ఐఐఎఫ్ఏ అవార్డుల జ్యూరి మెంబర్స్ కి ఇప్పుడో పెద్ద చిక్కొచ్చిపడింది. తెలుగులో బెస్ట్ హీరో ఎవరో సెలక్ట్ చేయడం వారికి కత్తిమీద సామే. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ ఇచ్చే ఈ అవార్డుల్లో తెలుగులో బెస్ట్ లీడ్ యాక్టర్ గా నలుగురు పోటీపడుతున్నారు. అందరూ ఒకరిని మంచి మరొకరు ప్రతిభ చూపిన వారే. వారిలో బెస్ట్ ఎవరో తేల్చడం ఇప్పుడు జ్యూరీ ముందున్న సవాల్.
బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తాని ప్రపంచవ్యాప్తం చేసిన ప్రభాస్, శ్రీమంతుడిగా తెలుగు సినిమాకి కొత్త అడుగులు నేర్పిన సూపర్ స్టార్ మహేశ్ బాబు, టెంపర్ తో తనలోని విశ్వరూపాన్ని చూపించిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, గోపాల గోపాల మూవీతో ఆబాల గోపాలాన్ని అలరించిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ నలుగురు బెస్ట్ యాక్టర్ గా నామినేషన్స్ పడ్డాయి. అయితే ఈ నలుగురిలో ఒకరిని సెలక్ట్ చేయడం జడ్జిలకి సవాలే. ఇక బాహుబలి చాలా కేటగిరీల్లో నామినేట్ అయింది. శ్రీమంతుడు కూడా బెస్ట్ పిక్చర్ రేస్ లో ఉంది. ఉత్తమ నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది మంచు లక్ష్మి. దొంగాటలో ఆమె నటనకిగాను ఫిమేల్ లీడ్ గా నామినేషన్ దక్కించుకుంది.
మొదటిసారి సౌత్ ఇండియా ఎడిషన్ గా జరగబోతున్న ఐఐఎఫ్ఏ ఉత్సవాలు.. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. అసలు డిసెంబర్ లోనే ఈ ఫంక్షన్ జరగాల్సి ఉన్నా.. తమిళనాడులో వరదల దృష్ట్యా వాయిదా పడింది. ఈనెల 24, 25 తేదీల్లో ఈ అవార్డుల ఫంక్షన్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు నిర్వాహకులు. మొదటి రోజు తమిళం, మలయాళం సినిమాల ప్రివ్యూ ఉంటుంది. రెండో రోజు తెలుగు, కన్నడ మూవీల ప్రివ్యూలు ఉండబోతున్నాయి. సౌత్ సిని పరిశ్రమకు సంబంధించిన హేమా హేమీలంతా ఈ అవార్డ్ ప్రదానోత్సవంలో పాల్గొననున్నారు.