున్న ప్రశ్నలకు చంద్రబాబు నుంచి సమాధానం వస్తుందని ఆశించలేం. కానీ, కాంగ్రెస్ తో తెలుగుదేశం పొత్తు ఆలోచనపై ఆయన ఆవేదనలో మాత్రం అర్థముందనడంలో ఎలాంటి సందేహం లేదు.