గుజరాత్లోని ముంద్రా పోర్టు నుంచి స్మగ్లింగ్ అవుతూ దొరికిపోయిన హెరాయిన్ విలువ రూ. 9వేల కోట్లు కాదని రూ. 23వేల కోట్లపైనే ఉంటుందని డీఆర్ఐ అధికారులు ప్రకటించారు. విజయవాడలోని అషీ ట్రేడింగ్ కంపెనీ రిజిస్టర్ చేసిన తెలుగు దంపతుల్ని అరెస్ట్ చేసి గుజరాత్ తీసుకెళ్లి ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున దిగుమతి చేసుకున్నారన్న లెక్కలు ఉండటంతో అసలు కింగ్ పిన్ ఎవరో తేల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో ఒక్క ముంద్రా పోర్టు నుంచి మాత్రమే కాదని ఏపీలోని కృష్ణపట్నం నుంచి కూడా డ్రగ్స్ స్మగ్లింగ్ జరిగిందన్న అనుమానాలు బలపడుతున్నాయి.
అటు ముంద్రా పోర్టు.. ఇటు కృష్ణపట్నం పోర్టు రెండూ అదానీ పోర్ట్స్ అధీనంలో ఉన్నాయి. అదానీ సంస్థపై తీవ్రమైన అభియోగాలు రావడంతో ఆ సంస్థ ప్రెస్ నోట్ విడుదల చేసింది. కేవలం పోర్టు నిర్వహణతో మాత్రమే తమకు సంబంధం ఉంటుందని ఎగుమతి.. దిగుమతి అయ్యే వాటిని తనిఖీ చేసే అధికారం తమకు లేదని స్పష్టం చేసింది. తమపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ప్రకటించింది. ఈ విషయంలో సోషల్ మీడియాలో ప్రచారం చేసే వారు నిజాలు తెలుసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేసింది.
అయితే పోర్టులు అదానీ చేతుల్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం లో అదానీకి ఉన్న పలుకుబడి అంతా ఇంతా కాదు. ఇలాంటి సమయంలో అదానీపై విమర్శలు రావడం సహజమే. ప్రజల్లో అనుమానాలు పెరిగిపోవడం కూడా కామనే. అందుకే ఇప్పుడు కేంద్రం అత్యంత జాగ్రత్తగా ఈ కేసును డీల్ చేసి.. సూత్రధారులు, పాత్ర దారులందర్నీ పట్టుకోకపోతే దేశానికి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పంజాబ్ , హైదరాబాద్, ముంబై వంటి చోట్ల డ్రగ్స్ ఎన్ని దారుణాలు చేస్తున్నాయో చూస్తూనే ఉన్నాం.
మరో వైపు ఏపీలోనూ ఈ అంశం రాజకీయ కలకలానికి కారణం అవుతోంది. దర్జాగా ఏపీలోనే కంపెనీని రిజిస్టర్ చేసి తీసుకు రావడందీనికి కారణం. ఏపీకి తీసుకొస్తున్నారన్నదానిపై స్పష్టత లేకపోయినా రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.