రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ అభ్యర్థికి గట్టిపోటీ ఇచ్చేందుకు విపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు ఢిల్లీలోజరుపుతున్న సభకు కేసీఆర్ హాజరు కావడం లేదు. టీఆర్ఎస్ తరపున కూడా ఎవరూ హాజరు కావడం లేదు. అంటే బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న సమావేశానికి టీఆర్ఎస్ దూరంగా ఉన్నట్లే. ఓ వైపు బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా శక్తులను కూడగడతానని.. ప్రత్యేక జాతీయ పార్టీ పెడతానని భీకర ప్రకటనలు చేస్తున్న కేసీఆర్.. చివరికి కీలకమైన సమయాల్లో ఆ పార్టీకి అనుకూలంగా ఉండేలా నిర్ణయాలు తీసుకుంటూండటం.. కేసీఆర్ రాజకీయ వ్యూహాలపై సీరియస్ నెస్ లేకుండా చేస్తోంది.
కాంగ్రెస్ను కూడా సమావేశానికి పిలువడం వల్లనే తాము రావడం లేదని టీఆర్ఎస్ కారణం చెబుతోంది. అయితే కాంగ్రెస్ లేకుండా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎలా సాధ్యమని ఎవరికైనా డౌట్ వస్తుంది. కేసీఆర్కు రాదని అనుకోవడానికి లేదు. అదే సమయంలో ఈకూటమికి ఆప్ లాంటి పార్టీలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఆప్ ప్రమాదకరంగా మారిందన్న ప్రచారం జరుగుతోంది. అయినా ఆ పార్టీ ఈ సమావేశానికి వెళ్లడం రాజకీయంగా నష్టమని అనుకోవడం లేదు. కానీ కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎవరూ చెప్పని టీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ ఉందన్న కారణంగా వెళ్లడం లేదు.
కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టి అన్ని రాష్ట్రాల్లో సొంతంగా పోటీ చేయాలనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఏ ఇతర పార్టీలతోనూ పొత్తుల్లాంటివి పెట్టుకోకుండా.. అందర్నీ ప్రత్యర్థులుగా ప్రకటించి ఎన్నికల్లో పోటీ చేస్తారేమోనని అందుకే ఇతర పక్షాలతోనూ పెద్దగా కలిసేందుకు ఇష్టపడటం లేదని అంటున్నారు. ఇలాంటి కీలక సమయాల్లో ఇతర పార్టీలతో కలవకపోతే.. తర్వాత వాసు కేసీఆర్ పిలిచినా పట్టించుకోరని.. చెబుతున్నారు. మొత్తానికి కేసీఆర్ జాతీయ రాజకీయాల వ్యూహం మాత్రం గందరగోళంగా ఉందని టీఆర్ఎస్ వర్గాలు కంగారు పడుతున్నాయి.