నందమూరి బాలకృష్ణ చేసిన ‘ఎన్టీఆర్ బయోపిక్’ ప్రకటన ఇప్పుడు సినీ,రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయంశమైయింది. తన తండ్రి విశ్వవిఖ్యాత నట సౌర్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కిస్తానని, అందులో ఎన్టీఆర్ పాత్ర తానే పోషిస్తానని బాలయ్య ప్రకటించడం ఆసక్తినిరేపుతోంది. ఇప్పుడుఎన్టీఆర్ బయోపిక్ గురించే మాట్లాడుకుంటున్నారు అంతా. ఎన్టీఆర్ బయోపిక్ ఎలా వుండబోతుంది? ఎన్టీఆర్ లో ఎన్ని కోణాలు చూపిస్తారు? ఆయన జీవితంలో ఎలాంటి ఘట్టాలను తెరపై ఆవిష్కారిస్తారు? ఎత్తుపల్లాలను చూపిస్తారా ? ఇందులో లక్ష్మి పార్వతి పాత్ర కనిపిస్తుందా ? ‘వెన్నుపోటు’ఎపిసోడ్ వుంటుందా ? చంద్రబాబు పాత్రను పోషించేది ఎవరు? ఇలా చర్చించుకుంటున్నారు.
అయితే ఈ చర్చలో చాలా కీలకమైన పాత్ర గురించి విస్మరిస్తున్నారనే ఓ అభిప్రాయం వ్యక్తమౌతుంది. అదే.. అక్కినేని నాగేశ్వరరావు పాత్ర. ఎన్టీఆర్, ఏఎన్నార్ తెలుగు చనల చిత్ర చరిత్రలలో రెండు మూలస్థంబాలు. తెలుగు సినిమాకి పర్యాయ పదాలు. ఎన్టీఆర్ అనగానే ఏఎన్నార్, ఏఎన్నార్ అనగానే ఎన్టీఆర్.. ఇలా గుర్తుండిపోయిన కధానాయుకలు వీరిద్దరు. ఒకరు పౌరాణికాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటే.. మరొకరు సాంఘిక చిత్రాలతో ప్రేక్షకుల మదిలో చిరస్థాయిలో నిలిచిపోయిన వ్యక్తులయ్యారు. అలాగే ఇద్దరూ కలసి చేసిన ఎన్నో అపురూపమైన చిత్రాలు వున్నాయి. అన్నిటికీమించి వీరిమధ్య మంచి స్నేహం వుంది. ఒక్కమాటలో చెప్పాలంటే అసలు అక్కినేనిపాత్ర లేని ఎన్టీఆర్ బయోపిక్ ని వూహించలేం.
మరి అంతటి కీలకమైన అక్కినేని పాత్రలో ఎవరైతే బావుటుందనే ప్రశ్న వేసుకుంటే.. ఎన్టీఆర్ పాత్రను వారసుడిగా తనయుడు బాలకృష్ణ పోషిస్తున్నపుడు, ఏఎన్నార్ వారసుడిగా ఆయన పాత్రను నాగార్జున చేస్తే బావుటుంది కదా అనే అభిప్రాయం వ్యక్తంమౌతుంది. నాగార్జున చేయకపోయినా నాగచైతన్య చేసినా బావుటుంది. కాని ఎదురుగా వున్నది బాలకృష్ణ కాబట్టి ఆయన సమవుజ్జిగా నాగార్జున చేస్తేనే అందంగా వుటుంది. కాని ఇక్కడో సమస్య వుంది. బాలకృష్ణకు నాగార్జున కు మధ్య ఏవో మనస్పర్ధలు వున్నాయి. చాలా సందర్భాల్లో ఇది బయటపడింది. ఏఎన్నార్ వెళ్ళిపోయినప్పుడు బాలయ్య కనీసం పరామర్శకు రాలేదు. వేడుకల్లో కూడా ఈ రెండు కుటుంబాలు కలసి కనిపించవు. మొన్న ‘శాతకర్ణి’ లాంచింగ్ కూడా తన సమకాలిక హీరోలు చిరంజీవి, వెంకటేష్ లను పిలిచిన బాలయ్య నాగార్జునను విస్మరించారు. ఎక్కడ ఏం జరిగిందో కానీ బాలయ్య , నాగార్జున ల మధ్య స్నేహం పూర్వక వాతావరణం లోపించింది.
మరి ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ కు రెడీ అవుతున్నారు బాలయ్య. ఈ నేపధ్యంలో… ఎన్టీఆర్ బయోపిక్ లో ఏఎన్నార్ పాత్ర ఎంత ప్రాధాన్యత ఇస్తారు ? ఈ పాత్ర కోసం నాగార్జునను సంప్రదిస్తారా? లేదా వేరే నటుడితో ఆ పాత్రను చూపిస్తారా? అలా చూపిస్తే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.