ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎక్కడా కనిపించే అదృష్టం వారికి లేదు. కానీ జనంలో ఉంటూ, జనం గురించి మాట్లాడుతూ ఉన్నట్లుగా కనిపిస్తే తప్ప.. భవిష్యత్తులో కూడా పార్టీకి అస్తిత్వం లేకుండా పోతుందనే సంగతి ఎంతో సీనియర్ నాయకులైన కాంగ్రెస్ వారికి కచ్చితంగా తెలుసు. అందుకే పాపం.. ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఒక దాని తర్వాత మరొకటి.. ఏదో ఒక ఉద్యమాన్ని భుజానికెత్తుకుని పోరాడుతూనే ఉన్నారు. మోడీకి ఉత్తరాలు, ఎస్సెమ్మెస్‌లు, మట్టినీళ్లు, సంతకాలు ఇలా అన్ని పోరాటాలు పూర్తయిపోయాయి. తాజాగా ఏపీ ప్రజల దృష్టిని ఆకర్షించడానికి పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు గురించిన భయాలను జనంలో నాటడానికి ప్రయత్నిస్తున్నారు.
తెరాస సర్కారు సంకల్పిస్తున్న ఈ ప్రాజెక్టు గనుక పూర్తి అయితే కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు ,నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాలు మొత్తం ఎడారిగా మారుతాయంటూ రఘువీరా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఏపీలో 8 జిల్లాలు ఎడారి అయిపోతుండగా.. సర్కారు పట్టించుకోలేదని అంటున్నారు.
నిజానికి ఈ ఎత్తిపోతల వల్ల సీమ జిల్లాలకు నీటి ఇబ్బందులు ఉంటాయన్న మాట నిజమే అయితే. రఘువీరా అతిశయోక్తులు జత చేసినట్లుగా 8 జిల్లాలు ఎండిపోతాయన్నమాట అవాస్తవం. అలాగే ప్రభుత్వం పట్టించుకోలేదనే మాట కూడా అవాస్తవం. ఒకవైపు చంద్రబాబు సర్కారు దీనికి అడ్డు పడుతున్నదంటూ తెరాస నేతలు, హరీష్ ప్రభృతులు విచ్చలవిడిగా తిట్టడాన్ని కూడా జనం గమనిస్తున్నారు.
అసలు సంగతి ఏంటంటే.. రఘువీరా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తారు సరే.. ఆయన వెంట నిలిచి మద్దతిచ్చే వారెవరైనా ఉన్నారా? తెలంగాణలో కూడా ఉనికి ఉన్న కాంగ్రెస్ పార్టీ అక్కడి నాయకులతో కూడా తమ డిమాండ్ సహేతుకమైనదని చెప్పించగల స్థితిలో ఉంటేనే.. రఘువీరా మాటలను జనం నమ్ముతారు. అలా కాకుండా.. ఇక్కడ రఘువీరా పోరాటం అంటూ తెలంగాణ కాంగ్రెస్ దాన్ని తిప్పికొడుతూ ఉంటే.. ఇదంతా పెద్ద డ్రామా నడుస్తున్నదని జనం సులువుగా గుర్తించేస్తారు.