వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేస్తానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తరచూ చెబుతూ వచ్చారు. అయితే, కేవలం ఆంధ్రాలో మాత్రమే పోటీ చేస్తారేమో అనేట్టుగా ఆయన మాటలుండేవి. కానీ, ఇప్పుడా సస్పెన్స్‌కు తెరదించేశారు కదా! ఆంధ్రాతోపాటు తెలంగాణలో కూడా 2019 ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందనీ, అన్ని స్థానాలకూ అభ్యర్థుల్ని నిలబెడుతుందని క్లారిటీ ఇచ్చేశారు. అయితే… తెలంగాణలో జనసేనకు నాయకులు ఎవరా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఎందుకంటే, సినీ నటుడిగా పవన్ కల్యాణ్‌కు తెలంగాణలోనూ పెద్ద ఫ్యాన్ బ్యాంక్ ఉంది. కానీ, జనసేన పార్టీని నమ్మి, ఎన్నికల బరిలోకి దిగేందుకు ఎంతమంది నాయకులు ముందుకొస్తారనేది చర్చ.
గడిచిన ఎన్నికల్నే తీసుకుంటే, అప్పట్లో తెలంగాణకి వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ భారీ ఎత్తున ప్రచారం చేశారు. దీంతో తెరాసతోపాటు ఇతర పార్టీలు కూడా పవన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల తరువాత పవన్ సభలన్నీ ఆంధ్రాకే పరిమితం అయ్యాయి. తెలంగాణలో ఒకరిద్దర్ని పరామర్శించిన సందర్భాలున్నాయంతే. కానీ, ఏపీకి ప్రత్యేక హోదా అనీ… రాజధాని ప్రాంత రైతుల సమస్యలనీ.. తుందుర్రు మెగా ఆక్వా ప్రాజెక్ట్ బాధితులకు సాయమనీ… చేనేత కార్మికులకు చేయూత అనీ… ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలనీ.. ఇలా పవన్ పోరాటాలన్నీ ఏపీకి మాత్రమే పరిమితమౌతూ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య తెలంగాణలో జనసేన ఉనికి ఎక్కడ అనే ప్రశ్న వస్తుంది.
పైగా, తెలంగాణలో ప్రస్తుతం మరో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీకి అవకాశం ఉందా అంటే… అదీ కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే, ఉద్యమ పార్టీగా తెరాస ప్రస్తుతానికి బలంగానే ఉంది. అలాగని ప్రభుత్వ వ్యతిరేకత లేదని కాదు. ఉన్న ఆ వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ ఓ మాదిరిగా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. తెలుగుదేశానికి ఇంకా మనుగడ కోసమే పోరాటం సాగిస్తోంది. ఇక, ఏ రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలపైనా, నిరుద్యోగుల తరఫునా పోరాడేందుకు జేయేసీ ఛైర్మన్ కోదండరామ్ ఉండనే ఉన్నారు. ఇంకోపక్క భాజపా కూడా తెలంగాణలో పుంజుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అమిత్ షా కూడా ఫోకస్ పెంచారనీ అంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల మధ్య జనసేనకు తెలంగాణలో ప్లేస్ ఎక్కడుందీ అనేది ప్రశ్న. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమని ప్రకటించినా… ఎవరో జగ్గారెడ్డి లాంటి నేతలు మాత్రమే జనసేనకు వచ్చే ఆస్కారం కనిపిస్తోంది. ఎందుకంటే, గతంలో పవన్ రిఫరెన్స్‌తోనే ఆయన భాజపాలోకి వెళ్లారు కదా! ఈ మధ్య పవన్‌ను ఆయన కలుసుకున్నారు కూడా! కాబట్టి, జనసేనకు జగ్గారెడ్డి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణలో కొత్త నేతలకు జనసేన అవకాశం ఇస్తుందా..? ఇతర పార్టీల నుంచి వద్దామనుకున్నవారిని ఆహ్వానిస్తుందా..? అన్నిటికన్నా ముందు తెలంగాణకు జనసేన ఏం చేసిందన్న ప్రశ్నకు జవాబు పవన్ దగ్గర ఉందా..? పోనీ, మున్ముందు ఏం చేయబోతుందో కూడా పార్టీ తరఫున చెప్పగలరా..? సో.. ఎన్నికల్లో పోటీకంటే ముందుగా వీటిపై ప్రజలకు ఓ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి, ఈ దిశగా పవన్ వ్యూహం ఏంటో వేచి చూడాలి.